ఉపక్రమణిక5

ఆ బసవపురాణ రచనలో తాను ఏ ఛందస్సులనూ అంగీకరించనన్నాడు. ఛందస్సు, పద్యాలు ఇవన్నీ సంస్కృతంనుండి వచ్చినవే. సంస్కృతంలోని అనుష్టుప్పు లాగా తెలుగులో కూడా అటువంటి ఛందస్సును పట్టుకుంటాను అని, ఆటవెలది, తేటగీతులను కూడా కాదని, రెండు పాదాలున్న ద్విపదలు తీసుకుని, వీరశైవంలోని ప్రధానమైన భక్తుల కథలను స్వీకరించి, రచన సాగించాడు. ఆనాటి చాళుక్య రాజుల ప్రాపకంతో వారు చేసిన అకాండతాండవంతో అప్పటి సాహిత్యరంగంలో కానీ, మతపరంగా కానీ, సాంఘికపరంగా కానీ అన్నిటా ఒక అల్లకల్లోలపరిస్థితి ఏర్పడింది. వాళ్ళు చూపించిన మార్గం ఏమిటి?

ద్వి.          ఉరుతర గద్యపద్యోక్తుల కంటె
          
   సరసమై పరఁగిన జానుతెనుంగు
      
   చర్చింపఁగా సర్వసామాన్యమగుటఁ 
 
   గూర్చెదద్విపదలు కోర్కి దైవార.     (పాల్కురికి సోమనాథుడు-బసవ పురాణం)          

               చక్కటి జానుతెలుగులో కావ్యాలు వ్రాసుకుందాం. సంస్కృతంలోని ‘వివిధోత్తుంగతరంగఘట్టన చలద్వేలావనైలావలీ.’ వంటి సంస్కృత సమాసభూయిష్టమైన రచనలకంటె ‘సర్వసామాన్యమగుట కూర్చెద ద్విపదలు కోర్కి దైవార’ అని ద్విపదలు వ్రాస్తాను అంటూ, చిన్నచూపు చూస్తారేమోనన్న అనుమానంతో ‘తెలుగు మాటలనంగ వలదు వేదముల కొలదియగా జూడుడు’ మామూలు తెలుగు కాదు, వేదమంత్రోపమానమే అన్నాడు. ‘తల్లి గల్గిన నేల తపసి గావించు, తల్లి గల్గిన నేల తల జడల్గట్టు?’ ఈశ్వరుడికి తల్లి ఉంటే ఆయనను తపసినెందుకు కానిస్తుంది? ఆమె ఉంటే ఆ తల ఎందుకు ఎండిపోయి ఉంటుంది? ‘నాన్నా! రారా అంటూ ఈశ్వరుణ్ణి గూడా లాలించి ఉండేది కదా!’ ఇటువంటి అద్భుతమైన కవిత్వాన్ని ఆవిష్కరించాడు అనడంలో ఆవంతైనా సందేహం లేదు. ఒక వైపు దక్షిణాదిలో వైష్ణవం ప్రవర్తిల్లుతున్నది. ఇటు వీరశైవం. బిజ్జలుడు అనే రాజు ఆశ్రయాన్ని పొంది వీరు చేసిన అకృత్యాలు చాలా ఉన్నాయి. దీని మీద రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు సారస్వతాలోకములో చాలా చక్కని వ్యాఖ్యానం చేశారు. ‘పాల్కురికి సోమనాథునిది అణపరాని ఉద్రేకము.’ ఆ ఆవేశం వచ్చినప్పుడు ఎవరూ ఆపలేరు. ‘ఈ ఉద్రేకపుటూక దంపులకు తోడుగ దిక్కు, దశ, తలాతోకా లేని పవాడములు, పునరుక్తులు’ ఒక విషయం చెప్పడం మొదలుపెడితే అదే చెప్పడం. దానితోపాటు సోమనాథుడుచెప్పిన సిద్ధాంతం ఏమిటి? ‘పశు పాశుపతి యుండ పశువులో పంద పశుజీవులకుఁ బెట్టు పందల పట్టి’, ఈశ్వరుడిని కాదంటే వాళ్ళను ‘సోడంబుతో ముక్కు సూటిగా కోసి’ సోడంబుతో అంటే సూదులు ఉండే ఱంపంలాంటిది. దానితో ముక్కును సూటిగా కోసి, ‘బ్రామకేడబోవచ్చు’, వాళ్ళను ఆ విధంగా సంహరించక ‘ఏడబోవచ్చు’. ఇదీ ఆయన సిద్ధాంతం.

               ఈ సిద్ధాంతానికి వారి వ్యాఖ్యానమేమిటంటే ‘పశుపాశుపతి’ అనేది వాని ఆక్రోశమునకు మచ్చు’ పాల్కురికి సోమనాథునిలోని ఆక్రోశానికి తారస్థాయిలో ఉండే ఉదాహరణ. ఆ కావ్యాలు ప్రజాదరణ పొందకుండా రహస్యంగా, గుప్తంగా ఉండటానికి కారణమేమిటి?

               బసవపురాణాదులు ‘నా మాట వినకపోతే సోడంబుతో ముక్కు సూటిగా కోస్తా’ననే ఆవేశం సనాతన సంప్రదాయం కానే కాదు. సహనం మన జాతికి పెట్టిన శీలం. కాబట్టి సహనం లేనిదాన్ని నేను సాధిస్తాను అనుకోవడం కన్నా మూర్ఖత్వం ఉండదు. అటువంటి సిద్ధాంతం ఈ కర్మభూమిలో నిలబడలేదు. అట్టి పని చేయనిచ్చుటకు ఏ కాలమందును, ఏ సంఘమూ అంగీకరించదు కనుక ‘కూటినెట్టిగ పామక ఏడబోవచ్చు?’ అన్న అతని ప్రశ్నకు నీ ఇష్టం వచ్చిన చోటికి పొమ్మని చెప్పి, తెలుగు సహృదయులు పెడమొగము పెట్టి ఊరకున్నారు. ఇది ఆనాడు ఉన్న సాహిత్య చరిత్ర. ఆనాడు రాజరాజనజరేంద్రునివంటివారు తిక్కనగారిని భారతం వ్రాయమని అడుగలేదు. పాల్కురికి సోమనాథుని ప్రక్రియలు, పద్ధతులు చాలా బాగున్నాయి. తిక్కనగారి కాలంనాటికి మనుమసిద్ధి రాజ్యం చేస్తున్నాడు. వారికి ఆనువంశికంగా సంబంధం ఉంది. 

Player
>>