కథాప్రారంభము3

‘తెల్లంబుగాదె మీకు’- అందరూ వచ్చి కూర్చున్నారు. ఏం చేస్తారు? పాండవులు ఎక్కడకి వెళతారు? మేమెక్కడకి పోవాలి? పాండవులకున్న ప్రతిజ్ఞ అందరికీ తెలుసు. ఈ కూర్చున్న అందరినీ చూసి ‘తెల్లంబు కాదె మీకెల్ల సుయోధను జేసిన కుటిల విచేష్టితంబు’- అయ్యా! మీకు తెలుసు. ఎందుకని ఏ ఋషి వచ్చినా అందరినీ ఇదే అడుగుతున్నాడు ధర్మరాజు. అదే ప్రశ్న కాబట్టి మీకు తెలుసు, -‘అకట మాతో మీరు అడవుల నిడుమల బొందితిరి’- మాకు మిత్రులు కారు, కానీ మా మీద ఉన్న సన్నిహిత స్నేహభావంచేత, మీ అగ్నిహోత్రాలను తెచ్చుకుని మీ శాకపాకాలను మీరే చేసుకుంటూ, మాతో పాటు ఏ కారణం లేకుండా వచ్చి, అడవుల నిడుమల పడితిరి. ‘ఒక భంగి పోయె కాలము’ - పన్నెండు సంవత్సరాలు ఎలా అయిపోతాయో అనుకున్నాం. ‘ఒక భంగి పోయె కాలము ఇది పదమూడగు నేడు.’ ఇపుడు పదమూడవ సంవత్సరంలోకి వచ్చాం, ‘మాకు అజ్ఞాత వాసంబు సలుపంగ వలయు’- మాకు ఒక ప్రతిజ్ఞ ఉన్నది, ఎవరూ గుర్తించని రీతిలో గడపాలి. ‘ఇందు ధార్తరాష్ట్రులు, సూత తనయ సౌబలులును చెఱుపన వేతురు’- ఈ కఠినమైన కఠోరపరీక్షను మా ప్రతిజ్ఞాభంగం కలుగకుండా ప్రవర్తించే విధానంలో, ధార్తరాష్ట్రులు ‘కౌరవులు, సూతతనయుడు’- కర్ణుడు, సౌబలులును, శకుని మొదలగువారు, ‘చెఱుపన వేతురు’- దీన్ని చెడగొట్టాలనే వేచి ఉంటారు. వేచి ఉంటారనే దానికి క్రియనే వేతురు. ఎలా బయల్పరచాలా అని కాచుకొని ఉంటారు. ‘చిన్న సన్న ఎరిగిరేని’- కొంచెం వాళ్ళకి గుర్తు తెలిసిందా, అంటే పాండవులు ఇక్కడున్నారని ‘చాల ఎగ్గు వాటిల్లు’- మాకొచ్చే ప్రమాదం అంతా ఇంతా కాదు. ఏ మాత్రం అనుమానాస్పదమైన పరిస్ధితి ఇక్కడుంది అనేది వాళ్ళు గమనించారా, అయ్యా మళ్ళీ పన్నెండేళ్ళ అరణ్యవాసం, అజ్ఞాతవాసం చెయ్యాల్సిందే!

‘అట్లగుట’ – కాబట్టి, ‘మమ్ము ఇంక అతిరహస్యవృత్తిమై నిరస్తవిఘ్నులరై చరియింపుడని అనుగ్రహింపవలయు’- ధర్మరాజు అడగడం చూడండి. మేము పోతాం అని అడగటంలేదు. అయ్యా! మమ్ములను మీరనుగ్రహించండి, ఆశీర్వదించండి. ‘అతిరహస్యవృత్తిమై’- ఎవరికీ తెలియకుండా, ‘నిరస్తవిఘ్నులరై’- ఇబ్బందులు లేకుండా అడ్డు ఆపు లేకుండా, చరియింపుడు అని అనుగ్రహింపవలయు మీరు. మీరు ఇంక మమ్మల్ని వదిలి పొండి అనలేదు ఆయన. మా అజ్ఞాతవాసంలో మమ్మల్ని ఎవరూ గుర్తించే పరిస్ధితి లేకుండా ఉండేలా ఆశీర్వదించండి అంటే ‘తమరిక దయ చేయవచ్చు’ అని కదా! ‘బహు ప్రకార వచన రచనా విశారదుండైన ధర్మ తనయుండు’ అని నన్నయగారు ధర్మరాజును గురించి చెప్పారు ఆదిపర్వంలో.

Player
>>