ఉపక్రమణిక1

శ్రీ

మునిం స్నిగ్ధాంబుదాభాసం వేదవ్యాస మకల్మషమ్
వేదవ్యాసం సరస్వత్యావాసం వ్యాసం నమామ్యహమ్

ఉపక్రమణిక

ఉ.           శ్రీయన గౌరినాఁ బరఁగు చెల్వకుఁ జిత్తము పల్లవింప భ
               ద్రాయితమూర్తి యై హరిహరం బగురూపము దాల్చి విష్ణురూ
               పాయ నమశ్శివాయ యని పల్కెడు భక్తజనంబువైదిక
               ధ్యాయిత కిచ్చ మెచ్చు పరతత్త్వముఁ గొల్చెద నిష్టసిద్ధికిన్.        (విరాట.  1-1)

   ‘శ్రీయన గౌరినాబరగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తియై హరిహరంబగు రూపము దాల్చి ‘విష్ణురూపాయ నమశ్శివాయ’ యను భక్తజనావళి వైదికధ్యానాన్ని అభిమానంతో ఆదరించి పరతత్త్వాన్ని ఇష్టసిద్ధికోసం కొలుస్తూ తిక్కనగారు మహాభారత రచనకు శ్రీకారం చుట్టారు. ఋషికల్పుడు నన్నయగారితో ప్రారంభమై రసవత్కవితామధుర సుధాధారలతో ప్రవహించిన ఆంధ్రభారతీస్రవంతి అరణ్యపర్వంలో సగభాగంలో ఆగిపోగా దాని తరువాత వచ్చిన పదిహేను పర్వముల కావ్యగాథనంతటిని ఏకచ్ఛత్రాధిపత్యంగా తన కలంతో నడిపినవాడు తిక్కన. ఆంధ్రసాహిత్యరంగంలో అంటే తెలుగుసాహిత్యం తెలిసిన వాళ్ళకి ఒక కావ్యరసనిర్దేశకత్వమైన రచనతో రసావిష్కరణ చేయటంలో, కావ్యరచనకు లాక్షణికులు చెప్పిన లక్షణాలన్నింటికి లక్ష్యముగా, ఉదాహరణప్రాయంగా ఉండే సంపూర్ణసమన్వయ పూర్వకమైన కవిత్వాన్ని వెలార్చిన కావ్యధార ప్రపంచ భాషలలో ఏదైనా ఉందా అంటే అది తిక్కనగారి కవిత్వమే అని చెప్పటానికి మనం సందేహించవలసిన పని లేదు. ఆ మహనీయుడు చేసిన కావ్యసృష్టిని గురించి ఎఱ్ఱన - ‘తన కావించిన సృష్టి తక్కొరులచేతన్ గాదు’1 అని అన్నారు. తిక్కన గ్రహించిన పదజాలము, పదప్రయోగవైచిత్రితోపాటుగా కావ్యానుశీలన తత్త్వము, ఉచితపద ప్రయోగ కుశలత్వము, నాటకీయరచనా ధోరణి, సన్నివేశ సాక్షాత్కార మధురిమ, పాత్రల మనోభావాలను ఆవిష్కరించటంలోని నైపుణ్యం ఒకటేమిటి అన్నింటా, అంతటా అనితరసాధ్యం. అది కాకతాళీయం గానో, భగవన్నిర్ణయమో కానీ నన్నయగారి మూడు పర్వాల తరువాత నాలుగోపర్వం కళ్యాణశుభదాయకము, మనోహరము, మనోజ్ఞమూ అయిన విరాటపర్వరచన దగ్గరికి వచ్చేసరికి తిక్కనగారు చేపట్టవలసివచ్చింది. విరాటపర్వం అంతటి విశిష్ట మైనది కనుకనే విరాటపర్వానికి ఇన్నివిశేషణాలను చెప్పారు.

మ.          హృదయాహ్లాది, చతుర్థ, మూర్జిత కథోపేతంబు, నానారసా
               భ్యుదయోల్లాసి విరాటపర్వ మట యుద్యోగాదులం గూడఁగాఁ
               బదియేనింటిఁ దెనుంగుబాస జనసంప్రార్థ్యంబులై పెంపునం
                                                               దుదిముట్టన్ రచియించు టొప్పు బుధసంతోషంబు నిండారఁగన్                               (విరాట. 1-7)

                        హృదయాహ్లాది, చతుర్థ మూర్జిత కథోపేతంబు. నానా రసాభ్యుదయోల్లాసి. చతుర్థము అంటే నాలుగవది. ఈ చతుర్థమైన విరాటపర్వానికి మహాభారతంలో అత్యంత ప్రాధాన్యం ఉంది. మిగతా పర్వాలలో కథాసంగ్రహవిధాన, సన్నివేశాలు ఎలా ఉన్నా విరాటపర్వంలో ఉన్న కథ కల్యాణమంగళకరమైనది. చతుర్థము అనే పదాన్ని చాలా సమర్థవంతంగా యుక్తిమంతంగా సమన్వయం చేసిన పండితులెంతమందో ఉన్నారు. దానిలో సంప్రదాయానుకూలంగా విచారిస్తే పురుషార్థాలు నాలుగు. ధర్మార్థకామమోక్షాలు. ఈ విరాటపర్వం నాలుగోపర్వం. పాండవులకు అంతవరకూ ఉన్న ప్రతిజ్ఞాబంధమైన ఒక నిబంధననుంచి 

Player
>>