ఉపక్రమణిక2

విముక్తి లభించింది. అదే మోక్షం. విరాటపర్వాంతంలో పాండవులు తమకున్న ప్రతిజ్ఞాబంధనంనుండి విముక్తు లయ్యారు కాబట్టి చతుర్థమనే పేరు సార్థకమయ్యింది. కావ్యనిర్దేశకులందరూ కూడా కావ్యలాక్షణికులు కారు. నాట్యశాస్త్రంలో భరతముని ప్రతిపాదితమైన సిద్ధాంతాలను అనువదిస్తున్న కావ్యలక్షణకారులందరూ కూడా నాటకంలో నాలుగో అంకానికి చాలా ప్రాధాన్యాన్నిచ్చారు. నాటకరచన, కావ్యరచన, పురాణరచన, తత్త్వశాస్ర్త్రరచనలకున్న సంప్రదాయ విధానాలన్నీ వేరువేరు. ఒక్కొక్కరీతిగా ప్రవర్తిల్లుతున్న సాహిత్యప్రపంచంలోని సమన్వయ సంప్రదాయాలు భిన్నభిన్నాలుగా ఉంటాయి. ఆయా ప్రక్రియలలో నాటకము దృశ్యకావ్యము. ఆ మనోహరమైన దృశ్య కావ్యం ఎదురుగా కళ్ళకు కనబడుతున్నప్పుడు ఆ పాత్రలను చూచే శ్రోతలు దానిలో లీనమైపోయి వాళ్ళ సహజ భావోద్వేగాలను వదలి పాత్రల భావోద్వేగాలతో ఐక్యం చెందే సందర్భాలు ఉంటాయి. ఆ రసాన్ని ఆవిష్కరింపచేయాలి అంటే రచన కూడా అలాగే ఉండాలి. నాటకాలను సాధారణంగా ఏడు అంకాలుగా పరిగణించినప్పుడు, మొట్టమొదట సూత్రధారుడు నాందిలో ప్రవేశించి నాటకవిషయాన్ని, రచయితనూ, నటుల విశిష్టతనూ తెలిపి, ప్రవేశించే పాత్రను సూచించి నిష్క్రమిస్తాడు. రెండవది ప్రవేశము. మళ్ళీ మధ్యలో విష్కంభము, ఇలా నాలుగవ అంకంలో కనిపించేది గర్భసంధి. మూడు అంకాలలో కథ కొద్దిగా జరిగి ఉంటుంది. తరువాత జరగాల్సిన కథ ఇంకా కొంచెం ఉంటుంది. వీటి మధ్యలో ఉన్న సన్నివేశానికి సంబంధించిన కథ నాలుగో అంకం. కాబట్టి మిక్కిలి ప్రధానమైన భాగం. నాటకరచనలో కాని, కథను చెప్పేటప్పుడు కాని, విశ్రాంతి వంటి స్థితి గర్భసంధి. ఆ సన్నివేశంలో ఒక విధమైన ఉత్కంఠ ఉంటుంది. అంతవరకూ జరిగిన కథ, ప్రేక్షకుల అవగాహనకు వచ్చిన తరువాత జరగబోయేది ఏమిటి అన్న ఉత్కంఠ కలిగించే స్థితి నాల్గవ అంకంలోనే ఉంటుంది. అందుకనే

శ్లో.          కావ్యేషు నాటకం రమ్యం నాటకేషు శకుంతలా,
           
               తత్రాఽపి చ చతుర్థోంకః, తత్ర శ్లోక చతుష్టయమ్’ - అన్నారు.

               అంటే చతుర్థాంకానికి ముందు ఉన్న విషయాన్ని అంతటినీ సింహావలోకనం చేసుకుని చెప్పాల్సిన అవసరం వచ్చింది. భారతం విషయంలో కూడా అదే జరిగింది. పాండవులు సభాపర్వాంతం వరకూ ఒక విధమైన జీవనవిధానాన్ని గడుపుతూ, మహాభోగాలను అనుభవిస్తూ ఉన్నవారు. అట్టివారు అనేక బాధలకు గురియై అరణ్యవాసం చేసి అతికఠినమైన అజ్ఞాతవాసం గడపవలసివచ్చింది. అజ్ఞాతవాసంలో ఏవిధంగా జీవిస్తూ వాళ్ళు తమ ప్రతిజ్ఞను నెరవేర్చుకుని ఆ కష్టాలనుండి బయటకు వచ్చారు అనే విషయము, ఆ తరువాత జరగబోయే సంఘటనలూ ఇంకా ఊహించసాధ్యం కానివి. ఇన్ని విశేషాలతో కూడినది కనుకనే తిక్కనగారు విరాటపర్వాన్ని చాలా విశేషణాలతో చెప్పారు. నన్నయగారు ఆదిపర్వంలో పర్వానుక్రమణిక - అంటే పర్వసంగ్రహాన్ని వ్రాస్తూ, ఒక్కో పర్వాన్ని గురించి ఒక్కో పద్యంలో చెప్తూ వచ్చారు. అలా చెప్తున్నప్పుడు విరాటపర్వం సభారంజనము, సర్వమనోజ్ఞము, మంగళనిర్దేశకమని సూచించారు. అట్టి దానిని తిక్కనగారు సముచితంగా హృదయాహ్లాది అన్నారు.

అంతటి విద్వత్తు ఉన్న తిక్కనగారు నన్నయగారు వదిలిపెట్టిన భారతాన్నే ఎందుకు తీసుకున్నారు. తిక్కన గారికి, నన్నయ గారికి ఉన్న కాలాంతరమెంత? దాదాపు నన్నయగారు తెలుగు సాహిత్య చరిత్రకు శ్రీకారం చుట్టిన రెండు వందల సంవత్సరాల తరువాత గాని భారతాన్ని గురించి కనీసం ఆలోచించిన కవు లెవరూ లేరు. ఆ మధ్యకాలంలో కవులే లేరా? సాహిత్యం లేదా? వైవిధ్యం లేదా? అన్నీ ఉన్నాయి. ఎన్నో పోకడలు ఉన్నాయి, మార్పులూ ఉన్నాయి. ఎన్ని మార్పులంటే వేయి సంవత్సరాలలో వచ్చిన మార్పులకంటే ఆ రెండువందల సంవత్సరాలలో వచ్చిన మార్పులు, ప్రక్రియావిభిన్నత, కథను చెప్పడంలో ఉన్న నేర్పు, కావ్యనిర్మాణకుశలత, కావ్యానుసంధానలక్షణములు, అలంకారవైలక్షణ్యము మొదలైనవెన్నో ఉన్నాయి.

నన్నయ మొదలుపెట్టిన సంప్రదాయాలను మాత్రము ఈనాటికీ పాటిస్తున్న సంప్రదాయబుద్ధులు ఉన్నా మధ్యకాలంలో కొన్ని మార్పులు వచ్చాయి. నన్నయ మొదలుపెట్టిన సంప్రదాయాలలో మొట్ట మొదటిది శ్రీకారంతో కావ్యాన్ని ప్రారంభిస్తూ పద్యం చెప్పడం. ఆశీర్నమస్క్రియావస్తునిర్దేశకమైన మంగళాచరణంతో కావ్యంగానీ, కథగానీ ప్రారంభించాలని సంప్రదాయం. 

Player
>>