కథాప్రారంభము1

కథా ప్రారంభము

‘పరమపవిత్రులగుపాండుపుత్త్రులచరిత్రంబుపాఖ్యానసహితంబుగా వ్యాఖ్యానంబు సేయుచుండ’- జనమేజయునకు వైశంపాయనుడు చెబుతున్నాడని నేను కూడా ఆ కథను అలాగే చెప్తాను. అయితే, ‘వలసినట్లు చెప్పవలసి యుండు’, కాబట్టి ఏది ఎలా అనేది నేను గమనించి చెప్తానని చెబుతూ, ‘ఆ పరమపవిత్రులగు పాండుపుత్త్రుల చరిత్రం బుపాఖ్యానసహితంబుగా’- ఆఖ్యానము, ఉపాఖ్యానము సహితంగా వ్యాఖ్యానము చేయుచుండ, ‘వారల వనవాససమ్యగనుష్ఠానంబు సవిస్తరంబుగావిని జనమేజయుండు వైశంపాయనునకిట్లనియె’-వాళ్ళవనవాసకథంతా విని జనమేజయుడు వైశంపాయనునితో ఇలా అన్నాడు.

చ.           మహిత సముజ్జ్వలాకృతులు మానధనుల్ జనమాన్యులంగనా
       
               సహితము గాఁగ నేమిగతి సమ్యగుపాయ నిగూఢవృత్తిమై

               నహితుల కప్రభేద్యముగ నా పదుమూఁడగు నేఁడు మత్పితా
          
               మహులు చరించి? రంతయుఁ గ్రమంబున నా కెఱుగంగఁ జెప్పుమా                                                                                                      (విరాట.   1-44)

‘మహిత సముజ్జ్వలాకృతులు’- జనమేజయుడు వైశంపాయనుని అడుగుతున్నాడు. పాండవులు జనమేజయుడికి ఏం కావాలి? ప్రపితామహులు కదా! అందుకని వాళ్ళ కథ సమగ్రంగా అడిగి తెలుసుకుంటున్నాడు. ‘మహిత సముజ్జ్వలాకృతులు మానధనుల్ జనమాన్యు లంగనాసహితము గాఁగ నేమిగతి సమ్యగుపాయ నిగూఢవృత్తిమై నహితుల కప్రభేద్యముగ నా పదుమూఁడగు నేఁడు’- అయ్యా పన్నెండేళ్ళైపోయింది వనవాసము, పదమూడవ సంవత్సరం వచ్చింది. -‘ఆ పదుమూఁడగు నేఁడు మత్పితామహులు చరించిరి? అంతయుఁ గ్రమంబున నా కెఱుగంగఁ జెప్పుమా’. ఒక్క విశేషం కూడా వదిలేయ వద్దు. క్రమంగా మొత్తం చెప్పు ఈ పద్యం చూస్తే చిన్నగా ఉంటుంది. అర్ధం చూస్తే చాలా గంభీరంగా ఉంటుంది. అడిగినదేమిటీ, వీళ్ళు ఇప్పుడు చేయబోయేది అజ్ఞాతవాసం. అరణ్యవాసం తర్వాత వచ్చిన అజ్ఞాతవాసంలో మా తాతగారు వాళ్ళు, ఒక్కొక్కళ్ళూ ఎటువంటి వాళ్ళు? భీమసేనుడు చూసుకుంటే ఎటువంటి వ్యక్తిత్వం? ఎటువంటి శరీరాకృతి? ఎటువంటి మనోధర్మం? మరి ఇటువంటి వాళ్ళు, మహిత సముజ్జ్వలాకృతులు, వాళ్ళకున్న ఉన్నతమైన ఆకార విశేషం, దాచితే దాగేది కాదు ఆ తేజం. కర్ణుణ్ణి గురించి కుంతి అనుకున్నది కదా నేను ఎప్పుడో ఒకప్పుడు కనుక్కుంటాను, దాచిపెడితే దాచే తేజం కాదు కదా అని. ఆ విధంగా మహితములైన సముజ్జ్వ లాకృతులు కలవారు వీరు, ‘నిగూఢవృత్తిమై నహితుల కప్రభేద్యముగ’ ఆ పదమూడవ ఏడు ఎలా గడిపారు? మహిత సముజ్జ్వలాకృతులు నిగూఢవృత్తితో ఎలా ఉన్నారయ్యా? ఈ నిగూఢవృత్తి అనేది ప్రతిపదానికి అన్వయించుకోవాలి.

ఎవరికీ తెలియని దారిలో, ఉదాహరణకు భీముడు నడుస్తుంటే భూమి కదులుతూ ఉంటుంది. అదిగో భీముడు నడుస్తున్నాడే అనిపిస్తుంది. అటువంటివాడు తెలియకుండా ఎలా ఉన్నాడు? అర్జునుడు ఎటువంటి తేజశ్శాలి? ఆయన తేజస్సు దాగేదా? వీళ్ళ గురించి తెలియకుండా ఎలా సాధ్యం? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోటికి వెళ్ళారా? అందరూ కలిసి ఒకేచోట ఉన్నారా? అంత గొప్ప శరీర ఆకృతి కలిగినవారు నిగూఢవృత్తిమై ఎలా ఉన్నారు? సమ్యక్ ఉపాయ నిగూఢవృత్తి, అది కూడా చక్కని ఉపాయంతో, సమయానికి తగిన ప్రతిభాపాటవాలతో ఆపదను గడపదలుచుకుంటూ ఈ అజ్ఞాతవాసాన్ని దాటిపోవాలి అనే ఉద్దేశ్యంతో, సమయోచితమైన బుద్ధితో ఎలా గడిపారు?  అంతేకాదు మాన ధనుల్ – అభిమానమే ధనంగా కలవారు – అభిమానంతో మెలగేవారు. భీముడి సంగతి తెలిసినదే కదా, హను మంతుడు దారికి అడ్డుగా కూర్చున్నప్పుడు ఏం చేశాడు? వదిలాడా? తరువాత తెలిసి నమస్కరించి ఉండవచ్చు గాక. యక్షుడు వచ్చినప్పుడు ఎవరైనా మాట విన్నారా? అదే కాదు ఎన్ని విశేషాలు జరుగుతున్నా కూడా ధర్మరాజు ఊరికే ఉంటాడేమో గాని, భీముడు ఊరికే ఉండలేడు కదా!

Player
>>