కథాప్రారంభము2

‘ధారుణి రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ జూచి రంభోరు నిజోరుదేశమున నుండగ బిల్చిన ఇద్దురాత్ము’ అంటూ ప్రతిజ్ఞలు పలికాడే! అటువంటి అభిమానధనంతో కూడిన వాళ్ళు, మాటపడని వాళ్ళు ‘సమ్యగుపాయ నిగూఢ వృత్తిమై’- ఎలా ఎక్కడ ఉండి ఉంటారు? జనమాన్యులు, ప్రజలచేత గౌరవింపదగిన వాళ్ళు. ప్రజల చేత గౌరవింపగదగిన దానికి లక్షణమేమిటి? ఎందువల్ల ఒక వ్యక్తి గౌరవింపబడతాడు? ఒక వ్యక్తి గౌరవింపబడుతున్నాడు అంటే, వాడివలన సమాజానికి ఏదైనా గుర్తింపు కలిగిన కార్యం జరుగుతున్నప్పుడే గౌరవం వస్తుంది. ఒక తపస్వి తపస్సు చేస్తూ ముక్కుమూసుకుని ఉండొచ్చు గాక! కాని ఎందుకు గౌరవం వస్తుందంటే మానసికంగా అతను లోకకళ్యాణంకోసం భావించి తపస్సు చేస్తున్నాడు కాబట్టి గౌరవం కలుగుతుంది. కాబట్టి ‘జనమాన్యులు’, ఒకరికి కలిగిన ఆపదను నివారించే కార్యంలో అత్యంత దీక్ష పూనినవాళ్ళు ‘సమ్యగుపాయనిగూఢవృత్తిమై’ ఏ విధంగా చరించారు? ‘అంగనా సహితము గాగ’, వీళ్ళకున్న మనోధర్మాలు చెప్పారు. ఆకార విశేషము - మహిత సముజ్జ్వలాకృతులు, మనోధర్మము - మానధనులు, జనమాన్యులు. ఈ ప్రత్యేకతలతో సమ్యగుపాయ నిగూఢ వృత్తితో మెలగాల్సిన విషయాలు రెండున్నాయి. ఒకటి ‘అంగనా సహితము గాగ’- వీళ్ళ వెంట ద్రౌపది ఉంది. ఆమెను వెంటపెట్టుకుని, రెండు ‘అహితుల కప్రభేద్యముగ’- వాళ్ల శత్రువులు గుర్తించలేని రీతిలో కనుక్కోడానికి వీలు కాకుండా, అంగనాసహితముగా, అహితులకు అప్రభేద్యముగా సమ్యగుపాయనిగూఢవృత్తిమై ఎలా గడపగలిగారు? 

‘అని అడిగిన వైశంపాయనుఁ డమ్మనుజేంద్రచంద్రు నధి కౌత్సుక్యంబున కలిమికి తన హృదయంబున గాఢాదరము భరితముగ ఇట్లనియెన్’ ఒక్కసారి చూసి, ఏమడిగావయ్యా నీ ప్రశ్న! ఒక్క ప్రశ్నడిగావు, సమ్యగుపాయ నిగూఢ వృత్తిమై అన్నావు గాని, దాని ముందు అన్న మాటలలో మొత్తం కలిపేశావు కదా! ఇంక నేను ఆ క్రమంగా చెప్పవలసినదే! ‘పాండవులు వనవాసంబు సముచితంబుగా సలిపి’- పాండవులు ఏ విధంగా వనవాసం నెరవేర్చాలో ఆ విధముగా, ప్రతిజ్ఞకు భంగం రానీయని రీతిలో గడిపి, ‘పండ్రెండగు నేటి కడపట తమకు ధర్మదేవతా సమాగమం బయిన’- పండ్రెండవ సంవత్సరం చివరి రోజుల్లో యక్షదర్శనమైంది ధర్మరాజుకి.

ఆ ధర్మమూర్తి అనుగ్రహంచేత ‘తత్ప్రసాదంబున అజ్ఞాతవాస సమయంబునకు భంగము గాకుండ వరంబు వడసి అంతకుమున్ను తమ వెనుక అడవులన్ తిరుగుచూ అగ్నిహోత్రంబులన్ తోడనకొని వర్తిల్లు భూసురోత్తములు’- వాళ్ళందరూ అరణ్యవాససమయ ప్రారంభం నుంచీ వదలి పెట్టలేదు కదా! ‘అయ్యా! మా భోజనం మేము తెచ్చుకుంటాం, మా వంట మేము చేసుకుంటాం, మా పోషణ గురించిన చింత వద్దు మీ దగ్గరుండటమే మాకు కావాలి’ అని వెంటపడి వచ్చినట్టి ఆ బ్రాహ్మణులు, అగ్నిహోత్రములు - పాండవులు కూడా సుక్షత్రియులు కాబట్టి వారికి కూడా అగ్నిహోత్రములున్నాయి - ఆ అగ్నిహోత్రాలను రక్షించే ధౌమ్యుడుండాలనే కదా అప్పుడు అర్జునుడికి అంగారపర్ణుడు చెప్పింది. అర్జునుడు తమను ఎలా గుర్తించలేదు అని అంగారపర్ణుణ్ణి అడిగితే, ‘మీకు అగ్నిహోత్రాలను రక్షించే పురోహితుడు లేడు కాబట్టి గుర్తించలేద’న్నప్పుడు, ధౌమ్యుడిని ఏర్పాటు చేసుకున్నారు కదా! ఆ సందర్భాన్ని గుర్తుంచుకుని, ‘అగ్నిహోత్రంబులం దోడనకొని వర్తిల్లు భూసురోత్తములు తమ్ముం బరివేష్టించి యుండ’- అందరూ కూర్చున్నారు. ‘అయ్యా పన్నెండేళ్ళు అరణ్యవాసం అయిపోయింది. ద్రౌపది వద్దనున్న అక్షయపాత్ర సహాయంతో భోజనాలు అన్నీ జరిగిపోయినాయి, కథలు, విశేషాలు చెప్పడానికి ఎంతోమంది వచ్చారు. ఎన్నో జరిగిపోయాయి. ఇంక తరువాత జరగవలసివనది ఏమిటి? ‘తమ్ము పరివేష్టించి యుండ తారనుష్ఠింపం బూనిన పని’- ఇక ఇప్పుడు చేయవలసినదేమిటి? ప్రతిజ్ఞలో ఉన్న మరో పన్నెండు నెలలకాలం, మూడువందల అరవై ఆరో, అరవై అయిదు రోజులో అజ్ఞాతవాసం తెలియకుండా ఉండాలి. ‘తారు అనుష్టింపబూనిన పని వారల కెఱిగింపన్ తలంచి’- తిక్కన వాక్య నిర్మాణం, ‘వారల కెఱిగింపన్ తలంచి’. నన్నయ రచన ఇలా ఉండదు, తిక్కన, నన్నయ వదిలేసిన అరణ్యపర్వశేషం పూరించకపోవడానికి కారణమదే. నన్నయ కవితానిర్మాణశక్తికి, తిక్కనగారు ఎన్నుకున్న రసాభ్యుచిత కావ్యనిర్మాణ విధానానికి ఎంత మాత్రం పొంతన లేదు. ‘వారల కెఱిగింపన్ తలంచి కరకమలంబులు ముడిచి సవినయంబుగా నిట్లనిరి’.

Player
>>