ఉపక్రమణిక8

   ‘భారతీ సుస్థితి సంభావిత వదన సదనుడు’- అని తిక్కన గారి సమకాలికులు చెప్పుకున్నారు. వాళ్ళ పుణ్యపరీపాకం, తిక్కన గారి సాహిత్యాన్ని రుచి చూడగలగడం. ‘నీతి నిపుణమతి జిత పురుహూతామాత్యుడు’- నీతి నైపుణ్యం చేత జయింపబడిన పురుహూతుని, ఇంద్రుని పురోహితుడు. బృహస్పతివంటి మేధ కలిగినవాడు. ‘సతత అధ్వరక్రియా కర్మఠపాణి, కావ్య కళాజని భూమి’- కావ్యమునకు పుట్టుస్థానమువంటివాడు. ‘వచస్సమగ్రతా చతురాస్యుడు’- వచస్సులను సమగ్రంగా ప్రయోగించే విషయంలో నాలుగు మోముల బ్రహ్మలాంటి వాడు. ‘నవరసభావా లంకృత కవితారచనా విధానకల్పన పాండిత్య విశేషుడు’- ఆయన సాహిత్యనివేశనం ఎటువంటిదంటే, ఆయనది అమృతలేఖిని. ‘ఉభయభారతీవిశారదుడు. బుధవిరాజి, తిక్కనయాజి’ అనితరగమ్యవాఙ్మయమహార్ణవవర్తన కర్ణధారుడు. నైషధాన్ని ఆంధ్రీకరిస్తూ శ్రీనాధుడు, శ్రీహర్షుడిని ప్రస్తుతిస్తూ తాను ఇతరులు తొక్కని మార్గాలలో రచన చేశాడంటూ, ‘కవికులాదృష్టాధ్వ గమనాధ్వనీనుండు’ అని సంభావించాడు.   ఇదే విధంగా కేతన కూడా తిక్కన గురించి, ‘అనితరగమ్యవాఙ్మయమహార్ణవ వర్తనకర్ణధారుడు' అని ప్రస్తుతించాడు. ఇతరులు ఎవ్వరూ చేరలేనటువంటి విధంగా సాహిత్యసముద్రమనే ప్రపంచంలో తిరిగే నావలకు చుక్కాని పట్టుకుని సమర్థంగా నడిపే కర్ణధారుడు. ఆ స్ధితి ఎక్కడ నుంచి వస్తుంది? తిక్కనగారి దృష్టి ఏమిటంటే - నన్నయగారు చెప్పిన మూడు విషయాలు. వస్తుకవిత మొదటిది. ఒక వస్తువు తీసుకుంటే దాన్ని వర్ణిస్తూ ఉండటం, రమణీయంగా వర్ణించడం, ఉదాహరణకు సముద్రాన్ని వర్ణించాడాయన ‘వివిధోత్తుంగ తరంగ ఘట్టన...’ అలాగే ఉదంకుడి నాగస్తుతిలో ‘బహువనపాదపాబ్ది కుల పర్వత పూర్ణ’ వంటి వర్ణనలు. అంతేకాకుండా రెండవదైన నాటకీయ రచనా వైఖరిలో సంభాషణా చతురిమ చూపించాడు. మూడవది ఆలంకారికధ్వని. చూపించని మార్గం లేదు. వ్రాసేది చిన్న సంఘటన అయినా దానిలో అన్నింటినీ బీజప్రాయంగా స్పృశించాడు. నన్నయగారి సర్వంకషమైన సాహిత్యం నుంచి తిక్కనగారు గ్రహించినది నాటకీయత. ఇక్కడ ఉభయభాషాకావ్యం, ఉభయకవిమిత్రుడు అంటే కేవలం సంస్కృతంలో, తెలుగులో కవిత్వం చెప్పేవాడు అని మాత్రం కాదు. శ్రవ్యకావ్యం పఠనయోగ్యమైనది. దృశ్యకావ్యం అంటే నాటకాలు, ఈ రెండింటినీ సమ్మిళితం అంటే ఏకీకృతం చేసి ప్రదర్శించగలిగిన కవి తిక్కన. అలాంటి రచనలో దృశ్యకావ్యంలోని సహజత్వం, నాటకీయతను తీసుకుని శ్రవ్యకావ్యంలో నిక్షేపించి మనం దానిని చదువుతున్నప్పుడు కూడా అది దృశ్యకావ్య ప్రదర్శనవలె రంగస్ధలంపై పాత్రలు మన కంటి ముందు ప్రత్యక్షం కావాలి. చదువుతున్నది శ్రవ్యకావ్యమైనా, ఆ ఆవేశం, బుద్ధి మనసు లోతులకు పోవాలి.

               ఒక సందర్భం. ఉత్తరగోగ్రహణం జరిగింది. అర్జునుడు ఉత్తరుని సారథిగా గోవులను మరల్చడానికి వెళ్ళాడు. చిట్టచివరికి తానెవరో చెప్పాడు. అర్జునుడని తెలిశాక ఉత్తరుడు, ఆహా నువ్వు అర్జునుడవే అయితే నాదెంతటి భాగ్యం? నేను సారథ్యం చేస్తానని కూర్చున్నాడు. సేన దగ్గరకి వెళ్ళాడు. ఒక్కసారి పరికించి చూశాడు. ద్రోణుడు మొదలైన వాళ్ళందరూ రాజధర్మాన్ని ఆశ్రయించుకొని ఉన్నారు కనుక రాజైన దుర్యోధనుని కాపాడటం ఒక ముఖ్యమైన విషయం. దుర్యోధనుడు పట్టుపడితే ఇంక యుద్ధమే లేదు. అతడు ఎక్కడున్నాడో తెలియకుండా, సేనావ్యూహం రచించి వాళ్ళు ఆ గోగ్రహణం చేసి, ఆవులని తీసుకుని పోతున్నారు. ఆ ఆవుల మందను విడిపించుకుని రావాలని బయలుదేరినది అర్జునుడు. ఆవులను పట్టుకున్నవాళ్ళు కౌరవులు. పుట్టుకతో శత్రువయిన దుర్యోధను డక్కడ ఉన్నాడు. ఇంతకంటే దుర్యోధనుడిని పట్టుకుని పరిమార్చే గొప్ప అవకాశం రాదు అర్జునుడికి. ఒక్కసారి పరికించి చూశాడు. చూసి, ఉత్తరునితో సంభాషిస్తున్నట్లుగా తన ఊహ తాను చేస్తున్నాడు. ఉత్తరా! అక్కడ సైన్యాలు చూస్తున్నావు కదా!

చ.           ఇది యొక పెద్ద గట్టి మొన యీ మొనముందట గోగణంబుతో
      
               నది యొక యల్పసైన్య; మట యాతల వేఱొక కొంతసేన య
        
               ల్లదె; యిటు పంచిపెట్టఁ జను; నంతటిలోన వృధాభిమాన దు
        
               ర్మద బహుభాషియైన కురురాజెచటం జనుచున్నవాఁడొకో!                                     (విరాట. 4-245)

Player
>>