అర్జునుడు బహిర్గతమగుట1

అనిన విని’ - ఆ విరాటుని మాటలు విని ధర్మరాజు సమాధానం చెప్పలేదు. గంభీరంగా ఉన్నాడు. ‘మందహాసంబు సేసి’ - చిరునవ్వుతో ‘సంక్రందన నందనుండు’ – దేవేంద్రుని కుమారుడు, అర్జునుడు సమాధానం చెప్పాడు. మరి ఇప్పుడు పాండవులది దేవేంద్రప్రాభవమే కదా! అర్జునుడే అక్కడ సమాధానం ఇవ్వాలి. భీముడు అయితే ఆ భాషణం వేరు. అందుకని అర్జునుడు విరాటునితో ఈవిధంగా పలికాడు.

సీ.      నడదీవియలు సేసె నగరికి మాణిక్య మకుటముల్ పూనిన మనుజపతులఁ
        దగునాజ్ఞ సూయణముగ నొనరించె మంచిగనేల నాలుగు చెఱఁగులకును,
            బ్రీతార్థిజనుల సచేతన త్యాగ ధ్వజములుగా నన్నిదేశములనిలిపి
        దిక్కులన్నింటను దెలుపారు పూఁతగావించె నుజ్జ్వల యశోవిభ్రమంబు.

తే.         రాజసూయాధ్వర ప్రవర్తకుఁడు నిత్య

      సత్యభాషా మహావ్రతశాలి, పాండు

      రాజ దుగ్ధ పయోనిధిరాజు ధర్మ

      రాజు సుమ్ము మత్స్యావనీరమణ! యితఁడు.                  (విరాట. 5-320)

          ‘నడదీవియలు సేసె’- ఎవరనుకుంటున్నావు ఈయన అని పరిచయం చేశాడు అప్పుడు. అర్జునుడు యుధిష్టిరుడిని పరిచయం చేయటంలో ఎంత ఉదాత్తత. ఎంత ఉచితజ్ఞత! ఇది చూడండి, అర్జునుడి మొదటివాక్యం. చెప్పాడు. ‘నడదీవియలు సేసె నగరికి మాణిక్య మకుటముల్ పూనిన మనుజపతులఁ’- ధర్మరాజు నగరంలో రాజులు మణులు, రత్నాలు పొదగబడిన కిరీటాలతో, భూషణాలతో ప్రకాశిస్తూ, ఆ ఆభరణాలలో, శిరోభూషణాలలో, ప్రతిఫలిస్తున్న కాంతులతో నలుదిక్కులా వెలిగిస్తూ ఉన్నారు. ‘నడ దీవియలు సేసె’ - ఆ రాజులు నడుస్తున్న దీపాల్లాగా ఉన్నారు. అంటే ఏమిటి? మహాప్రతాపవంతులైన చక్రవర్తులు యుధిష్టిరునికి సామంతులు. వారిని నగరిలో నడుస్తున్నదీపాలుగా చేసిన పరాక్రమం యుధిష్టిరునిది. ‘తగు నాజ్ఞ’- తనఆజ్ఞచేత, ‘సూయాణముగ నొనరించె మంచిగ నేలనాలుగు చెరగులకును’`- సూయము అంటే ఒక యజ్ఞంలో చేసే ఒక మారణహోమం. ప్రతిఘటించటానికి వీలులేనట్టి భయంకరమైన ఆజ్ఞను ‘సూయాణముగ’ – దండయాత్రలుగ, కేవలం తన ఆజ్ఞామాత్రం చేతనే, నేల నాలుగువైపులా  విస్తరించుకున్న రాజ్యాలను తన ఏకఛత్రాధిపత్యం కిందకి తీసుకుని వచ్చాడు.  అంతటి భయంకరమైన ఆజ్ఞలు జారీచేసే వాడే అయినా, 'మంచిగ' అందరికీ ఆమోదయోగ్యంగా తన సార్వభౌమత్వాన్ని స్థాపించుకున్నాడు. ‘ప్రీతార్థిజనుల సచేతన త్యాగధ్వజములుగా నన్నిదేశముల నిలిపి’- తన చేసిన దానములతో అందరినీ సంతోషపరచినవాడు, రాజ్యాన్ని సుభిక్షంగా ఉండేలా చూస్తూ దిక్కులన్నింటినీ తనపరాక్రమంచేత జయించిన వాడు, చక్రవర్తులనందరినీ లోబరుచుకుని సార్వభౌమాధికారాన్ని స్థాపించుకున్నవాడు. అందరినీ సంతుష్టులను చేసి అన్ని దేశాలలో సుభిక్షంగా ఉంచిన వాడు. కీర్తి కాక ఏముంటుంది? ‘దిక్కులన్నింటను తెలుపారు పూత’- తెలుపు స్వచ్ఛంగా ఉండేది. తెల్లగా ఉండేది కాబట్టి కవిసమయాల్లో కీర్తిని వర్ణించేటపుడు తెల్లగా ఉంది అని అంటాం. ‘ఈ తెలుపారు పూత’ తెలుపు ఆరి, -వ్యాపించి- వెలిగేటువంటి ‘తెలుపారు పూఁత గావించె నుజ్జ్వల యశోవిభ్రమంబు’- అటువంటి కీర్తిని పొందినవాడు కంకుభట్టు.

          ‘రాజసూయాధ్వర ప్రవర్తకుఁడు’- రాజసూయయాగం చేయాలంటే శత్రురాజుల నందరినీ జయించిన తరువాతనే ఆ అర్హత వస్తుంది. అటువంటి రాజసూయయాగాన్ని నిర్వహించినవాడు. ‘నిత్య సత్య భాషామహావ్రతశాలి’ - ఎప్పుడూ సత్యమైన భాష ఈయనది, మనకు చాలా భాషలున్నాయి. ఈయనది సత్యమైన భాష.

Player
>>