యుద్ధ విశేషాలు1

అంత నట నుత్తరు నెదుర్కొనంబోయి’ ఉత్తరుడిని తీసుకునిరావాలని వెళ్లిన బ్రాహ్మణులు అక్షతలువేసి ఆయనను ఆశీర్వదిస్తూ జయజయధ్వానాలు చేస్తూ ఉండగా, పుణ్యాంగనలును ‘భద్రవాక్చయంబులతోడన్’ - జయహో జయహో అంటూ ఉండగా, అన్నగారు విజయం సాధించారని ఉత్తర ‘సువర్ణ పుష్పములు జల్లె’. ఎంత ప్రేమ ఉన్నా బంగారంతో చేసిన పుష్పాలు జల్లితే బాగుంటుందా? ధర్మరాజుకు వచ్చిన అవస్థే కలుగుతుంది. సువర్ణ పుష్పములు అంటే మనం ఏమర్థం చెప్పుకోవచ్చు?

          బంగారుపుష్పములు అని చెప్పుకుంటే భాషా సంబంధిత అభ్యంతరమేముండదు. సు-వర్ణము. మంచిరంగుతో మెరిసే పుష్పాలు, రంగురంగుల పూలను తెచ్చి చల్లింది ఉత్తర. ‘సువర్ణమాయతం కృత్వా కరమూలే వినిక్షిపేత్’ అన్నాడొక కవి. బంగారాన్ని బాగా దీర్ఘం చేసి, పొడిగించి, ‘కరమూలే వినిక్షిపేత్’ చేతిలో పెట్టుకుంటే ఏమవుతుంది ‘అతినీలమతి స్థూలమ్’ చాలా నల్లగా స్థూలంగా తయారవుతుందట, ‘యో జానాతి సః పండితః’ ఇది తెలిసినవాడే పండితుడు. బంగారం తేవడమెందుకు? దాన్ని పొడుగు చెయ్యడమెందుకు? చేతిలో పెట్టుకోవడమెందుకు? అది నీలము, స్థూలము, భయంకరము అయితే దాన్ని తీసుకోవడమెందుకు? ఇక్కడ సువర్ణం అంటే ఏమిటి? సు వర్ణము – ‘సు’ అనే వర్ణము అంటే అక్షరం. ‘సు’ అనే అక్షరం తీసుకుని ‘ఆయతం కృత్వా’-ఏమవుతుంది? సూ. ‘కరమూలే వినిక్షిపేత్’ కర అనే పదానికి ముందు పెట్టమన్నాడు. ఏమయింది? ‘సూకర’ అతి నీలమతి స్థూలం, మరిక్కడ సువర్ణాక్షతలు, సువర్ణపుష్పములు అంటే రంగు రంగుల అకక్షతలు, పూలు. వాటిని తీసుకుని ‘దందడి జల్లె కిరీటిమీఁద’ అప్పుడు అవి ముందున్న అర్జునుని మీద పడినవి. రథసారథి అతను కాబట్టి ముందుగా అతని మీదే పడతాయి. ‘ఉత్తరుపై’ ముందు కిరీటి పై, తర్వాత ఉత్తరునిపై పడ్డాయి ‘ప్రమోదకలనోత్కట సంభ్రమ సంభృతంబుగన్’.

          ఉత్తరుని ముఖం చూసి అందరూ ఆనందంతో, ఆశ్చర్యంతో “ఆహా! ఓహో!” అంటున్నారు. ఆతనిని అభినందిస్తున్నారు. ‘గెల్పు నుతింపఁగ రాజపుత్రుఁడ య్యెక్కుడు మాట కోరువక’ ఈ పొగడ్తలకు తను తగడని తెలుసు పాపం ఉత్తరునికి. మనసులో పీకుతోంది వాళ్ళందరూ అనవసరంగా పొగుడుతుంటే. ‘ఇట్లను నర్హజనంబుతోఁ దగన్ అర్హ జనంబుతో’ అందరితో అనలేదు. తనకు సన్నిహితులైన వాళ్ళతో. ఎవరో అర్హులైన జనం. ఆ ఉచితజ్ఞతను గమనించాలి మనం. అక్కడి జనంబుతో అని ఉండవచ్చు, కాని ‘అర్హ జనంబుతో’ అన్నారు. అంటే ఆయనకు ఎవరి దగ్గరైతే చనువుందో, ఈయనతో ఎవరికైతే చనువుందో వాళ్ళందరి దగ్గర అన్నాడు.

             ‘కురుబలమున్ జయించుటయు గోవులఁ దెచ్చుటయున్’ ఆ గోవులను తీసుకురావటం, ‘బృహన్నలా స్ఫురిత భుజాబలంబునన చూవె’ బృహన్నల సాయంవలననే. ‘నిజం బిది నాక యేల’ ఇది నిజము! నాకు మాత్రమే కాదు, ‘ఎవ్వరికిని గెల్వవచ్చునె’ ఎటువంటి వారినైనా ‘ధ్రువంబుగ నిట్టి సహాయసంపదం బొరయక యున్న’ ఇటువంటి సహాయసంపత్తులు లేకపోతే, గెల్చుట సాధ్యమౌతుందా? ‘మీ కెఱుఁగఁ బోలునె నా బ్రదు కెట్టి భంగియో’ నా ప్రతాపం ఎటువంటిదో మీకు తెలియనిదా?’ అని అర్హజనంబుతో చెప్పాడు.

Player
>>