కృతినిర్మాణ ప్రస్తావన2

అన్నాడు. ఇలా సంస్కృతసమాసరచనలో చాలా సులభంగా అర్థం అవుతాడు తిక్కన. ఆచ్చతెలుగులో అనుకుంటే మాత్రం జటిలత్వమే. ‘నిరతిశయానుభావానందభరిత అంతఃకరణుండు నగుచుండి ఒక్కనాడు ఇట్లని వితర్కించితి’. ఈ సాహిత్యంలో వచ్చిన ధోరణులు, మత అల్లకల్లోల పరిస్థితి చూసి ఆయనే ఆలోచించాడు.

   ‘విద్వత్సంస్తవనీయ భవ్య కవితావేశుండు, విజ్ఞానసంపద్విఖ్యాతుడు, సంయమి ప్రకర సంభావ్యాను భావుండు’- ఎవరు? కృష్ణద్వైపాయనుడు. ఆయన నల్లగా ఉన్నాడు కాబట్టి కృష్ణుడు. ఆయన పుట్టినది ద్వీపంలో. ద్వీపమే ఆయన పెరగడానికి మార్గమైనది కాబట్టి ద్వైపాయనుడు అయినాడు. రెండింటినీ కలిపితే కృష్ణద్వైపాయనుడైన మహర్షి వేదవ్యాసుడు. ‘అర్థి లోకహిత నిష్ఠం బూని’- తనకి కీర్తి కలగాలని కాదు, ‘లోకహితనిష్ఠన్ బూని కావించె ధర్మాద్వైతస్థితి భారతాఖ్యమగు లేఖ్యంబైన ఆమ్నాయమున్’- పంచమ వేదమది. సాక్షాత్తు వేదాలలో ఉండే సారాన్నంతా నిబిడీకృతం చేస్తూ సంధానించుకుని లోకహితదృష్టిచేత తాను కూడా ఒక పాత్రగా దానిలో ప్రవర్తించి, భరతవంశస్థుల కథను ఆధారంగా ఆ ఆమ్నాయధర్మాన్ని సంపూర్ణంగా నిక్షేపించి, ధర్మాన్ని స్థాపించి, అద్వైతస్ధితిని నిలిపాడు. కానీ ఇప్పుడు ద్వైతస్థితిని భావిస్తూ భేదభావాలతో సంప్రదాయం చెడిపోతోంది కదా! అని ఆలోచించుకుని, అంతటి మార్గదర్శి ఆ మహర్షి పుంగవుడు అనుగ్రహించిన బ్రహ్మసూత్రాలను, అష్టాదశ పురాణాలను వదిలివేసి కేవలం భారత ఇతిహాసాన్ని గ్రహిస్తే ఆ కావ్యగత ధర్మనిర్దేశకత్వం, ధర్మ ఉద్బోధనను మరచి, పరతత్వరూపాన్ని గమనించక ఆ అద్వైతస్వరూప సిద్ధాంతాన్ని విడిచి, కేవలం రాగద్వేషాలు ప్రధానంగా మసలుతున్నారు. ఏమిటిది? అని వితర్కించుకున్నాడు.

విద్వత్సం స్తవనీయభవ్యకవితావేశుండు-విద్వాంసులచేత స్తుతింపదగిన శుభప్రదమైన కవితావేశం కలిగిన వ్యాసులవారి వర్ణనా వైఖరి విశిష్టమైనది. నన్నయగారు మత్స్యగంధిని వర్ణించే సందర్భంలో, ‘తనువు మీన్పొలవల్చు జాలరిదాన’ అని వర్ణిస్తూ ‘చపలాక్షు చూపుల చాడ్పుల కెడమిచ్చు చిక్కని చనుగవ చీర గోరు, ఎంత శాంతులయ్యు, ఎంత జితేంద్రియులయ్యు కడు వివిక్తమైనచోట సతుల గోష్ఠి చిత్తచలనమొందుదురు’(ఆది.3-38) అని సీసపద్యం వ్రాశాడు. కానీ వ్యాస మహర్షి ఆమెను ‘అతీవ రూపసంపన్నాం, సిద్ధానామపి కాంక్షితాం’ అని సూక్ష్మంగా వర్ణించారు. ఇంద్రియాలను జయించడంకోసం సాధన చేసిన సిద్ధులచేత కూడా ‘కాంక్షితాం’, కోరదగినది. అంటే ఆమె ఎంత సౌందర్యవతియో చెప్పకనే చెప్పినట్లయినది. అదీ మహర్షి వాక్కు, అలాంటి రచన చేసిన వ్యాసులవారిని నన్నయగారు సవినయముగ భావించిన విధానము, ఎఱ్ఱాప్రగడగారు సాష్టాంగ ప్రణామాలతో చూపించిన విధానము, అష్టావక్రచరిత్రలో, నహుషోపాఖ్యానంలో, యక్షప్రశ్నలలో వ్యాసవాణికి, తెలుగువాణికి మధ్యగల తేడా గమనించుకున్నాం. అది మహర్షి తత్వం. అలా విద్వాంసులచేత భావింపదగిన కవితావేశం కలిగినవాడు, విజ్ఞానసంపద్విఖ్యాతుడు, సంయమిప్రకర సంభావ్యాను భావుండు – సంయమములచేత - యమదమనియమాదులచేత శరీరాన్ని ఇంద్రియాలను అదుపుచేసే నిబంధనలు పెట్టుకుని నియమించుకునే వారిచేత కూడా ఆరాధించబడినవాడు, అయిన వ్యాసమహర్షి ‘లోకహిత నిష్ఠంబూని’ మహాభారత రచన చేశారు కదా!

   మరి ఇపుడు ఏమయ్యింది? వేదములకు, అఖిల స్మృతి వాదములకు, ఈ వాదము, ఆ వాదము, అని ఏదో నాది ఇది అని, విపరీతమైన అర్ధాలను వ్యాఖ్యానిస్తూ, అహంకారం అహంభావం చేత పెడత్రోవ పట్టించే ధోరణి ప్రబలి పోయింది. అది కేవలం బుద్ధి, వాది లోపమే కాని వాద లోపమెప్పుడూ ఉండదు. సిద్ధాంతము ఒకటే ఉంటుంది. అయితే తమ తర్కనైశిత్యంచేత చమత్కారమైన భాషణలు చేస్తూ వాళ్ళు చూపించే ప్రమాణాలు గాని, విధానాలు గాని చిత్ర విచిత్రంగా ఉంటాయి. అందుకని ‘వేదములకు, అఖిల స్మృతివాదములకు, బహుపురాణ వర్గంబులకున్ వాదైన చోటులకును’, ఎన్ని విధాలైన సందేహాలు వచ్చినా సమన్వయపూర్వకంగా, ‘తామూదల’ అన్నింటికి ఒకేఒక్క సమాధానం. ‘ధర్మ అర్ధ కామ మోక్ష స్ధితికిన్’ ఈ చతుర్విధ పురుషార్ధాలకు మూలమైన ధర్మాలను చెప్పగలిగిన ఈ మహా భారతామ్నాయం. 

Player
>>