ధర్మజుని అరణ్యవాస జ్ఞాపకాలు1

ధర్మరాజు - అరణ్యవాసం - జ్ఞాపకాలు

          ‘అట్టి సమయంబున ధర్మనందనుండు విషణ్ణ హృదయుండై’- ఈయనకి ఒక మేఘచ్ఛాయ వచ్చింది. ఇలా అడిగాడు ‘ఒకనాడు ఏమును ఆపదలకు విడుమరఁ గాంచి’- ఆపదల నుంచి బయట పడి, ‘విప్రులన్ చుట్టలన్ పెట్టుకుని’- విప్రులను, చుట్టములను, ‘సుఖముండ పడయుదు’- ఆ రోజు ఎప్పుడైనా ఉందా? ఎన్ని బాధలు పడ్డాం. ‘ఇప్పాటు ఎందు గలదె యొరులెవ్వరికిన్’- ఆ అవస్ధ ఎవ్వరికీ రాకూడదు. ‘మీరందరూ నన్ను ఆశ్రయించుకున్న వాళ్ళు, మిమ్మల్ని అనుగ్రహింపవలయునని కోరుకోవలసి వచ్చింది. ఆ పరిస్థితి ఎవరికీ రాకూడదయ్యా’ ‘అని డగ్గుత్తిక పెట్టి’- దుఃఖపరవశుడై మొదటి స్ధితి ఏదో అక్కడికే వచ్చాడు. ‘అమ్మహీసురవరులుం దమ్ములు నతని నాశ్వాసించుచుండ తత్పార్శ్వంబున నున్న ధౌమ్యుండు తదీయ విషాదోపనోదంబు చేయ దలంచి ఇట్లనియె’- ఆయన చూశాడు. ధర్మరాజు డగ్గుత్తిక పెట్టుకోవలసిన పనేమిటి? ధర్మరాజు చుట్టుప్రక్కల చూస్తుండగా అన్నదమ్ములు, ద్రౌపది, బ్రాహ్మణులు అంతా కూర్చున్నారు. ఇంక ఈ రోజు ముగిస్తే రేపటినుండి క్రొత్తప్రస్థానం చేయవలసిన అవసరం ఉంది.

          ఒక్కసారి పర్యాలోకనం చేసుకున్నాడు. ఎక్కడ పుట్టాము? శతశృంగపర్వతంపై. ఎందుకు? కుంతీదేవి, పాండురాజు, వాళ్ళ సంకల్పంతో, వరబలంతో యమధర్మరాజుని, వాయువును, ఇంద్రుడినీ, అశ్వినీదేవతలనూ ఆహ్వానిస్తే పుట్టారు పాండవులు. పసిపిల్లలుగా ఉన్నపుడే పాండురాజు మరణించాడు. అక్కణ్ణించి, ఆ విప్రులు వాళ్ళని తీసుకుని వచ్చి ధృతరాష్ట్రునికి అప్పగించారు. ‘అయ్యా! తండ్రి లేని ఈ పిల్లలు నీ తమ్ముని పిల్లలు’ అని చెప్పగా, తన పిల్లలలాగానే చూసుకుంటానని చెప్పి తీసుకున్నాడు ధృతరాష్ట్రుడు. అది ఎంతవరకైందీ? దుర్యోధనాదులు పెద్దవారయ్యేంతవరకు. అప్పటివరకు సమస్త రాజ్యసుఖాలనూ, భోగాలనూ ఏకచ్ఛత్రాధిపత్యంగా అనుభవిస్తున్న కౌరవులకు ఉన్నట్లుండి ఈ అయిదుగురూ వచ్చేటప్పటికి, వీళ్ళు భాగాలు పంచుకుంటారనే భావము కలిగి వాళ్ళని దూరం పెట్టారు. భీముణ్ణి చూసి దుర్యోధనుడికి, ఇతర ధార్తరాష్ట్రులకూ ఆ ద్వేషం ఇంకా పెరిగింది. ద్రోణాచార్యుల అస్త్రవిద్యాశిక్షణలో, వీళ్ళతోపాటు చదువుకొనేవాళ్ళలో, అర్జునుడి విలువిద్య చూసి కర్ణుడికీ స్పర్థ వచ్చింది. నిష్కారణంగా అసూయ, మాత్సర్యము ఎందుకు కలగాలి? ధర్మరాజుకి అర్థం కాలేదు. గడిచిపోయింది. ఎన్నో ఆపదలు కలిగించారు. లక్క ఇల్లు ఏర్పాటు చేశారు. పాండవులు ఏకచక్రపురానికి వెళ్ళవలసి వచ్చింది. అక్కడ జరిగిన సంఘటనతో పాంచాలపురం చేరారు. మత్స్యయంత్రం భేదించారు, ద్రౌపదిని తెచ్చుకున్నారు, అర్ధరాజ్యం వచ్చింది. ఆ ఫరవాలేదులే, ఇంక దిగులులేదు అనుకునే సమయంలో విశ్వకర్మ బ్రహ్మాండమైన ఇంద్రప్రస్థపురాన్ని నిర్మించాడు. శ్రీకృష్ణభగవానుడు వచ్చి తోడుగా ఉన్నాడు. రాజసూయ యాగం చేశారు. ఆ రాజసూయయాగం అనంతరం అవభృథస్నానంతో పవిత్రురాలైన యాజ్ఞసేని వైభవంతో యజ్ఞదీక్ష ను విరమించి, ఆ సమస్త సంపదలకు ఆలవాలమై అనుభవించినాడు. ఇంతలో కారుమేఘం కమ్మింది. వీరి వైభవాన్ని సహించలేని దుర్యోధనుని, శకుని మాయామార్గంచేత జూదంలో సర్వ సంపదలు పోగొట్టుకోవలసి వచ్చింది. పడరాని అవమానాలను భరించవలసి వచ్చింది. అక్కడి నుంచి అరణ్యవాసం వచ్చారు. అరణ్యవాసప్రారంభంలో కూడా ఇప్పటిలాగానే డగ్గుత్తిక వచ్చి, వీళ్ళందరినీ ఎలా పోషిస్తాననే బాధతో మూర్ఛపోయాడు. అప్పుడు శౌనకమహర్షి వచ్చాడు. జనక మహర్షి చెప్పిన శ్లోకార్థాన్ని చెప్పి ధర్మరాజును ఆశ్వాసించాడు.

శ్లో.        శోకస్థాన సహస్రాణి భయస్థాన శతాని చ, 
     
            దివసే దివసే మూఢమావిశన్తి న పణ్డితమ్.                    (వ్యాసభారతం)

       శోకభయస్థానంబులు అనేకంబులు-మనిషికి దుఃఖాన్ని, భయాన్ని కలిగించేవి అనేకములు. చాలా ఉంటాయి. అవన్నీ కలిగిననూ, వివేకవిహీనుండు వ్యాకులత బొందునట్లు, వివేకముగలవాడు బుద్ధి వికలుడగునే? ఆ బోధచేత తేరుకున్నాడు. తేరుకుని తన ధర్మాన్ని నిర్వర్తించడానికి సూర్యుణ్ణి అర్థించి అక్షయపాత్ర పొందాడు. పాండవులు అక్షయపాత్ర పొందారనే వార్త విని అక్కడ దుర్యోధనాదులందరికీ మనసు చెదిరిపోయింది. ధృతరాష్ట్రునికీ ఈ అవస్థ వచ్చింది.

Player
>>