కృతినిర్మాణ ప్రస్తావన3

‘అదియును’, నా ఉద్దేశ్యంలో ఈ పద్యం చెప్పాక, తిక్కనగారు లేచి చేతులు కట్టుకుని నమస్కారం చేసుకుని తరువాత వ్రాసి ఉంటారు. మహానుభావుడు, ఆదికవి నన్నయగారిని స్మరిస్తూ,

ఉ.           ఆదరణీయ సార వివిధార్థ గతి స్ఫురణంబు గల్గి య
       
               ష్టాదశ పర్వనిర్వహణ సంభృతమై పెనుపొందియుండ; నం
          
               దాదిఁ దొడంగి మూఁడుకృతు లాంధ్ర కవిత్వ విశారదుండు వి
       
               ద్యాదయితుం డొనర్చె మహితాత్ముఁడు నన్నయభట్టు దక్షతన్.    (విరాట.1-6)

               ‘ఆదరణీయ సార వివిధార్థ గతి స్ఫురణంబు గల్గి’- ఆ మహాభారతంలో ఏ పర్వం తీసుకున్నా రమణీయంగానే, చమత్కారంగానే ఉంటుంది. ‘అష్టాదశపర్వ నిర్వహణసంభృతమై పెనుబొందియుండ’- మహాభారతంలో పదునెనిమిది పర్వాలున్నాయి. ‘అందాది దొడంగి మూడుకృతులు ఆంధ్రకవిత్వ విశారదుండు’- ఆంధ్రకవిత్వానికి విశారదత్వం, తెలుగు కవిత్వానికి, తెలుగు వాణికి జీవం పోసిన నన్నయ, ‘విద్యాదయితుడు’- అంటే ‘కవిబ్రహ్మ’ అని, ఈ కవిబ్రహ్మ తిక్కన ఆ నన్నయకు ‘కవిబ్రహ్మ’ అనే బిరుదాన్ని ఇస్తున్నాడు. విద్యకు దయితుడు, విద్య కోరివచ్చి ఆయనను వరించింది. అటువంటి విద్యాదయితుండు ‘ఒనర్చె మహితాత్ముడు నన్నయ భట్టు దక్షతన్’- దాక్ష్యం అని వ్యాసులవారు ప్రయోగించిన మాటకు తపస్సు అని అర్ధం. ఒక కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు దాన్ని సుసంపన్నంగా నిర్వహించే సామర్ధ్యమే దక్షత. ఆ దక్షత ఆది, సభా, అరణ్యపర్వశేష రచనలో తేటతెల్లమైంది.

            మ.          హృదయాహ్లాది, చతుర్థ, మూర్జిత కథోపేతంబు, నానా రసా           
               భ్యుదయోల్లాసి విరాటపర్వ మట యుద్యోగాదులుం, గూడఁగాఁ
               బదియేనింటిఁ దెనుంగుబాస జనసంప్రార్థ్యంబులై పెంపునం
               దుదిముట్టన్ రచియించు టొప్పు బుధ సంతోషంబు నిండారఁగన్ (విరాట.1-7)

               మరి ఈ నాలుగవపర్వం విరాటపర్వం, చాలా ఊర్జితమైన కథలతో కూడి, అత్యంతమైన నిబిడత్వంతో ఉంటుంది. నానారసాభ్యుదయోల్లాసి, నవరసాలకు స్థానమైనది. ఉత్తర అభిమన్యుల వివాహ సందర్భంలో శృంగారరస ముంది. నర్తనశాలలో భీముడు కీచకుని సంహరించే ఘట్టంలో బీభత్సరసముంది. ఉత్తర గోగ్రహణంలో వీరరసముంది. ఉత్తరకుమారుడి చేష్టలలో హాస్యరసముంది. ఈ విరాటపర్వంలో లేని రసమేది? నవరసాలకు తావకమైనది.  ‘నానా రసాభ్యుదయోల్లాసి విరాటపర్వమట ఉద్యోగాదులన్ కూడగా’- ఈ విరాట పర్వంతో పాటు, ‘ఉద్యోగాదులన్ కూడగా పదియేనింటిని’- పదునైదుపర్వాలు రచించాడు. నన్నయ మూడు పర్వాలు వ్రాశాడు. మిగిలిన పదునైదు పర్వాలను ‘తెనుంగు భాష జన సంప్రార్థ్యంబులై పెంపునన్, తుది ముట్టన్ రచియించుట ఒప్పు’- ఈ పదిహేను పర్వాలను మళ్లీ వేరేవారికి అవకాశం ఇవ్వకుండా పూర్తిచేయడం మంచిది. ‘బుధ సంతోషంబు నిండారగన్’- అంటే అంతవరకు తక్కిన కవులెవరూ భారతం జోలికి ఎందుకు పోలేదో తెలియదు. తిక్కనగారి తాతగారు హుళక్కి భాస్కరుడనే ఆయన భాస్కర రామాయణం వ్రాశారు. ఆయన కూడా చాలా గొప్ప కవే. అద్భుతమైన శైలిలో భాస్కరరామాయణం రచించారు. వారి తరువాత వచ్చిన కవులెందరో. తిక్కనగారి శిష్యుడే అయిన మారన మార్కండేయపురాణం వ్రాశాడు. వీరిలో ఎవ్వరూ మహాభారతం గ్రహించకపోవడానికి వారి సామర్థ్యలోపమా? కాదే! కానీ ఎందుకో ఎవ్వరూ పూనుకోలేదు. -‘బుధసంతోషంబు నిండారగా’- ఆ లోటు నేను తీర్చాలి అనుకుని, 

Player
>>