సభా పర్వము1
ఈ శ్రవణ భాగంలో ఖాండవ దహనం నుండి తనను కాపాడినందుకు ప్రతిఫలంగా రాక్షస శిల్పి మయుడు కృష్ణార్జునుల కోరికపై ధర్మజునికొఱకు ఒక అపూర్వమైన, అద్భుతమైన సభాభవనాన్ని నిర్మించి ఇచ్చుట, సభ అంటే ఏమిటి, సభికులు అంటే ఎవరు మొదలగు విషయాలపై చర్చ, ధర్మజుడు మయసభాప్రవేశము చేయుట, ధర్మజునివద్దకు నారదుడి రాక, రాజధర్మాలైన త్రయీ, అన్వీక్షకీ, వార్త, దండనీతి మొదలగు విషయాల వివరణ మొదలగునవి కలవు
ఈ శ్రవణ భాగంలో ధర్మజునికి నారదుని రాజనీతి ఉపదేశంలో భాగంగా మంత్రాంగం, ఉత్తమ మధ్యమ అధమ నియోగం, సకాలంలో భృత్యులకు వేతనాలు చెల్లించుట మొదలగునవి కలవు
ఈ శ్రవణ భాగంలో గూఢచారుల నియామకం, యుద్ధానికి ముందు సామ దాన భేద ఉపాయాలు ఉపయోగించుట, ఉండకూడని పదునాలుగు రాజదోషాలు, ధర్మరాజు నారదుడిని మయసభవంటి సభ ఎందేని కలదా అని ప్రశ్నించుట, నారదుడు ఇంద్రసభ, వరుణ సభ, కుబేర సభ, యమ సభ, బ్రహ్మ సభ వర్ణించుట. ధర్మరాజు నారదుని పాండురాజు యమసభలో , హరిశ్చంద్రుడు ఇంద్రసభలో ఉండుటకు గల కారణమడుగుట, నారదుడు హరిశ్చంద్రుని మాహాత్మ్యమును గురించి తెలుపుట, నారదుడు ధర్మరాజుకు పాండురాజు సందేశాన్ని వినిపించుట.
ఈ శ్రవణ భాగంలో నిత్య కర్మ, కామ్య కర్మల గురించిన ప్రస్తావన,రాజులు రాజసూయం చేయడం వెనుకగల గూఢార్థ విశ్లేషణలతో పాటు రాజసూయం బహువిఘ్నమని, అది పూర్తి చేసిన పిదప ప్రజాప్రళయకారణమైన యుద్ధం సంభవిస్తుందని నారదుడు తెలిపిన సంగతి, ధర్మరాజు తమ్ములతో, మంత్రి పురోహితులతో చర్చించి రాజసూయం చేయ సమకట్టి శ్రీకృష్ణుని రావించి ఆతని అభిప్రాయము తెలియగోరుట, కృష్ణుడు ధర్మరాజు నిర్ణయాన్ని సమర్థించి అప్పటి రాజలోక పరిస్థితిని వివరించుట.
ఈ శ్రవణ భాగంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుకు జరాసంధుని సామర్థ్యమును గూర్చి చెప్పి, జరాసంధుని సన్నిహితులైన హంస డిభకులు తన ఉపాయము చేత మడియుట వలన అతడు క్షీణబలుడైన సంగతి చెప్పుట, జరాసంధుని దుష్కృత్యాలను గురించి ధర్మజాదులకు తెలిపి అతనిని సంహరించిన రాజసూయము నిర్విఘ్నంగా కొనసాగగలదని చెప్పుట, భీమార్జునులు ధర్మరాజును రాజసూయము చేయుమని ప్రోత్సహించుట, ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఆతని కోరికపై జరాసంధుని జన్మవృత్తాంతము తెలుపుట.
ఈ శ్రవణ భాగంలో జరాసంధుని కథ పునరావలోకనము, ఎఱ్ఱన హరివంశంలోని జరాసంధుని కథ పరామర్శ
ఈ శ్రవణ భాగంలో శ్రీకృష్ణుడు భీమార్జునులను వెంటబెట్టుకుని గిరివ్రజపురమునకు అరుగుట, సాటిరాజులను బంధవిముక్తులను గావించనియెడల పోరుకు సిద్ధపడమని కృష్ణుడు జరాసంధుని హెచ్చరించుట.
ఈ శ్రవణ భాగంలో భీమ జరాసంధుల యుద్ధం, భీముడు జరాసంధుని మల్ల యుద్ధంలో సంహరించుట, శ్రీకృష్ణుడు జరాసంధ తనయుడైన సహదేవునికి అభయమిచ్చి, జరాసంధుని చెరలో గల రాజులను విడిపించి, వారిని తోడ్కొని భీమార్జునులతో హస్తినకు మరలుట.
ఈ శ్రవణ భాగంలో ధర్మరాజు తన నలుగురు తమ్ములను నాలుగు దిక్కులను జయించి రమ్మని పంపుట, అర్జునుడు ఉత్తర దిక్కునకు వెళ్ళి విజయపతాకమెగురవేయుట, భీమసేనుడు తూర్పు దిక్కున కల రాజులను జయించుట, సహదేవుడు దక్షిణాపథమును జయించి అనంతమైన సంపదలను తెచ్చుట, నకులుడు పశ్చిమ దిక్కునుండి అపూర్వ ధనరాశులను తెచ్చుట
ఈ శ్రవణ భాగంలో దైవీ సంపదకు సంబంధించిన 26 గుణాలు, 6 ఆసురీ గుణాలు ప్రస్తావనతో పాటు కథాగమనంలో భాగంగా ధర్మజుడి మంత్రులు ఆతనిని రాజసూయానికి ఉపక్రమించుమనుట, ధర్మజుడు శ్రీకృష్ణుని తనను యాగమునకు నియోగించమని అడుగుట, సహదేవుడు ధర్మరాజ అనుశాసనమున భీష్మాది కురు వీరులను, విరాట, ద్రుపదాది బంధుజనులను, శిశుపాల భగదత్తాది రాజులను యాగమునకై ఆహ్వానించుట, ధర్మరాజు భీష్మ, ద్రోణ, కృప, విదుర, దుర్యోధన, దుశ్శాసనాదులను తగు కార్యములలో నియోగించి తాను యజ్ఞదీక్షితుడగుట, రాజసూయ యాగారంభము