ఉత్తరాభిమన్యుల వివాహం1

ఉత్తరాభిమన్యుల కళ్యాణమహోత్సవం

          ‘ఇవ్విధంబున రెండు దెఱంగుల చుట్టంబులునైన భూపతులు’- అటు ఇటు బంధువులు వచ్చారు. ఇంక ముహూర్తం సమీపించడమే ఆలస్యం. ‘భూపతులు తమ తమ విభవంబులు మెఱసి వచ్చి యుండ’- మూలంలో వ్యాసమహర్షి వివాహమయింది అని వదిలేశారు. కానీ తిక్కనగారికి తెలుగుపెళ్ళిళ్ళలో ఆ కాలంలోని సంప్రదాయాలను వర్ణించాలనే ఉత్సాహం ఉంది. విరాటపర్వంలో మనకు కనబడిన తిక్కనగారు తనని తాను పరిచయం చేసుకున్నారు, మహాకవిగా నిరూపించుకున్నారు. చాలా విస్తృతంగా అన్ని సంప్రదాయాల్ని ఇక్కడ మనకు నిక్షేపించాడు. ‘మెఱసి వచ్చియుండ విరాటుండు పురంబున నుత్సవంబు సాటించిన’- అది ఏడురోజుల పెళ్ళో, అయిదురోజుల పెళ్ళో కానీ ఉత్సవం చాటించాడు.

          ‘కలువడములు మణితోరణములుఁ గట్టిరి క్రముకకాండ మోచాస్తంభంబులు నాఁటిరి’- కలువడములు అంటే పూలదండ. అలంకారానికి పెద్ద పూలదండలు నిలువుగా వేలాడదీస్తుంటారు. చారిత్రకప్రసిద్ధి కలిగిన నగరాల్లో ప్రతి వీధి మధ్యలో స్తంభాలు కనబడుతుంటాయి. అవి ఆ రాజు అధికారాన్ని స్థాపించడానికి పెట్టిన ధ్వజస్తంభాలు వాటికి నిత్యార్చనగా పూలమాలలు వేస్తుంటారు. అవి కలువడములు. అటువంటి ధ్వజస్తంభానికి వేలాడదీసే పూలమాలలు కలువడములు. ‘కలువడములు మణితోరణములుఁ గట్టిరి క్రముకకాండ’- పోకచెట్లు వాటి విశేషణం. వక్కలుపెట్టి తాంబూలం లేకపోతే అది అప్రశస్తం అవుతుంటుంది. మంగళానికి గుర్తు అవన్నీ. ‘మోచాస్థంభములు’- అరటిస్తంభాలు తీసుకుని వచ్చి నాటారు. ‘కుంకుమమునఁ గలయ నలికి మ్రుగ్గులిడిరి కర్పూరమునన్’- ముగ్గులు పెట్టారు, వాటి మీద కర్పూరం చల్లారు. ‘వివిధాలంకరణంబుల నవకాంతి వహించి పట్టణంబు’- పట్టణానికే ఆ అలంకారాలతో ఒక కొత్తకాంతి వచ్చింది. ‘లలితవనంబై వివాహోత్సవ మాధవలక్ష్మికి లలితవనంబై యెలమి కలిమి తావలమయ్యెన్’- లలిత మణిమయ విభూషణములైన వివిధ అలంకారాలతో ఆ పట్టణం వివాహమహోత్సవమనే లక్ష్మి కొలువైన ఉద్యానవనము వలె సంతోషానికి స్థావరమైంది.

          ‘తాను సుదేష్ణయున్ సుతులుఁ దమ్ములు బంధులు గంధమాల్య నానా నవరత్న భూషణమనః ప్రియ మాంగలిక ప్రసాద నానూన విభూతి’- ఆ ఉత్సాహం ఎంత పొంగిపోయిందంటే, ఆ విరాటరాజు ‘తాను సుదేష్ణయున్’- ఆయన భార్య ‘సుతులుఁ దమ్ములు బంధులు గంధమాల్య నానా నవరత్న భూషణ మనః ప్రియ మాంగలిక ప్రసాదనానూన’- ఒక విధమైన నిత్యమంగళాన్ని నిర్దేశించే, మంగళకార్యానికి అనుకూలంగా ప్రతిస్పందించే అలంకారాలను చేసుకుని ‘మత్స్యవిభుఁ డుజ్జ్వలలీల వహించి భూమిదేవా నయనాది కృత్య పరులైన జనంబుల గారవించుచున్’- కావలసిన విప్రులను అందరినీ రప్పించాడు. వేదశాస్త్రవేత్తలను పంపించాడు. వివాహానికి కావలసిన, అవసరమైన నిపుణులనందరినీ పిలుచుకుని వచ్చాడు. ‘గరువంపు సంభ్రమంబుల తోడ’- నగరానికి కావలసిన అలంకరణలన్నీ చేయించాడు.

Player
>>