కృతినిర్మాణ ప్రస్తావన7
ప్రణామంబులు ఆచరించి, ‘అప్రమేయ ప్రభావ భావనాతీతుం డయ్యును అప్పరమేశ్వరుండు ఆశ్రితులకు అత్యంత సులభుండని’- ఎంత గంభీరంగా ఉన్నా కూడా భక్తులకు సులభుడని ‘బుధుల వలన విని యునికిం జేసి’- పెద్దలవలన విన్నదానిని భావించి ‘ననుబోటి బాల స్వభావునకు’- నాలాంటి బాలిశుడికి, ఇట్టి మహనీయ మహిమ దొరకొనుటయు’
క. పలికెడిది భాగవతమట
పలికించు విభుండు రామభద్రుండట, నే
పలికిన భవహర మగునట
పలికెదవేరొండు గాథ పలుకగనేలా! (పోతన-భాగవతం)
కవిత్రయం భారతరచన చేసి ఆపివేయటం నా పుణ్యఫలమే కదా! భాగవతాన్ని తెలుగుజేయగలుగుతున్నానని పోతన అనుకున్నట్లుగా, తిక్కనగారు ‘ఇట్టి మహనీయ మహిమన్’ నావంటి బాలస్వభావునకు దొరకుటయు ఆ ఆకారాన్ని తలంచుచూ, -‘అవ్విభునకు విన్నపంబు సేయువాడనై కొమ్మనామాత్యు ఆననంబాలోకించి తదనుమతి వడసి’- తండ్రి ముఖాన్ని చూసి వారి కనుసన్నల అనుమతితో సమాధానమిచ్చాడు.
క. భూరి భవత్కారుణ్య
క్షీరాంబుధి నాదు తుచ్ఛ చిత్తంబును వి
స్తార మహితముగ నునిచితి
వారయ నచ్చెరువు గాదె యఖిలాండపతీ! (విరాట. 1-20)
నాదు తుచ్ఛచిత్తంబును - తుచ్ఛము అంటే ప్రస్తుతార్థంలో పరమ అసహ్యమై, పరమ నికృష్టమైనది. నిజానికి తుచ్ఛము అంటే కల్మషములచేత నిండుటచే తుచ్ఛము. -‘విస్తార మహితముగ నునిచితి వారయ అచ్చెరువు కాదె యఖిలాండపతీ’- కారుణ్యక్షీరాంబుధిలో కల్మషమైన నా మనసు నిక్షేపించుకున్నావు.
ఉ. ఇంతకు నేర్చు నీకు, నొక యింతటిలోన, మదీయవాణి న
త్యంత విభూతిఁ బెంపెసఁగు నట్టి నినుం గొనియాడఁ జేఁత దా
నెంతటి పెద్ద? నీ కరుణ నిట్లు పదస్థుఁడ నైతి నింక జ
న్మాంతర దుఃఖముల్ దొలఁగు నట్లుగఁ జేసి సుఖాత్ముఁ జేయవే (విరాట.1-21)
‘ఇంతకు నేర్చు నీకు’- ఈ సకల చరాచర సృష్టి, స్ధావర జంగమాత్మకమైన ప్రపంచాన్ని నిర్దేశించదగిన చైతన్యతత్త్వభూత పరతత్వమైన నీకు, ‘ఇంతకు నేర్చు నీకు నొక ఇంతటి లోన’- ‘కిమస్థిమాలాం’ అన్న చిన్న శ్లోకానికే నాకంటే పెద్దలు చెప్పిన వాటినన్నిటినీ వదిలివేసి, ‘ఇంతటిలోన మదీయ వాణి అత్యంత విభూతిపెంపెసగునట్టి నినుం కొనియాడ జేసి తానెంతటి పెద్ద?’- నానుండి వచ్చిన ఈ వాక్కు, ఇంత చిన్న పదంచేత నీ మనసు పొంగిపోయినదా? ఆ సారస్వతమూర్తి ఎంత గొప్పదైపోయింది, ఇంతకన్న కావలసిందేముంది? నిర్వచనోత్తర రామాయణానికీ భారతరచనకీ మధ్య మహర్షితుల్యుడు కావటంతో, ‘నీ కరుణ ఇట్లు పదస్థుడనైతి’- నీ కరుణ వల్ల ఈ విధంగా సుస్థిరముగా ఉన్నాను కదా ‘ఇంక జన్మాంతర దుఃఖముల్ తొలగునట్లుగ చేసి’- జన్మజన్మల దుఃఖాన్ని తొలగించి,
శ్లో. పునరపి జననం పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనం. (ఆది శంకరాచార్య - భజగోవిందం)