ధర్మజుని అరణ్యవాస జ్ఞాపకాలు2

                      విదురుడు, సంజయుడు పలకరిస్తే, ‘పాండవులు అందరూ ఎలా ఉన్నారు? అభివృద్ధిలో ఉన్నారా? కృశిస్తున్నారా?’ అని అడిగాడు. వాళ్ళందరితో కలిసి ఉన్నప్పుడే మైత్రేయుడనే మహర్షి వచ్చి పాండవులు చక్కగా ఉన్నారని చెప్పి, దుర్యోధనుడికి బోధ చేశాడు. ఏం చేశాడు? వారికి వాసుదేవ, ధృష్టద్యుమ్నులు సంబంధ సహాయులు. వాసుదేవుడు, ధృష్టద్యుమ్నుడు సంబంధముచేత, బాంధవ్యముచేత సహాయులు. సుభద్రను పెళ్ళి చేసుకోవటంతో శ్రీకృష్ణునితో బాంధవ్యమూ, ద్రౌపదిని వివాహం చేసుకోవటంతో ధృష్టద్యుమ్నునితో బాంధవ్యము. ఇద్దరూ పరమ పరాక్రమవంతులు. పైగా యజ్ఞంలో ఉద్భవించినవాడు ధృష్టద్యుమ్నుడు. కాబట్టి ‘జరామరణవంతులైన మనుజులు వారిని జెనకి ఎట్లు జీవింతురు’? అందుకని వారితో నీవు ‘ఒడంబడి యుండుము, ఇదియ కార్యంబు’, అని మైత్రేయుడు చెపితే దుర్యోధనుడిచ్చిన సమాధాన మేమిటి? ‘మైత్రేయుని పలుకుల నాదరింపక పాదాంగుష్ఠంబు నేలను రాయుచూ’, ‘ఏం చెప్తున్నాడ’న్నాడు. ‘పాదాంగుష్ఠమున నేల వ్రాయుచూ బాహువెత్తి తొడను చరిచి నగుచున్న ఆ దుర్యోధనుని చూచి మైత్రేయుం డలిగి ఈ అపరాధంబున ఆహవంబగు’, నువ్వు చేస్తున్న ఈ తిరస్కారమువలన యుద్ధం జరుగుతుంది. అందు ‘భీము గదాఘాతంబున నీ యూరు యుగళంబు భగ్నంబయ్యెడు’ అని శాపం ఇచ్చి వెళ్ళాడు. అక్కడ ఇది ధర్మరాజాదులకు వెనుక జరిగిన ఘట్టం. తరువాత వీరు విన్నది. 

