ఆరణ్య పర్వము1
ఈ శ్రవణభాగంలో పాండవులు కామ్యకవనానికి వెళ్ళడానికి నిశ్చయించుకోవడం, తమ వెంట అరణ్యానికి తరలిన పురజనులను సముదాయించి ధర్మరాజు వెనుకకు పంపడం, తన వారు కందమూలాదులెలా తినగలరని చింతిస్తున్న ధర్మజునికి, థౌమ్యుడు సూర్యుని ప్రార్థించమని ఆదిత్యాష్టోత్తర శతనామాలను ఉపదేశించడం, ధర్మజుడు నిష్ఠగా సూర్యుని నారాధించి అక్షయపాత్రను వరంగా పొందడం, చతుర్విధ ఆహార పదార్థముల గురించిన చర్చ, మొదలగునవి కలవు.
ఈ శ్రవణభాగంలో మహాభారతంలో ఆరణ్యపర్వానికి గల ప్రాముఖ్యత, తిక్కనామాత్యులు ఆరణ్యపర్వశేషాన్ని వదలివేయడానికి గల కారణాలు, నన్నయ భారతాన్ని, తిక్కన భారతాన్ని అనుసంధానిస్తూ పండితపామరజనరంజకంగా ఆరణ్యపర్వ శేషరచనను పూర్తిగావించిన ఎఱ్ఱనామాత్యులవారి కవితావిశేషాలు, నన్నయ అరణ్యపర్వమనే పేరు పెట్టడానికి గల కారణాలు, సుఖ,ధుఃఖాలతో కూడిన కర్మ సిద్ధాంత చర్చ, రోమశమహర్షి , ధర్మజుని మధ్య జరిగిన చర్చ, చార్వాకదర్శనం, వ్యాకరణవిశేషాల గురించిన చర్చ మొదలగునవి కలవు.
ఈ శ్రవణభాగంలో ధర్మరాజు తమ వెంట అరణ్యానికి తరలిన పురజనులను సముదాయించి వెనుకకు పంపడం, భూతములు, ప్రాణుల గురించిన చర్చ, బ్రాహ్మణులు వారి లక్షణాల వివరణ, జనకమహారాజు ప్రస్తావన, థౌమ్యుడు ధర్మరాజుకు ధర్మములను వివరించుట, మొదలగునవి కలవు.
ఈ శ్రవణభాగంలో అర్ధం గురించి సమగ్రమైన చర్చ, శౌనకుని ధర్మోపదేశం, గృహస్థాశ్రమ ధర్మాల చర్చ, పురోహితుని వివరణ, ధర్మరాజు సూర్యభగవానుని ఆరాధించుట, సూర్యుడు ధర్మజునికి అక్షయపాత్రను ప్రసాదించుట, మొదలగునవి కలవు.
ఈ శ్రవణభాగంలో జనకగీతంలోని సుఖదుఃఖాల వివరణ, బ్రాహ్మణోత్తములు, థౌమ్యుడు, ధర్మరాజుల మధ్య జరిగిన గార్హస్త్య ధర్మాల చర్చ, థౌమ్యుడు సూర్యుని గొప్పతనం వివరించుట, మయూరకవి రాసిన సూర్యశతకం పరిచయం, మొదలగునవి కలవు.
ఈ శ్రవణభాగంలో ఆర్యధర్మాల గురించిన చర్చ, మనుస్మృతిలో చెప్పిన ధర్మాలను విదురుడు ధృతరాష్ట్రునికి తెలియజేయుట, ధర్మరాజుకు పట్టాభిషేకం చేసి, దుశ్శాసనునితో ద్రౌపదికి క్షమాపణలు చెప్పించమని విదురుడు ధృతరాష్ట్రునికి నచ్చజెప్పుట. విదురుని మాటలకు ధృతరాష్ట్రుడు ఇచ్చిన సమాధానం, విదురుడు కామ్యకవనానికి చేరుకొనుట, విదురుని రాకకి గల కారణమేమిటా అని పాండవులు తమలో తాము చర్చించుకొనుట మొదలగునవి కలవు.
