ఉపక్రమణిక3

అంటే మొదలుపెడుతున్న మంగళాచరణంగా చెప్పిన శ్లోకంలో గానీ, పద్యంలోగానీ కావ్యానికి తగిన వస్తునిర్దేశం దానిలో ఉండాలి. ఆశీస్సుకానీ, నమస్కారంకానీ, ఏ దేవుడినైనా ప్రార్థిస్తూ ఉండవచ్చు. నన్నయగారు ఆంధ్రమహాభారతం ప్రారంభిస్తూ,

శా.          శ్రీవాణీగిరిజాశ్చిరాయ దధతో వక్షో ముఖాఙ్గేషు యే

     
               లోకానాం స్థితి మావహన్త్య విహతాం స్త్రీపుంసయోగోద్భవాం

       
               తే వేదత్రయమూర్తయ స్త్రిపురుషాస్సంపూజితా వ స్సురై

  
               ర్భూయాసుః పురుషోత్తమామ్బుజభవ శ్రీకన్ధరా శ్శ్రేయసే       (ఆది.  1-1)

               అని సంస్కృతంలో వ్రాశాడు ఆ మహానుభావుడు. అలా ఆదికవి నన్నయ శ్రీకారంతో మొదలుపెట్టడంచేత తరువాతి కవులెవరూ శ్రీకారం లేకుండా కావ్యం వ్రాయలేదు. ఈ సంప్రదాయం సంస్కృతంలో లేదు. భాషలలో ఆదిభాషగా దేవభాషగా -‘తల్లి సమస్తభాషలకు దైవత భాష’- సాహిత్యంలో శిఖరాయమానంగా నిలిచిన సంస్కృతంలో కూడా ఆదికవి వాల్మీకి,

శ్లో.          తపః స్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంవరమ్
               నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి ర్మునిపుఙ్గవమ్.

అని మొదలు పెట్టారు. మహాభారతం

శ్లో.          నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్
               దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేత్

అని మొదలవుతుంది. మహాకవి కాళిదాసు రచనలు, అభిజ్ఞాన శాకుంతలం ‘యా సృష్టిః స్రష్టురాద్యా’ అని మొదలైతే కుమారసంభవం ‘అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజః’ అంటూ కథలోకే ప్రవేశిస్తుంది. రఘువంశం ‘వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే’ అను ప్రార్ధనతో ప్రారంభమైతే, మేఘసందేశం ‘కశ్చిత్ కాన్తా విరహగురుణా’ అని కథతో మొదలవుతుంది. అలా ఏది చెప్పినా ఎవరు చెప్పినా కావ్యప్రారంభంలో శ్రీకారాన్ని వాడలేదు. ఆ సంప్రదాయాన్ని తెలుగులో స్థాపించినవాడు మన నన్నయభట్టు. అయితే మహాభారతాంధ్రీకరణం ఒక వినూత్నమైన సాహిత్యసంవిధానప్రక్రియ కాబట్టి నన్నయగారు దీనికి మంగళాచరణంగా ‘శ్రీ’ అని సకలార్థసమన్వయాన్ని తనలో సంపూర్ణంగా ఇముడ్చుకున్న అక్షరంతో మొదలుపెట్టారు. మనకు ‘శ్రీ’ అనేది ఒక బీజాక్షరం. ‘ఓమ్’ ఒక బీజాక్షరం. ‘హ్రీం’ ఒక బీజాక్షరం. ఈ మూడు బీజాక్షరాలలో దేనితోనైనా కలిసిన యంత్రంతో కానీ, తంత్రంతో కానీ వస్తునిర్దేశం చేస్తే దానికి ఒక చిరస్థాయి అయిన రూపము, లోకకళ్యాణం కలుగుతాయనే విశ్వాసంతో ‘శ్రీ’ అని మొదలు పెట్టారాయన.

నన్నయగారి ఆ ప్రక్రియను చూసిన నన్నెచోడుడు, నన్నయగారి భాషలో ‘భూసతికిన్ దివంబునకు పొల్పెసగంగ’, ఆంధ్ర గీర్వాణ భాషా సంప్రదాయాలతో, ‘పద్యగద్యములకున్ సాధించె దాంపత్యమున్’2 అంటూ ఆయన చంపూ కావ్యపద్ధతిలో రచన చేశాడు అని గుర్తించి, ఇదేమీ గొప్ప విశేషం కాదు, సంస్కృతంలో సాహిత్యం ఉంది, కావ్యాలు ఉన్నాయి, ఓ మార్గమూ ఉంది. ఈ మార్గంలో నడిచిన సూత్రాలే కానీ క్రొత్తదనం ఏదీ లేదు, స్వతంత్రంగా చేసినదీ లేదు. కాబట్టి ఇది మార్గకవిత. ‘మును మార్గకవిత చెప్పినవాడు’ అని నన్నయను స్తుతించి నేను తెనుగురాజును, నాది తెలుగుభాష, నా జాతికి చెందిన తెలుగులో వ్రాస్తాను అని దేశికవిత్వం ప్రారంభించి కావ్యానికి కానీ, కవిత్వానికి కానీ, ప్రక్రియకి కానీ, మరే సాహిత్యప్రకణానికి కానీ తన సిద్ధాంతాన్ని నిర్దేశం చేస్తూ కుమారసంభవ కావ్యాన్ని ప్రారంభించాడు. అది చాలా ఉత్సాహమైన కథ. ఆ కుమారసంభవం వ్రాసిన తరువాత జరిగిన యుద్ధంలో ఆయన చనిపోయాడు అని ఒక చాటువు ఉన్నది. 

Player
>>