          అక్కడనుంచి బయల్దేరుతూ ఉండగా మార్కండేయమహర్షి వచ్చాడు. తాను చెప్పవలసినది చెప్పి, వెళ్ళి పోయాడు. అంతలో ద్రౌపది వచ్చి, దుఃఖించింది. ఆ దుఃఖాన్ని చూచి భీముడు పదమూడు నెలలైతే పదమూడేళ్ళై పోయినట్లే కదా అన్నాడు. భీముడు, ద్రౌపది వీళ్ళ సంవాదము అంతా విని, ధర్మరాజు యోచించి కార్యం చేయగలిగినవాడు కనుక వాళ్ళకు నచ్చజెప్పి, ‘అల్ప ఉపాయంబైన కార్యంబు సాహసోపేతంబైనను దోషంబు లేదు’-. చిన్న పనైతే ఇబ్బంది లేదు. ఇది మహాకార్యము. రాజ్యం వదిలి వచ్చిన తరువాత మన సామంతరాజులందరూ కూడా వారి అధీనంలోనే ఉన్నారు. భీష్మ, ద్రోణ కృపాదులందరూ కూడా రాజ్యధర్మాలను ఆశ్రయించి ఉన్నారు. మనము అయిదుమందిమి ఏ సహాయంతో వారిపైకి పోతాము? కాబట్టి ‘సువిచారితంబైనను సిద్ధింబొందు’- బాగా చక్కగా ఆలోచించి చేస్తే తప్ప ఈ కార్యక్రమం సఫలం కాదు. ‘విచార పూర్వ ఆరబ్ధ కార్యంబునకు దైవంబును అనుకూలం బగు’- ఆలోచించి చేసిన దానికి దైవం అనుకూలిస్తాడు, కాబట్టి సామర్థ్యం సమకూరేవరకూ వేచి ఉండవలసింది అన్నపుడు కృష్ణద్వైపాయనుడు వచ్చి, ‘మీకేమీ కొరత లేదు, అర్జునుణ్ణి పంపించండి. శివుని మెప్పించి, పాశుపతాన్ని తేగలడు’ అని చెప్పగా అర్జునుడు బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళి అయిదేండ్లైంది. ఆ సమయంలో బృహదశ్వుడు వచ్చాడు. అతనిని ‘పుడమియు రాజ్యము బంధుల విడిచి మృగావళుల కలిసి విపినంబులలో మావలె ఇడుములబడిన వారెవరైన కలరా’? అని ప్రశ్నింపగా బృహదశ్వుడు నవ్వి ‘అయ్యా మీకెక్కడ ఇబ్బంది ఉంది? దేవసములైన అనుజులతో, విప్రులతో కూడి ఉన్నావు, నల చక్రవర్తి గురించి విన్నావా అంటూ నలచరితము చెప్పాడు.

             ఆ నలచరిత సారాంశభూతమైన విషయమేమిటంటే ‘అయ్యా! దంపతిసహితంగా ఉన్నావు. ఎట్టి దుఃఖాలలో అయినా మనిషికి-పురుషుడికి-దుఃఖార్తుడైనవాడికి శాంతినిచ్చేది భార్య. నలచరిత్ర సిద్ధాంతం ఏమిటంటే ‘అధిక దుఃఖ రోగార్తునకు ఔషధంబు, సురుచిరంబుగ భార్యయ సువ్వె ఒనర భార్యా సమేతుడైయున్న వానికి యెంతలయ్యును ఆపద లెఱుక పడవు’ అని దమయంతి తనను విడిచి పుట్టింటికి వెళ్ళమని నలుడు అన్నప్పుడు చెప్తుంది. ‘కాబట్టి అటువంటి భార్య నీ దగ్గరే ఉంది కనుక నీకు దుఃఖోపశమనం కలగాలి కదా!’ అని ఉపదేశించి వెళ్ళాడు బృహదశ్వుడు. అర్జునుడు వెళ్ళి అయిదేళ్ళయ్యింది, ఇంకా రాలేదని ఆరాటపడుతున్న వీళ్ళని చూచి, ఇంద్రుడు రోమశ మహర్షిని పిలిచి, అర్జునుని క్షేమాన్ని గూర్చి వీళ్ళకు తెలిపి, ధర్మరాజును తీర్థయాత్రలు చేయమని చెప్పమన్నాడు. నారదుడు వచ్చి తీర్థయాత్రా మాహాత్మ్యాన్ని వినిపించాడు. రోమశుడు పాండవులను తీసుకొని వెళ్ళి అగస్త్యతీర్థం చూపించాడు. అగస్త్యునిచరిత్ర, భగీరధుని కథ, ఋష్యశృంగుని కథ తెలియచెప్పాడు. వాటితో పాటుగా సోమకుడిచరిత్ర, శిబిచరిత్ర, అష్టావక్రుడి కథ, గురుమహత్త్వం వివరించే అవక్రీతుడిచరిత్ర అన్నింటినీ వినిపించాడు. ఈ పన్నెండేళ్ళుగా జరిగిన విషయాలన్నీ ధర్మరాజు మనఃఫలకం మీద తిరుగుతున్నాయి. 

Player
>>