కృతినిర్మాణ ప్రస్తావన10

షష్ట్యంతములు

               భగవదారాధనకు చేసే యజ్ఞయాగాదులు, పూజలు, ఆరాధనలు, అభిషేకాలు, సంతర్పణలు, వ్రతాలు వలె నా వాక్కుతో చేసే అక్షరార్చన. ఆ అనంతతత్వమూర్తికి ఒక అక్షరార్చన. ‘ఆరాధన విశేషంబగుట జేసి’ శాస్త్రవిహితమైన ఆరాధన విధానంలో త్రై మూర్త్యాత్మక గుణంగా ‘అ’, ‘ఉ’, ‘మ’ మూడక్షరాల సంయోగంతో ఏర్పడిన పదము ఓంకారం. కాబట్టి,

క. ఓంకార వాచ్యునకు, నన     
    హంకార విరూఢ భావనారాధ్యునకున్,
    హ్రీంకారమయ మనోజ్ఞా,
    లంకారోల్లాస నిత్యలాలిత్యునకున్                                         (విరాట. 1-32)           

‘ఓంకార వాచ్యునకు అనహంకార విరూఢ పావన ఆరాధ్యునకున్’- ఓంకారంచేత ఉచ్చరింపబడువానికి, అహంకారానికి దూరమై ఆరాధింపబడే పరతత్త్వమునకు, హ్రీంకారరూపమై మనోహరమైన అలంకారంతో ప్రకాశించే నిత్యసౌందర్యరూపునకు, అంకితమిస్తున్నానంటూ ప్రారంభించాడు. ఎప్పుడైతే అహం తత్వం దూరమౌతుందో, అప్పుడు పరతత్త్వం. ఒక వ్యక్తికి దేవుడు కనపడ్డాడు. నీకేం కావాలని అడిగాడు దేవుడు. ‘ఐ వాంట్ పీస్’చాలా మహోన్నతంగా, నాకు సంపదలు కావాలని కోరలేదు. వీడెవడో మహాభక్తుడు, ‘ఐ వాంట్ పీస్’ అన్నాడు. బాగా అడిగావ్. నువ్వు చెప్పిన దాన్లో మూడు పదాలు ఉన్నాయి. ‘ఐ’, ‘వాంట్’, ‘పీస్’ అని. ‘రిమూవ్ ద వాంట్’ అన్నాడు. కోరిక అనేది కొంచెం దూరంగా పెట్టుకో అని అర్థం. ‘ఐ’ ‘పీస్’ మిగిలాయి. ‘రిమూవ్ ద ఐ’ ఆ ‘ఐ’ అనేదే అహంకారం అన్నాడు. ‘ఈ రెండు వదిలిపెడితే మిగిలేది పీసే కదా!’ అన్నాడు. వదలిపెట్టకుంటే ‘పీసెస్’ ఏ కదా! ‘హ్రీంకారమయ మనోజ్ఞా, లంకారోల్లాస నిత్యలాలిత్యునకున్’- ఓం, హ్రైం, హ్రీం అన్నది శక్తి స్వరూపం. ‘శ్రీయన గౌరినా బరగు’ అని ప్రారంభించిన శక్తిస్వరూపాన్నే భావిస్తున్నాడిక్కడ.

క.            త్రిభువనశుకదృఢ పంజర    
               విభవమహితునకు సమస్త విష్టప నిర్మో
               క భుజంగపతి, కఖిల జగ
               దభిన్నరూపునకు భావనాతీతునకున్                               (విరాట.  1-33)

మొదటి శ్లోకంలో ‘ఓంకారం’, రెండవ శ్లోకంలో ‘శుకం’.

          శ్లో. ఓంకార పంజర శుకీమ్,
              ఉపనిష దుద్యాన కేళి కలకంఠీమ్,
              ఆగమ విపిన మయూరీమ్
              ఆర్యా మంతర్విభావయే ద్గౌరీమ్.

                        తల్లిని శక్తిస్వరూపాన్ని వర్ణించిన ఈ శ్లోకతాత్పర్యమే ఈ రెండు పద్యాలకు ఆధారం. పంజరంలోని ఓంకారం అనే శుకం, ఉపనిషత్తులు అనే ఉద్యానవనంలో ఆటలాడే కలకంఠి, కోయిల. వేదములు అనే వనములలో సంచరించే నెమలి. ఆ పరాదేవి శుకము, కలకంఠి, మయూరి. ఈ మూడింటి సమాహారరూపమే సంగీత సాహిత్య నృత్యాత్మకమైన స్వరూపం. ఓంకారరూప శుకములు పలుకులే సాహిత్యం, కలకంఠమునుండి వెలువడే శబ్దమే సంగీతం, ఈ రెండింటినీ అభినయరూపంలో అందించేది ఆగమములనే విపినములలో సంచరించే మయూరం. సమస్త సంగీతసాహిత్య నృత్యాత్మకమై సకలకళాస్వరూపమైన ఆ పరాశక్తి లోలోన ప్రకాశిస్తుంది.

Player
>>