కృతినిర్మాణ ప్రస్తావన13

ఆ.        కథ జగత్ప్రసిద్ధి గావునఁ బూర్వ ప
            ర్వార్థ యుక్తి చేయునట్టి యెడల
            యత్నమించుకంత యయినను వలవదు
            వలసినట్లు చెప్పవచ్చి యుండు                                   (విరాట.   1-42)

               ‘కథ జగత్ప్రసిద్ధి’- భారతంలోని కథ అందరికీ తెలిసినదే. ‘కావునఁ బూర్వ పర్వార్థ యుక్తి చేయునట్టి యెడలయత్నమించుకంత యయినను వలవదు’- ముందుచెప్పిన విషయాలను మళ్ళీమళ్ళీ చెప్పవలసిన సందర్భంలో ముందు జరిగిన విధంగానే చెప్పనక్కరలేదు. సందర్భానికి తగినట్లుగా ఉచితరీతిలో చెప్పటమే. అందుకనే కర్ణజననం, గరుత్మంతుడి కథాగమనంలోనూ విభిన్నత గోచరిస్తుంది. సందర్భానుసారంగా యథావకాశంగా చెప్పుకోవచ్చు.

మహాభారతము సమస్త దురితాపహము, అభిమత శుభావహము కావున ఒక్క మహాఫలంబు గోరి జనమేజయుండు వినగోరాడు. మహాభారతమెటువంటిది? సమస్త దురిత అపహము, అభిమత శుభ ఆవహము. ‘ప’, ‘వ’ రెండు అక్షరాలే తేడా! అక్కడ, ఆపహము, ఇక్కడ ఆవహము. కూర్చేది. పోగొట్టేది. దురితములను పోగొట్టేది, శుభాలను కూర్చేది అయిన మహాభారతం ‘కృష్ణద్వైపాయన మహాముని కారుణ్యంబు పడసి తదీయ ప్రియ శిష్యుండైన వైశంపాయను వలన జనమేజయుండు వినిన కథ యగుటన్ జేసి తత్ప్రకారంబున నడిపెద’- ఆ విధంగా నేను కథ నడుపుతానని సంకల్పించాడు.

Player
>>