ఉపక్రమణిక7

తిక్కనకు అనేకులు శిష్యులు, వారి సమకాలికులే. నాచన సోమనాథుడు, ఎఱ్ఱన తరువాతి కాలంలో వచ్చి, తిక్కనను పూర్తిగా అధ్యయనం చేశాడు. తిక్కన శిష్యుడు కేతన దశకుమారచరిత్రము అనే కావ్యాన్ని వ్రాశాడు. తిక్కన ఆ కావ్యాన్ని చదివి తనకు దానిని అంకితం చేయమన్నాడు. కవిత చెప్పి ‘ఉభయ కవిమిత్రు మెప్పింప’ ఈశ్వరునికి గాని, మరెవరికి కాని సాధ్యం కాదు, అటువంటి సునిశితమైన రసవివేచనాదృష్టి కలిగినవాడైనా, తన శిష్యుని కావ్యాన్ని అంకితం తీసుకున్నాడు. సంస్కృతంలో దండి గద్యకావ్యాన్ని తీసుకుని తెలుగులో పద్యకావ్యంగా మలిచిన కేతన తిక్కనగారి గురించి ఇలా అంటాడు.

సీ.           సుకవీంద్ర బృంద రక్షకుడెవ్వ డనిన వీడను నాలుకకు తొడవైనవాడు
           
               చిత్తనిత్యస్థిత శివుఁడెవ్వఁడన వీఁడను శబ్దమునకర్థమైనవాఁడు
      
               దశదిశావిశ్రాంతయశుఁడెవ్వఁడనిన వీఁడని చెప్పుటకుఁ బాత్రమైనవాఁడు
     
               సకలవిద్యాకళాచణుఁడెవ్వఁడనిన వీఁడని చూపుటకు గురియైనవాఁడు.
 తే.          మనుమసిద్ధి మహేశ సమస్త రాజ్య

  
               భారధౌరేయుఁ డభిరూప భావభవుఁడు

         
               కొట్టరువు కొమ్మనామాత్యు కూర్మి సుతుఁడు

   
               దీనజనతా నిధానంబు తిక్కశౌరి.                                                        (కేతన-దశకుమారచరిత్రము)

               ‘సుకవీంద్ర బృంద రక్షకుడెవ్వ డనిన వీడను నాల్కకు తొడవైనవాడు’- సత్కవులను ఆదరించే సహృదయ తత్త్వం ఎవరికైనా ఉందా? అంటే వీడు అని పలికే నాలుకకు అలంకారభూతుడై ఉంటాడు తిక్కన. ‘చిత్తనిత్యస్థిత శివుఁడెవ్వఁడన వీఁడను శబ్దమునకర్థమైనవాఁడు’- మనసులో శివుడిని స్థాపించుకుని ఆరాధించుకొనే వాడెవ్వడైనా ఉన్నాడా అంటే ఇతడు అని సార్థకంగా ఉండేవాడు. ‘దశదిశావిశ్రాంతయశుఁడెవ్వఁడనిన వీఁడని చెప్పుటకుఁ బాత్రమైనవాఁడు’- ఎందుకని రాజ్యభ్రష్టుడై దుస్థితిలో ఉన్న మనుమసిధ్ధికి రాజ్యాన్ని తిరిగి సంపాదించిపెట్టాడు కదా! అందుకని ‘సకలవిద్యాకళా చణుఁడెవ్వఁడనిన వీఁడని చూపుటకు గురియైనవాఁడు’. ఎందుకంటే,

శ్లో.          పురా కవీనామ్ గణనా ప్రసంగే కనిష్టికాధిష్టిత కాళిదాసః

           
               అద్ద్యాపి తత్తుల్య కవే రభావేత్ అనామికా సార్థవతీ భభూవ’


               కవులెవరు? అని లెక్కపెట్టబోతూ చిటికెన వేలు నుంచీ మొదలు పెట్టి కాళిదాసు అన్నారట. పోనీ కాళిదాసు తరువాత రెండవవారెవరు? అంటే అతనితో పోల్చదగిన వారెవరూ కనబడలేదు. అందుకని ఉంగరపు వేలుకు ‘అనామిక’ అనే పేరు వచ్చింది. అలాగే‘మనుమసిద్ధి మహేశ సమస్త రాజ్యభారధౌరేయుఁడు’- రాజ్యపరంగా ఉన్న కల్లోలాలనన్నింటినీ నిగ్రహించుకుని సమర్థవంతంగా మంత్రిత్వం చేస్తూ సాహిత్యసృష్టి చేశాడంటే ఎలాంటి వ్యక్తిత్వం ఉండాలి? ‘అభిరూప భావభవుఁడు’- చక్కటి సౌందర్యవంతుడు. తిక్కన సౌందర్యాన్ని చూసిన ప్రతి కవి చెప్పారు. ‘కొట్టరువు కొమ్మనామాత్యు కూర్మి సుతుఁడు దీనజనతా నిధానంబు తిక్కశౌరి’- ఈ ప్రజ్ఞ, ప్రతిభాపాటవాలే ఆయనను భారత రచనకు పురికొల్పాయి. భారతంలో తన శూరత్వాన్నంతటినీ చూపించాడు. కేతన ఇంకా ఏమన్నాడు? ‘చతురానన సన్నిభుడు, సతత స్వాహా, స్వధా, శబ్దద్వయ సంస్కృత హవ్య కవ్య సంతర్పిత మఖశిఖిముఖ నిలింప’- ఆయన యజ్ఞయాగాదులు చేస్తూ సంపూర్ణమైన వైదికధర్మాన్ని అనుష్ఠించాడు. 

Player
>>