విరాట పర్వము

విరాట పర్వాన్ని హృదయాహ్లాది, చతుర్థం, ఊర్జిత కథోపేతం, నానా రసాభ్యుదయోల్లాసి గా తిక్కనగారు వర్ణించారు. నాటకాలలో నాలుగవ అంకం విశేషంగా పరిగణించబడుతుంది. మరి తిక్కనామాత్యులు విరాట పర్వాన్ని దృశ్యకావ్యంగానే(నాటకం) తెనుగు బాషలో 'వినిర్మింప' దలచారు కదా! కనుక మహాభారతమునందలి పద్దెనిమిది పర్వాలలో నాలుగవది అయిన విరాట పర్వానికి విశిష్టమైన ప్రాధాన్యాన్నిచ్చి, నవరసాలు సమపాళ్ళలో రంగరించి, ఊర్జితమైన కథలతో తళుకులద్ది, హృదయాహ్లాదిగా తీర్చిదిద్దారు. విరాట పర్వంతో భారత కథ మంచి రసకందాయంలో పడుతుంది. అసలు విరాట పర్వంలోని అంశమే నాటకీయతతో కూడుకున్నది - పాండవులు మారువేషాలలో రహస్యంగా గడపవలసిన పరిస్థితి. కథ సంగ్రహంగా చూస్తే, పన్నెండేండ్ల అరణ్యవాసం తర్వాత, పదమూడవ సంవత్సరం అజ్ఞాతవాసదీక్ష కొఱకు పాండవులు మారు పేర్లతో విరాట నగరం ప్రవేశించి, విరాట రాజు కొలువులో ఉద్యోగాలు సంపాదించి కుదురుకుంటారు. అంతా బాగానే ఉండి, ఇంకొన్ని రోజులలో అజ్ఞాతవాసం ముగుస్తుందనగా మహాకాముకుడైన కీచకుని వలన మాలినిగా ఉన్న ద్రౌపదికి ఆపద రాగా, భీముడు అతిచాకచక్యంతో గంధర్వులన్న భ్రాంతి కలిగిస్తూ అతనిని, అతని తమ్ములను సంహరించి ఆమెకు సంతోషం కలిగిస్తాడు. దుర్యోధనుడు కుతంత్రంతో పాండవులను బయల్పరచాలని దక్షిణ, ఉత్తర గోగ్రహణాలకు పన్నాగం పన్నుతాడు. అప్పటికే అజ్ఞాతవాసం పూర్తి చేసుకున్నవారై, అర్జునుడు మినహా తక్కిన పాండవులు విరాటునికి బాసటగా వెళ్ళి సుశర్మను ఓడిస్తే, బృహన్నలగా ఉన్న అర్జునుడు ఉత్తరునికి రథసారథిగా వెళ్ళి ఆ పై గాండీవధారియై తన నిజరూపాన్ని ప్రకటించి భీష్మ, ద్రోణ, కర్ణ, సుయోధన, ఆశ్వత్థామాది యోధులను ఒక్కడే ఎదుర్కొని వారలను జయించి గోవులను మరలుస్తాడు. ఉత్తరాభిమన్యుల వివాహంతో మంగళదాయకంగా విరాట పర్వం ముగుస్తుంది.

Player
>>