ఈ శ్రవణభాగంలో గోవిందరాజులు గారి మనుస్మృతి వ్యాఖ్యాన ప్రస్తావన, హారీతుడు తెలిపిన పదమూడు వ్యక్తిత్వ లక్షణాల గురించిన చర్చ, ధృతరాష్ట్రుని ఆజ్ఞ మేరకు సంజయుడు కామ్యకవనానికి పయనమగుట, పాండవులు నివసిస్తున్న కామ్యకవన పరిసరాల వర్ణన, పాండవుల విన్నపము మేరకు విదురుడు రాజ్యానికి తిరిగివెళ్ళుట, రాజ్యంలో ధార్తరాష్ట్రాదుల మధ్య జరిగిన చర్చ, పుత్రవ్యామోహం తగదని విదురుడు ధృతరాష్ట్రునికి నచ్చజెప్పుట, వ్యాసులవారు చెప్పిన ఇంద్రసురభుల సంవాదం మొదలగునవి కలవు.
ఈ శ్రవణభాగంలో ధుర్యోధనాదులు పాండవులమీదకు యుద్ధానికి సన్నద్ధమౌతున్నారని తెలిసి వ్యాసుడు పుత్రవ్యామోహం తగదని ధర్మబద్ధంగా నడచుకొమ్మని ధృతరాష్ట్రునికి నచ్చజెప్పడం, ధృతరాష్ట్రుడు వ్యాసుని మాటలను లక్ష్యపెట్టకపోవడం, వ్యాసుడు మైత్రేయమహర్షిని ధార్తరాష్ట్రులకు నచ్చజెప్పుటకు పంపుట, ధార్తరాష్ట్రాదులు, మైత్రేయుల మధ్య జరిగిన సంభాషణ, మైత్రేయుడు తనను అవమానించిన ధుర్యోధనుని శపించుట, శాపవిమోచనం చెప్పమని ధృతరాష్ట్రుడు మైత్రేయుని కోరగా అతను మంచిబుద్ధితో మెలిగితే శాపం వర్తించదని తెల్పుట, ధృతరాష్ట్రుడు మైత్రేయుని కిమ్మీరుని వృత్తాంతం తెలుపమని అడుగుట, మైత్రేయుడు తిరస్కరించి విదురుడిని అడగమని చెప్పుట, ధృతరాష్ట్రుని కోరికమేరకు విదురుడు, ధుర్యోధనాదులకు కిమ్మీరవృత్తాంతమును వివరించుట, ధృష్టద్యుమ్నులతో కలిసి శ్రీకృష్ణుడు కామ్యకవనానికి వచ్చుట, శ్రీకృష్ణుడు పాండవాదులకు ధైర్యం చెప్పుట, ద్రౌపది తనకు జరిగిన పరాభవాలను శ్రీకృష్ణునికి విన్నవించుట, కృష్ణార్జునులు కౌరవులచావు తథ్యమని చెప్పి ద్రౌపదికి ఊరట కల్గించుట, మొదలగునవి కలవు.
ఈ శ్రవణభాగంలో శ్రీకృష్ణుడు పాండవాదులకు తాను శిశుపాలుని, సాల్వుని వధించిన విషయము తెలియపరచుట, ద్వారకా నగర వర్ణన, వివిధరకాల ఆయుధాల పరిచయం, శ్రీకృష్ణుడు పాండవులకు ధైర్యం చెప్పుట, శ్రీకృష్ణుడు సుభద్రాభిమన్యులను తోడ్కొని ద్వారకాపురికి పయనమగుట, ధృష్టద్యుమ్నుడు ఉపపాండవులను తోడ్కొని ద్రుపదపురమునకు మరలుట, ఇంద్రసేనుడు, ధౌమ్యుడు మొదలైన వారిని తోడ్కొని పాండవాదులు ద్వైతవనమునకు పయనమగుట, ధర్మరాజు తన వారందరికీ ద్వైతవనం అత్యంత ప్రమాదకరమైనదని జాగరూకతతో మెలగవలెనని హెచ్చరించుట, ద్వైతవనానికి మార్కండేయమహర్షి ఆగమనం, మొదలగునవి కలవు.
ఈ శ్రవణభాగంలో యోధానుయోధులు, అపరిమిత శక్తిసామర్థ్యాలు కలిగినట్టి పాండవులు అడవుల పాలగుట చూసి కలతచెందిన ద్రౌపది వారిని చూడలేక తాననుభవిస్తున్నమానసికక్షోభను ధర్మరాజుకు తెలియపరచుట, ద్రౌపదీ ధర్మజుల మధ్య జరిగిన సంవాదము, ఆటవెలది ఛందోవిశేషాలు, కోదండ విశేషాలు, క్షమ, తేజస్సుల గురించిన సమగ్రమైన చర్చ, మొదలగునవి కలవు.