కృతినిర్మాణ ప్రస్తావన9

పుట్టు కృతార్థతం బొరసె’- నా జన్మ సార్ధకం అయింది. ‘పుణ్యచరిత్రుడనైతి అవ్విభున్ కట్టెద పట్టము’- ఇక ఆ విభునికి పట్టం కడతాను. ‘అప్రతిమ కావ్య కవిత్వ మహా విభూతికిన్’- దానిలోని ఆ కారుణ్యధారా పరాకాష్ఠాస్ధితిని అనుభవించిన వాడనై ఆ పరతత్త్వానికే అంకితమిస్తాను.

ఉ.           కూర్చుట నూత్న రత్నమునకుం గనకంబునకుం దగున్ జనా        
               భ్యర్చిత మైన భారత మపార కృపాపరతంత్రవృత్తిమైఁ      
               బేర్చిన దేవదేవునకుఁ బ్రీతిగ నిచ్చుట సర్వసిద్ధి; నా        
               నేర్చిన భంగిఁ జెప్పి వరణీయుఁడ నయ్యెద భక్తకోటికిన్           (విరాట 1-28)

   ‘కూర్చుట నూత్న రత్నమునకుం గనకంబునకుం దగున్’- బంగారు ఆభరణం తయారుచేయటానికి బంగారమూ, మణీ రెండూ కొత్తవైతే కూర్చి క్రొత్తగా చేయవచ్చు. మణికి- కనకమూ, కనకమునకు- మణీ తగినట్లుగా, ‘జనాభ్యర్చితమైన భారతము’- జనులందరూ అధ్యయనం చేస్తున్న ‘అపార కృప పరతంత్ర వృత్తిమై’- ఆయన  దయను నామీద సంపూర్ణంగా ప్రసరింపజేసిన ‘దేవదేవునకు ప్రీతిగ ఇచ్చుట సర్వసిద్ధి’- కనుక అతనికన్న వేరే అధినాథుడు లేడు ‘నా నేర్చిన భంగి జెప్పి వరణీయుడనయ్యెద భక్త కోటికిన్’- వినయం సంపూర్ణంగా వచ్చింది. అత్యంత వినయంతో ఈ భారతాన్ని చెప్పి, భక్తకోటికి వరణీయుడనవుతాను.

వ.           ‘ఇది యనన్య సామాన్యకరణం బగు పరమ ధర్మ ప్రకారంబు’(విరాట. 1-29) 

దీనిలోని విశేషము అనన్య సామాన్యమైనది. అన్యులు పొందలేని స్థితి.

ఉ.           కావున భారతామృతము కర్ణపుటంబుల నారఁగ్రోలి యాం 
               ధ్రావళి మోదముం బొరయునట్లుగ సాత్యవతేయ సంస్మృతి
               శ్రీ విభవాస్పదం బయిన చిత్తముతోడ మహాకవిత్వ దీ
               క్షావిధి నొంది పద్యముల గద్యములన్ రచియించెదం గృతుల్       (విరాట. 1-30)

               భారతమనే అమృతాన్ని చెవులతో తనివితీరా త్రాగమనీ, ‘ఇమ్ముగ సర్వలోకజను లెవ్వనియేని ముఖామృతాంశుబింబమ్మున ఉద్భవంబైన భారతవాగమృతంబు’ అని నన్నయగారు చెప్పారు, ‘ఇమ్ముగ’ ప్రీతితో, సర్వలోక జనులు ఎవ్వని ముఖమనే చంద్రబింబమున ఉద్భవంబైన భారతవాక్కు అనే అమృతమును కర్ణరంధ్రంబను అంజలిందవిలి త్రావుదురో, అట్టి మునీంద్రలోక వంద్యున్ పరమున్ పరాశరసుతున్’ ఆ వేదవ్యాసమహర్షిని, ‘ప్రణమిల్లి కరంబు భక్తితోన్’ అని నన్నయగారు భారతము ప్రారంభిస్తే తిక్కన గారు ‘భారతామృతము కర్ణ పుటంబుల నారగ్రోలి ఆంధ్రావళి మోదమున్ బొరయునట్లుగ సాత్యవతేయ సంస్మృతి శ్రీవిభవాస్పదంబైన చిత్తముతోడ’- నా రచన వ్యాసులవారునిర్మించిన ధర్మమార్గానికి భిన్నము కాని రీతిలో వినిర్మించే కార్యదీక్షతో, ‘మహాకవిత్వదీక్షావిధి నొంది పద్యముల గద్యములన్ రచియించెదన్ కృతుల్’- పద్య గద్యాత్మకమైన చంపూ పద్ధతిలో రచిస్తానని సంకల్పించారు.  కావ్యాంతం లో ‘హరిహరనాథ సర్వ భువనార్చిత నన్ దయ జూడుమెప్పుడున్’ అని ముగించారు. ‘అని పూని యీదృశంబులగు పుణ్యప్రబంధంబులు దేవరసన్నిధిం బ్రశంసించుటయు నొక్క ఆరాధనా విశేషం బగుటం జేసి’ ఆ భగవంతుని అర్చించ డానికి ఎంతమందో ఎన్నో చేస్తుంటారు. 

Player
>>