ఉపక్రమణిక4
క. ‘మగణమ్ముఁ గదియ రగణము
వగవక కృతి మొదట నిలుపువానికి మరణం
బగు నిక్కమండ్రు, మడియడె
యగునని యిది తొల్లి టెంకణాదిత్యుఁడనిన్. (అధర్వణాచార్యులు)
‘టెంకణాదిత్యుడు’ అని నన్నెచోడునికి పేరు. ‘శ్రీవాణీంద్రామరేంద్రార్చితమైన…’ అని కుమారసంభవ కావ్యాన్ని స్రగ్ధరతో మొదలుపెట్టారు. ‘శ్రీవాణీ’ అనేది మగణం. దాని తరువాత రగణం వచ్చింది. ‘మగణమ్ము గదియ రగణము’తో కావ్యం ప్రారంభిస్తే ఆ కవికి భవిష్యజ్జీవనము ఉండదు. మరణిస్తాడనే ఒక విశ్వాసం కలిగింది. నన్నెచోడుడు ఇటువంటి ఛందస్సుతో కావ్యం ప్రారంభించడంచేత మరణించాడు. అంటే ఛందోనియమాలలో ఉన్న గణయతిప్రాసల కూర్పులో కూడా బీజాక్షరాల నిక్షేపం ఉంటుంది అని విశ్వాసం. ఆ విశ్వాసంతో ఏ అక్షరం, ఏ శబ్దం ఎక్కడ ఎలా ఉండాలి అని గుర్తించాలి.
నన్నెచోడుడు కుమారసంభవంలో ఎన్నో క్రొత్త మార్గాలు చూపించాడు. ఇంకో విశేషం ఏమిటంటే ఇతని కాలానికి మతపరంగా ఉన్న విశ్వాసాలు చాలా మార్పు చెందాయి. నన్నయగారి భారత రచనాకాలం నాటికి వైదికవాఙ్మయంమీద, సారస్వతంమీద, సంప్రదాయాలమీద కలిగిన అపోహలు, సందేహాలు అధికం. ఆ అపోహలను తొలగించి, వైదికధర్మాన్ని పునఃప్రతిష్ఠించటానికి రాజరాజనరేంద్రుడు కోరితే ‘భారతబద్ధ నిరూపితార్థా’న్ని ప్రతిష్ఠించడానికి నన్నయ భారతాంధ్రీకరణకు పూనుకోవాల్సి వచ్చింది. ఈ రెండువందల సంవత్సరాల మధ్యకాలంలో వైదికమతంలోనే శైవమూ, వైష్ణవమూ అనే రెండు శాఖలు ఏర్పడ్డాయి. అవి భక్తికి సంబంధించిన ప్రాతిపదికతో ప్రారంభమైనప్పటికి, రాజాశ్రయంచేత ఏర్పడటంవల్ల సహజంగా ఒకరిమీద ఒకరు ఆధిక్యమును సంపాదించుకోవాలి అనే మనోభావాలు ప్రకోపించడంచేత, శైవంలో వైష్ణవంలో మూలధర్మాలను వదలి, మతము మనసుకు, మనిషికి శాంతి నిచ్చేది అనే ప్రాథమిక విషయాన్ని విస్మరించి, ‘నా సిద్ధాంతాన్ని అంగీకరించకపోతే నిన్ను సమూలంగా నాశనం చేస్తాను’, అనే మౌర్ఖ్యంతో, మౌఢ్యంతో ప్రవర్తిల్లిన తాంత్రికమైన సిద్ధాంతాలు వచ్చాయి. ఒక ఆత్మౌన్నత్యానికి కావలసిన శాంతిని సాధించుకోవాలి అనే ఆలోచన పోయి, ఐహికమైన సుఖాలను సాధించుకోవటానికి కొన్ని యజ్ఞకర్మలు, తాంత్రికవిద్యలు. ఈ రెండు మార్గాలూ కాక మతపరమైన సిద్ధాంతాలతో సాధిస్తామనుకున్నప్పుడు, విషయవిభిన్నతలతో వచ్చినవే శైవమూ, వైష్ణవమూ. ఇవే వీరత్వాన్ని ఆపాదించుకున్నప్పుడు రూపాంతరం చెంది, వీరశైవమూ, వీరవైష్ణవంగా బయలుదేరినాయి.
శైవమతానికి ప్రోత్సాహాన్నిచ్చిన నన్నెచోడుడు రచించిన కుమారసంభవంలో దేశికవిత, మార్గకవిత అని విభజిస్తూ అష్టాదశవర్ణనలు ఉన్నది ప్రబంధము అని ప్రథమంగా నిర్దేశించాడు.
క. వన జలకేళీ రవి శశి
తనయోదయ మంత్ర గతి రత క్షితిప రణాం
బునిధి మధు ఋతు పురో ద్వా
హ నగ విరహ దూత్యవర్ణ నాష్టాదశముల్ (నన్నెచోడుడు-కుమారసంభవం)
అని పదునెనిమిది వర్ణనలు కలిగినదే ప్రబంధము అని నిర్వచించి, తదనుగుణంగా మహోన్నతమైన వస్తుకవితారూపంగా ఆ కావ్యాన్ని రచించాడు. ఇలా పదునెనిమిది వర్ణనలతో కావ్యరచన చేయండి అని మార్గకవిత, దేశికవిత అనే ప్రక్రియలు చూపిస్తే దానిని విస్మరించి మతానికి అన్వయించుకొని, వెఱ్ఱితలలు వేసిన సాహిత్యపథంలో పాల్కురికి సోమనాథుడు బసవపురాణాన్ని రచించాడు.