బొమ్మపొత్తికలు1

ఆ కథాకథన నిర్వహణలో తిక్కనగారు పాటించిన ఔచిత్యము ఎంత గొప్పగా ఉందో చూడండి! ఈ ఘట్టంలో అందరూ పక్కపక్కనే ఉన్నట్టు భావిస్తాము. మనమూ ఆ సమావేశంలో అక్కడే ఉన్న అనుభూతి కలుగుతుంది. విరాటరాజు బృహన్నలను ‘పోవం బనిచిన’, వెళుతూ అర్జునుడు ‘చతురంబుగాఁ బలికి; తిదియ తెలుపు తెఱంగు’-  ఉత్తరునితో ప్రశంసాపూర్వకంగా మెల్లగా ‘నీవు చాలా చమత్కారంగా యథార్థాన్ని వెల్లడించావు. ఇలాగే చెప్పాలి’ అని ఉత్తరుడిని అభినందిస్తూనే హెచ్చరించాడు. ‘ధర్మనందనునకు నింతకు మిక్కిలి యెఱింగింప కుండునది’- ఇంతకన్నా వివరంగా ధర్మజునకు చెప్పవలసిన అవసరం లేదు.‘అని వైరాటితో నల్లన జెప్పుచుం జనియె

          ‘అజ్జన నాయకుండును గంకునిం బొమ్మని’- విరాటుడు మన ఆట అయిపోయింది. ఉత్తరుడు వచ్చాడు. ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. పొద్దు కూడా అయిపోయింది. ఇంక నువ్వు కూడా వెళ్ళు అని కంకుని పంపించాడు. ‘ఉచిత పరివారవృతుండయి భూమింజయు నంతిపురంబునకుం దోడ్కొని’- ఇక్కడ తిక్కనగారు కథ చెప్తున్నారు. విరాటపర్వప్రారంభంలోనే స్పష్టం చేశారుకదా, ‘వలసినట్లు చెప్ప వలసియుండు’ అని. అందుకని ఇక్కడ ఎవరెవరి సంభాషణలలో ఏవిధంగా చెప్పాలో, ఏ పదప్రయోగం చెయ్యాలో సన్నివేశ సందర్భాలను గాడంగా భావించి వ్రాశాడు, మహానుభావుడు. ఇక్కడ ఉత్తరుడు ఉత్తరగోగ్రహణయుద్ధవృత్తాంతాన్ని చెప్తున్న సందర్భంలో, ‘అర్జునుడు’ ‘ధర్మరాజు’ అన్న  పదాలను వాడటం అనౌచిత్యం. అందుకని ఈ సన్నివేశంలో ఎక్కడా పాండవుల నిజనామధేయాలను వాడలేదు, చదువుకుంటున్న అందరికీ తెలిసినప్పటికీ, ఆ సన్నివేశసందర్భంలో వారి పేర్లు అజ్ఞాతవాససమయ నిర్వహణం కోసం ఏర్పరచుకున్నవి, కాబట్టి ‘బృహన్నల’, ‘కంకుడు’, ‘సైరంధ్రి’ అన్నపదాలనే వాడటంలో కవిబ్రహ్మతత్త్వం  అవగతమౌతుంది. ప్రసంగంలో మనం అనుకుంటున్నాం ‘ఉత్తరుడు అర్జునుడితో ఇలా అన్నాడు’ అని. కాని తిక్కనగారలా అనలేదు. విరాటుడు కొద్దిపరివారంతో ఉత్తరుడిని తీసుకుని ‘సుదేష్ణాసందర్శన సమాచరణంబు నడిపి’- ఇది రాచకుటుంబాల్లో మర్యాద. ఊరికే సుదేష్ణను చూశాడు అంటే, సాధారణ జనవిశేషం అవుతుంది. ఒక చక్రవర్తి, పట్టమహిషిని ఎలా మన్ననతో చూడాలో, పలుకరించాలో అది ‘సుదేష్ణాసందర్శన సమాచరణం’. సుదేష్ణ అంతఃపురానికి వెళ్ళి ఉత్తరుడు జయించిన విధానం గురించి వివరించాడు. ‘నడపి యతం డడుగఁ త్రిగర్తపతి నోర్చిన తెఱం గెరిగించి’- యుద్ధవిశేషాలు అన్నీ చెప్పుకోవడం మొదలుపెట్టారు. సుశర్మతో జరిగిన యుద్ధవిషయాలు ముచ్చటించుకున్నారు. ‘అట్ల నరుండు నాట్యశాలకుం బోయి’- ఆ సమయంలో అర్జునుడు నాట్యశాలకు వెళ్ళాడు. బృహన్నల ఆ సభనుంచి బయటకి వచ్చిన తరువాత మళ్ళీ అర్జునుడైపోయాడు.

Player
>>