కృతినిర్మాణ ప్రస్తావన11

స్వర్గమర్త్యపాతాళలోకాలు అనే చిలుకలకు దృఢమైన పంజరమూ, పాముకుబుసములనే లోకాలను విడిచిన సర్పరాజువంటి ఊహలకు అందని హరిహరనాథుడు –

క.            శ్రుతి సీమంత మణికి, నా  
               శ్రిత వాంఛాపూర్తి కరుణ చింతామణి, కా        
               నత దురిత తమో ద్యుమణికిఁ          
               గ్రతుభూషణమణికి, లోకరక్షామణికిన్                           (విరాట.  1-34)

               ఈ పద్యం పోతనకు ఊతమిచ్చినట్టిది. ‘శ్రుతి సీమంత మణికి’, శ్రుతులకు వేదాలకు పాపటరత్నంగా ప్రకాశించేవాడు, ‘ఆశ్రిత వాంఛాపూర్తి కరణ చింతామణి’, తనను ఆశ్రయించినవారి కోరికలను తీర్చే చింతామణి, ‘ఆనత దురిత తమో ద్యుమణి’, శరణువేడిన భక్తుల పాపాలనే చీకట్లను పారద్రోలే ద్యుమణి, ‘క్రతుభూషణమణికి, లోక రక్షామణికిన్’, సూర్యునకూ, యజ్ఞయాగాదులకూ తలమానికమూ, లోకాలను రక్షించటమే దీక్ష అయిన వానికి.

క.            పరమ శమ నిరత సంయమి
               
వరమానస కుముద హాస వర్ధన చంచ
               
చ్చరణ నఖ చంద్రికా వి
               
స్ఫురణా చిత్ర ప్రకార శోభాఢ్యునకున్                             (విరాట.   1-35)

               ఈశ్లోకమంతా ఒకే సమాసం. ‘పరమశమనిరత’- ఆయనను సాధించుకోవడానికి కావలసినది నిష్కల్మషమైన అంతరింద్రియ నిగ్రహము. ‘సంయమివరమానస కుముద హాసవర్ధన చంచచ్చరణ నఖచంద్రికావిస్ఫురణా చిత్ర ప్రకార శోభాఢ్యునకున్’ ఈ విధంగా సాధించిన శమసంపదచే తన పాదాలను సేవించుకుంటున్న వాళ్ళ హృదయ కుముదములలో ఎల్లప్పుడు సంతోషాన్ని పెంపొందించే వెన్నెలకిరణాల ప్రకాశంతో, చిత్రమైన సొంపులతో నిండిన కాలిగోళ్ళు కలవానికి, ఆ హరిహరనాథునకు. 

క.            హరిహరనాథునకు మరు     
               త్సరిదాకల్పిత మనోజ్ఞ చరణ శిరస్సుం
               దర మూర్తికి భావన త
               త్పరచేతోయుక్తభక్త పరతంత్రునకున్                             (విరాట.    1-36)

               ‘హరిహరనాథునకున్ మరుత్సరిదాకల్పిత మనోజ్ఞ చరణ శిరస్సుందర మూర్తికి’- దేవతానదియైన మందాకిని ఒకేమారుగా పాదాలను, శిరస్సును మనోహరముగా అలంకరింపబడిన సుందరమూర్తికి, ‘భావన తత్పరచేతో యుక్త భక్తపరతంత్రునకున్’. ధ్యానంలో మునిగిపోయిన మనస్సుగల భక్తులకు వశుడైన ఆ హరిహరనాథునికి అంకితము ఇస్తున్నాను.

ఈ రచనతో తిక్కనగారు ప్రారంభించిన ప్రక్రియ సాహిత్యంలో ప్రచురమైంది. నన్నయగారు శ్రీకారంతో ప్రారంభించే సంస్కారం నేర్పితే తిక్కనగారు కృతినాథుని సంబోధిస్తూ షష్ఠీవిభక్తిలో పద్యాలను వ్రాసి కథను నడపడం ప్రారంభించారు. వాక్యసంగత మైన వాక్ప్రవాహంలో పదాలకు అర్ధం విభక్తిప్రత్యయాలతోనే సాధ్యం. కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్ అనే షష్ఠీవిభక్తి ప్రత్యయాలతో అంతమౌతాయి కాబట్టి షష్ఠ్యంతములు అంటారు. తిక్కనగారు ప్రవేశపెట్టిన షష్ట్యంతములతో కథను నడిపే ప్రక్రియను శిరోధార్యంగా భావించారు తరువాతి కవులు. 

Player
>>