ఉపక్రమణిక6

తిక్కనగారి తాతగార్లలో ఒకాయన పేరు కూడా మనుమసిద్ధి. తిక్కన పేరుకు అర్థం ఏమిటి? అలాగే దండి – ఏం దండి? దండుకునేవాడా పాపం? మరి నన్నయ్య? వీటికి అర్థాలేం సాధించారంటే – నన అంటే పువ్వులకొన. ననలు. అంత సుకుమారమైన మనసు ఉండేవాడు కాబట్టి నన్నయ్య. నన్న అనే పదానికి అర్థం మంచివాడు అని. అలాగే నన్నెచోడుడు, నన్నియ, నన్నయ. ఇక తిక్కన వద్దకు వస్తే, ‘త్ర్యక్ష’- త్రి అక్ష- మూడు కన్నులు కలవాడు అని కొంతమంది ఊహించారు. మరి కొంతమంది, దక్షిణాదిలో తిరుక్కాళభూనాథుడు అనే దేవుడు ఉన్నాడు. తిరు అంటే శ్రీ. శ్రీకి పర్యాయపదం తిరు. తిరుక్కాళనాథుడు అనే పదం పదభ్రంశమై తిక్కనగా మారిందని ఊహించారు. ఇంకా ఆలోచిస్తే గుజరాత్ ప్రాంతంలో తికంజి అనే పేరు వినబడుతుంది. ఇక్కడ తుకారాం కూడా ఉన్నాడు. ఈ విధంగా ‘మూడు(త్రి)’ నుంచి తిక్కన అనే పేరు వచ్చిందని తెలుస్తోంది.

               మనుమసిద్ధిగారు రాజ్యాన్ని పోగొట్టుకుని ఉన్న పరిస్థితులలో తిక్కన మహాభారతం రచించి, ప్రచారం చేసి, మనుమసిద్ధికి రాజ్యాన్ని ఇప్పించాడు. ఇది తిక్కన రాజనీతిజ్ఞతకు ఒక తార్కాణం. ఆయన జీవితంలో చాటించని, పూజించని, పాటించని రాజనీతితత్త్వాలు లేనే లేవు. ఆయన విద్య అసమానమైన విద్య. తిక్కన సాహిత్యరంగంలోకి అడుగుపెట్టేసరికి ఉన్న శైవ, వైష్ణవ మతభేదాలు, ద్విపదలు, నన్నెచోడుని రీతి ఏవీ ఆయనకు నచ్చలేదు. తానూ ఏదైనా ప్రయోగం చేయాలి అని నిర్వచనోత్తర రామాయణం మొదట వ్రాశారు. కవిబ్రహ్మయై అంతటి రససృష్టి చేసిన మహాకవిలో కూడా తన సాహిత్యనిర్ణాయక విధానంలో ఉన్న క్రమపరిణామదశలో కలిగిన మార్పులు ఇవి. నన్నయ వేరు. ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి. ఆయన ఋషి సమానుడు. తిక్కన సమర్థుడైన మహాకవి. నన్నయగారిలోని ఋష్యంశ తిక్కనలో ఉందా? ఆ అంశ క్రమపరిణామదశలో వచ్చింది. నిర్వచనోత్తర రామాయణంలో ‘అమలోదాత్త మనీష నే నుభయకావ్యప్రౌఢి పాటించు శిల్పమునన్ పారగుడ’ నని గంభీరంగా చెప్పుకున్నాడు. ‘ఉదయం బస్తనగంబు సేతువు హిమవ్యూహంబును చుట్టిరా నీకెదురేరీ’3 అని రామకృష్ణుడు చెప్పుకున్నాడంటే ఆశ్చర్యం కాదు. ఇటీవలి వాడు కాబట్టి. కానీ తిక్కన కాలం నాటికే అంత గొప్పగా చెప్పుకోవడం ఆశ్చర్యం. అంతేకాదు ‘మహేశ్వరాంఘ్రికమల ధ్యానైకశీలుండ’ అని కూడ చెప్పాడు. అలాంటి ఈశ్వరాంఘ్రికమల ధ్యానైక తత్పరునికి హరిహరతత్త్వం ఎలా అబ్బింది? మనసు పరిణతి చెందని స్థితిలో చేసిన రచన నిర్వచనోత్తర రామాయణం. ఒక గొప్పప్రయోగం. కథే విలక్షణమైనది. రావణాసురుడు నాయకుడు. కానీ శ్రీరామచంద్రుడిని నాయకుడిని చేయాలి. కాబట్టి రాముడిని అత్యుత్తమ నరపాలునిగా తీర్చిదిద్ది కావ్యాన్ని నడిపాడు. ఆ రచన చేస్తూ కావ్యలక్షణాలను వ్రాసుకున్నాడు.

               ‘భూరి వివేకచిత్తులకు పోలునన దలంపంగా’ వివేకచిత్తులు ఊహిస్తే పూలలోని సుగంధాన్ని గంధవహుడైన వాయువు చల్లగా తీసుకుని పోయినట్లుగా నేను చల్లటి సుకుమారమైన పదాలను కూర్చి ‘పడయ అప్పలుకులన్ సరిగుచ్చునట్లుగా’ ఆ పలుకులను తీసుకుని విరిదండలాగా – పూలమాలలాగా రమణీయమైన పదబంధాలతో కావ్యం వ్రాస్తాను’ అని చెప్పుకున్నాడు. ఇంత గొప్పగా చెప్పుకున్న తిక్కన భారతం దగ్గరికి వచ్చేసరికి ‘నా నేర్చిన భంగి చెప్పి వరణీయుడ నయ్యెద’ అన్నాడు. ఇలా మనస్సు పరిపక్వత చెందింది. వెనుతిరిగి చూసుకుంటే నిర్వచనోత్తర రామాయణానికి తాను ఊహించిన పేరు రాలేదు. లోపమెక్కడ? ప్రక్రియలలో లేదు. మౌలికమైన సిద్ధాంతాలను పరిగణనలోనికి తీసుకోవాలి అనుకుని భారతంపై దృష్టి సారించాడు. నన్నయ మార్గాన్ని అవగతం చేసుకున్నాడు. తెలుగు సాహిత్యంలో కావ్యం నిలబడాలంటే ఇదే మార్గం. ప్రస్తుతమున్న ప్రయోగాలు, వైచిత్ర్యాలు ఎంతమాత్రం పనికిరావని పూర్తిగా గ్రహించాడు. ఆ కాలంనాటి సాహిత్య విశేషాలను గమనించాడు. దేశి, మార్గ కవిత్వాలలోని ఫణితులను పరిశీలించాడు. మహాభారతాన్ని చేపట్టాడు. మహాభారతరచన చేయాలి అంటే తనకున్న యోగ్యత సరిపోదు. ఆ అర్హతను సంపాదించుకోవడానికి ఓ యజ్ఞాన్ని చేశాడు. సోమయాగం చేసి సోమయాజియై, బుధారాధన విరాజి – ‘పండితులను ఆరాధించటంచేత నాకు కీర్తి వచ్చింది’ అని మహాభారత అవతారికలో చెప్పుకోగలిగాడు. నిర్వచనోత్తర రామాయణ సమయానికి ఈ వినయం లేదు. తానే పండిత ప్రకాండుడననే ఊహలో ఉన్నాడు. బుధారాధన విరాజియైన తిక్కన యజ్ఞంచేసి సోమయాజియై భారతాన్ని గ్రహించి ఒక్కచేతి మీదుగా పదిహేను పర్వాలు పూర్తిచేశాడు. 

Player
>>