శ్రీకృష్ణాదుల ఆగమనం1

శ్రీ కృష్ణుడు బలదేవాదులతో విరాటనగరాగమనం

        ‘ఇవ్విధంబునం బ్రకాశులై’- ఈ విధంగా పాండవులు తమను ప్రకటించుకొని, ‘పాండునందనులు శమీవృక్షనిక్షిప్త సమస్తసాధనంబులుఁ బూజాపూర్వకంబుగాఁ దెచ్చు కొని’ శమీవృక్షం దగ్గరకు వెళ్ళి, వాళ్ళ ఆయుధసంపత్తినంతటినీ తెచ్చుకుని, వాటికి శాంతి పూజలు చేసి, సగౌరవంగా ఆరాధించి తీసుకుని వచ్చారు. ‘ఉపప్లావ్యంబున వసియించి’ విరాటరాజుకు ఈవిధంగా చెప్పారు, ‘ఇంక మేము మీ ఇంటిలో ఉండడం, అంత ఉచితంగా ఉండదు. అజ్ఞాతవాసంలో సేవాధర్మాన్ని నిర్వహించుకున్నాం. ప్రకటించుకున్న తరువాత మీ మర్యాదలను స్వీకరించాము. ఇక మేము మీ సామ్రాజ్యపు సరిహద్దులోనే వేరే చోట ఉంటాం. అని, అక్కడకు దగ్గర్లో ఉపప్లావ్యము అనే చిన్న నగరముంది. ఆ నగర సమీపంలో మాకు విడిది ఏర్పాటు చేయించండి. ఇప్పుడు మాకు ఇంద్రప్రస్థపురం వెళ్ళే వీలులేదు అన్నాడు.

          ఎందుకంటే ఈ విషయం తెలిసిన తరువాత, దుర్యోధనుడు కాని ధృతరాష్ట్రుడు కాని చేయవలసిన ఉచితమైన పని ఏమిటంటే, వెంటనే ఒక దూతను పంపించి, ధర్మరాజాదులను పిలిపించి, నాయనా! మీరు చాలా బాధపడ్డారు, ఏదైనా కాలమహిమ, ఇది ఒక కీడుప్రొద్దు అని చెప్పి, వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకు ఇచ్చి ఉంటే ఉచితంగా ఉండేది. ఇటువంటి సంఘటన గతంలో ఒకసారి జరిగింది. ఎప్పుడైతే లాక్షాగృహదహనం జరిగిందో అప్పుడు పాండవులు అక్కడనుంచి బయట పడి, ఏకచక్రపురానికి, అక్కడ నుంచి పాంచాలరాజు దగ్గరకు వెళ్ళి, ద్రౌపదీవివాహంతో తమను తాము బహిర్గతం చేసుకున్నారో అప్పుడే భీష్ముడు, ద్రోణుడు ధృతరాష్ట్రునికి దూతలను పంపించు అని బుద్ధి చెప్పారు. విదురుడిని పంపించి వాళ్ళను రావించి మర్యాద చేశారు. అప్పటి పరిస్థితి అది. ఇప్పుడు పదమూడు సంవత్సరాలు రాజ్యాన్ని అనుభవించి, వచ్చిన తరువాత ఇంక ఆ పని చేయటానికి దుర్యోధనునకు మనస్కరించలేదు. ఆ అనుభవాన్ని చవి చూశారు కాబట్టి మళ్ళీ వాళ్ళు వచ్చి ఎక్కడ భాగం తీసుకుంటారో అనే సంకోచం వాళ్ళకు నరనరాల్లో జీర్ణించుకునిపోయివున్నది. వీళ్ళను పిలవటం ఎంతమాత్రం ఇష్టం లేదు. మనం సంధి చేసుకుందామని ఉత్తరగోగ్రహణ సందర్భంలోనే భీష్ముడు చెప్పాడు. ‘నేనెందుకిస్తాను రాజ్యం? ఏం మాట్లాడుతున్నారు? ఇచ్చేందుకైతే అప్పుడు అడవులకు పంపిస్తానా’ అన్నాడు దుర్యోధనుడు. కాబట్టి వాళ్ళు పిలవకుండా ధర్మరాజు సభకు వెళ్ళి అడగటం సముచితం కాదు. అందుచేత కార్యాన్ని నిర్దేశించుకునేంత వరకు పాండవులకు నివాసము కావాలి. కాని ఈయన సామాన్యుడు కాడు, సార్వభౌముడు. కాబట్టి విశిష్టంగా ఉన్న ఉపప్లావ్యనగరంలో, నివాసం ఏర్పాటుచేసుకుని, అక్కడే సభాకార్యక్రమాలు పెట్టుకున్నాడు. ‘మత్స్యమహీ నాథుండు పంపు సేయం బెంపు మిగిలి’- కాని ఆతిథ్యం విరాటరాజుదే. వాళ్ళకు కావలసిన ఏర్పాట్లన్నీ చేయవలసింది ఆయనే. ఎప్పుడైతే ధర్మరాజు ఒక్కసారి ప్రకటించుకున్నాడో, ఆహా! పాండవులు కష్టాలు తీరి మళ్ళీ యథాస్థితికి వచ్చారు కదా! అని ప్రజలు సంతోషించారు. పాండవులకు అనేకకానుకలు సమర్పించారు. ‘పౌరజానపదసమానీత నానా విధోపహారంబులు గైకొనుచు’- పాండవులు జానపదులు తెచ్చిన కానుకలు స్వీకరించారు.

Player
>>