కృతినిర్మాణ ప్రస్తావన12

‘నేను విన్నపంబు సేయు తెఱంగుగా నంతస్సన్నిధిన్ గలిగించుకుని’- ఆ హరిహరమూర్తిని మనస్సున నిలుపుకుని, ‘అమ్మహాకావ్యంబు అర్థంబు సంగతంబు చేసెద’- రాజరాజనరేంద్రుడు నన్నయగారిని కోరినప్పుడు ‘కృష్ణ ద్వైపాయన ముని వృషభ అభిహిత భారత బద్ధ నిరూపితార్థం’ ఏర్పడ తెలుగున చెప్పమన్నాడు. భారతములో నిరూపిత మైన అర్థాన్ని తెలుగులో చెప్పినట్లుగా తిక్కన కూడా అర్ధంబు సంగతంబు చేసెద అని సాత్యవతేయ సంస్మృతితో సంబోధిస్తూ రచన సాగించాడు.

ఆ.           శరణాగత సంశ్రిత భయ
               హరణా సురనికర శేఖరానర్ఘమణి
               స్ఫురణా పరిచయ రంజిత
               చరణా వనమాలికా భుజంగాభరణా                             (విరాట.  1-38)

               ‘శరణాగత సంశ్రిత భయ హరణా’- శరణు కోరి నిన్ను ఆశ్రయించిన వారి భయాన్ని తొలగించేవాడా, ‘సురనికర శేఖరానర్ఘమణిస్ఫురణా’- దేవతాసమూహం నమస్కరిస్తుండగా వారి ఆభరణాలలోని అమూల్యరత్నాల కాంతులతో అరుణమైన పాదములు కలవాడా, ‘పరిచయ రంజితచరణా వనమాలికా భుజంగాభరణా’- వనమాలను, భుజంగాలను ఆభరణాలుగా ధరించిన హరిహరనాథా! హరిహర రూపం కనుక భుజంగములను, వనమాలికను రెండింటిని సమానంగా ధరించాడు.

క.        అజగవ శార్ఙ్గాలంకృత
           భుజగర్వ నిరస్తదైత్య భూమస్తుత్యా
           త్రిజగద్ధారణ నిత్యా 
           భుజగ సమాచరిత శయన భూషణ కృత్యా                       (విరాట.  1-39)

              ‘అజగవ శార్ఙ్గాలంకృతభుజగర్వ నిరస్తదైత్య భూమస్తుత్యా’- అజగవము అంటే ఈశ్వరుడి విల్లు. పాముతో చేయబడిన విల్లు కనుక పినాకము. విష్ణువు విల్లు శార్ఙ్గము. -‘త్రిజగద్ధారణ నిత్యా భుజగ సమాచరిత శయన భూషణ కృత్యా’. ఆ రెండు విల్లులచేత అలంకరించబడిన భుజముల గర్వముచేత దైత్యులను తొలగించిన స్వామీ! అనేక విధాలుగా స్తుతింపదగినవాడా! మూడు లోకాలను నిత్యము ధరించువాడా! సర్పాలను పడకగానూ, ఆభరణాలుగానుగల హరిహరనాథా!

క.         జల నిధి హిమవద్భూధర
            కలిత జనన కేళికౌతుక వ్యక్తా వ్య
            క్త లలిత సౌందర్య స్ఫుర
            దలఘుతను స్త్రీ సనాథ హరిహరనాథా                          (విరాట.  1-40)

               ‘జల నిధి హిమవద్భూధర’- క్షీరసముద్రానికీ, హిమవత్పర్వతాలనికీ జన్మించి, -‘కలిత జన కేళికౌతుక వ్యక్తా వ్యక్త లలిత సౌందర్య స్ఫుర దలఘుతను స్త్రీ సనాథ హరిహరనాథా’. లీలామానుషవేషంతో వ్యక్తావ్యక్తమైన కోమల సౌందర్యస్ఫూర్తితో ప్రకాశించే స్త్రీమూర్తికి నాథుడవైన హరిహరనాథా!

వ.           దేవా! దివ్య చిత్తంబున నవధరింపుము.                         (విరాట.  1-41)

   ‘దివ్య చిత్తంబున నవధరింపుము’ నీవే పలికించే ఈ పలుకులను నీ మహిమగా గ్రహించమని వినయంతో వేడుకుంటున్నాడు.  

Player
>>