ఉపక్రమణిక10

సాహిత్యపరిపక్వత ఏర్పడిన తరువాత ఆయన భారతాన్ని గ్రహించాడు. అలాంటి పరిపక్వతతో తిక్కనగారి కావ్యలేఖిని అనవరతం ఆగకుండా ప్రవహించింది. ఆయన దానికి తత్వనిర్దేశం చేయవలసి వచ్చినపుడు అటు శైవము ఇటు వైష్ణవానికి రెంటికీ సమన్వయం చేస్తూ హరిహరనాధతత్వాన్ని ఆవిష్కరించాడు. అయితే హరిహరుడు అనే తత్త్వం తిక్కన నిర్ణయమేనా? వ్యాసులవారే హరివంశంలో ‘నమో హరాయ హిప్రాయ నమో హరిహరాయ చ’ ప్రయోగించారు. సంధ్యావందన మంత్రాలలో ప్రసిద్ధమై ఉన్నది. ‘శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః’ ఆ హరిహరతత్వాన్ని ప్రతిపాదించాడు. తిక్కనే ఆశ్వాసాంతంలో మహాభారతంలో ఒక చోట అంటాడు. ‘వ్యాస సమాసైక రూప హరిహరనాథా!’

               వ్యాసులవారు హరి హర అనే రెండు పదాలను, ఒక సమాసంగా మార్చగా దానినే గ్రహించాను కానీ నేను సృష్టించినది కాదు అని విన్నవించుకున్నాడు. శివభారత కర్త మహాకవి గడియారం వేంకట శేషయ్యశాస్త్రి గారంటారు, ‘తిక్కన కావ్య నిర్మాణ వైభవమనగా అది ఒక అఖండ శబ్దప్రపంచసృష్టి’(గడియారము వేంకటశేష శాస్త్రిగారు- కవిత్రయ కవితా వైజయంతి) శబ్దాలు కొన్ని చూశాం, ఇంకా చాలా చూస్తాం. అర్థంకాని పదాలుంటాయి. ఎందుకంటే అప్పుడు మాట్లాడుకునే పల్లె పదాలన్నీ తెచ్చి కావ్య గౌరవాన్ని ఆపాదించాడాయన. ఆ పల్లె పదాలు వ్యవహారంలో లోపించాయి. మనకు అన్వయం కష్టమైంది. కానీ రసము చెడలేదు రసావిష్కారం మాత్రం ఉంది.

‘ఊహాతీత భావనాప్రపంచ చైతన్యం ఆ చైతన్య శక్తి, హృదయోన్నిద్ర కళానుభూతికి పరమార్ధం, ఆయన సృష్టి. దాని ఆంతరిక సౌందర్య సాక్షాత్కారము పొంది ఆనందానుభూతిని అందని వారెవరో మహానుభావులు. ఎందుకంటే ఆ ఆనందానుభూతి వాక్కులకు అందరానిది, ఎంత చెప్పినా చదివి అనుభవించాల్సిందే. ఆ కావ్యజ్యోతి బ్రహ్మ సాక్షాత్కార సధ్రీచీనమైనది.’ బ్రహ్మ సాక్షాత్కారం ‘రసో వై సః’ అని సిద్ధాంతం. రసము ఏదీ కాదు ‘సః’ అదే ఆ బ్రహ్మానందమే మనం అనుకునే అనుభూతి. 

Player
>>