ఉత్తర వివాహ ప్రతిపాదన1

‘అనిన అతడు వెరపు అత్యాదరంబును సంతసంబు మానసమున పెరయ అవయవముల సంభ్రమావేశము ఏర్పడ గౌరవమున విజయు కౌగలించె’- విరాటుడి సందేహాలన్నీ తొలగిపోయాయి. ఉత్తరుడి మాటలు విన్న విరాటుడు అమితానందంగా అర్జునుడిని ప్రీతితో కౌగిలించుకున్నాడు. ధర్మరాజుకు సాష్టాంగప్రణామం చేశాడు. భీమ,నకుల, సహదేవులను దగ్గరికి తీసుకున్నాడు. ‘అత్తరి లేచి వచ్చి తన యన్నలఁ దమ్ములఁ గానిపించె అయ్యుత్తరు నర్జునుండు’- అర్జునుడు తన వారినందరినీ ఉత్తరుడికి పరిచయం చేశాడు. ‘దగవొందఁగ నప్పుడ పిల్వఁబంచె మాత్స్యోత్తముఁడు’- ఆ మత్స్యనగరాధీశుడైన విరాటరాజు వెంటనే అందరిని పిలిపించాడు. ఎవరిని? ‘ఆర్యమిత్ర సచివోత్కర సోదరవర్గ పుత్రకోదాత్త భటాది యోగ్యుల ముదంబున పాండవ దర్శనార్థం’- పాండవుల సందర్శనార్థం బంధువులనందరిని పిలిపించాడు. అక్కడ ‘ఇట్లు సమస్తజన సమేతంబుగా ధర్మతనయ సేవా తత్పరుండై తదనుమతిని సముచిత రుచిరాసనంబున నుండి’- ధర్మజుని అనుమతితో ఉచితాసనంలో ఆసీనుడైనాడు. ‘విరాటుండు అంతఃపురవర్తులను బిలిచి అంతయు సుదేష్ణ కెఱింగింపం బనిచి’- అంతఃపుర పరిచారకులను సుదేష్ణాదేవి వద్దకు పంపి విషయమంతా వివరింపమన్నాడు. ‘పాంచాలిన్ తగిన తెఱంగున గారవించునట్లు కావించె’- సైరంధ్రియే ద్రౌపది అని తెలిపి సముచితంగా ఆమెను గౌరవించునట్లు చేశాడు.

          ‘అట్టియెడ ధనంజయుడు అతని కిట్లనియె’- ఆ సమయంలో అర్జునుడు విరాటునితో ఈవిధంగా పలికాడు. ‘చాల దుస్తరమైన అజ్ఞాతవాస వత్సరంబు భవత్గర్భ వాస గుప్తివలన గడపితిమి’- అతిదుష్కరమైన అజ్ఞాతవాసమును ఒక మాతృగర్భములో శిశువు ఎంత రక్షణగా ఉంటాడో, అదేవిధంగా మీ రక్షణలో మేము నిర్విఘ్నంగా పూర్తి చేశాము. ‘అతిసుఖావాప్తచిత్తవృత్తి మేము నిర్భయులమై’- నిర్భయంగా మా ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాము అన్నాడు. ‘అనిన విని విరాటుండతని కిట్లనియె.’

          ‘ఏనన వేఱ యొక్కడనె?’ - అర్జునా! నేనంత పరాయివాడినా? ‘ఇట్లనగా తగునయ్య’- ఇలా అనడము తగునా? నేను చేసినదేమున్నది? నా దగ్గరకు వచ్చి ఉన్నారంటే అది నా మహద్భాగ్యం.  ‘ఇమ్మెయిం గానన దేశవాసములఁ గాఱియ కోర్చి యడంగి యుండి’ - ఎన్నో కష్టాలను ఓర్చి, ‘మీ పూనిక దీర్చి మీ రెలమిఁ బొందుట యెల్లను’ - మీ ప్రతిజ్ఞ నెరవేర్చుకోగలగటం, ‘పుణ్య దేవతానూన దయాసమృద్ధి నను నొందుట గాదె సురేంద్రనందనా!’ - అంతా దేవతానుగ్రహం. నా పుణ్యఫలం.

           అని, ధర్మనందనుడిని చూస్తూ ఈ విధంగా అన్నాడు, ‘ధరణియు పట్టణంబు హయదంతిరథంబులు గోవులున్ భటోత్కరము అమాత్యవర్గమును కాగల రాజ్య మితండ యేలు’- ఇంక నాకు రాజ్యంతో పనిలేదు. చక్రవర్తే వచ్చి కూర్చున్నప్పుడు ఇంక ఈయనే చూసుకుంటాడు. నాకు రాజ్యం అక్కర లేదు. ‘నిర్భరమున నేను పుత్రులును బంధులు తమ్ములు కొల్చి యుండెదన్’- నేను నా కుమారులు నిశ్చింతగా ధర్మజుని ఆజ్ఞననుసరించి సేవించుకుంటూ ఉంటాము. ‘కరిపురి కెత్తునట్టి పనికల్గిన నోపిన యంత జేసెదన్’- ‘కరిపురి’ హస్తినాపురం. హస్తినాపురంపై ‘ఎత్తునట్టి పని’ దండెత్తాల్సిన అవసరం కలిగితే, నేను చేయగలిగినదంతా చేస్తాను.

Player
>>