ధర్మజుని అరణ్యవాస జ్ఞాపకాలు3

    ఆ తరవాత గంధమాధనపర్వతానికి వెళ్ళారు. భీముడికి హనుమంతుడి దర్శనమైంది. హనుమంతుడు భీముడికి ‘సాహసం మంచిది కాదు నాయనా జాగ్రత్తగా ఆలోచించి కార్యం నిర్వహించు కోవలసింద’ని ఉపదేశించాడు. నహుషుడు వచ్చి ‘మీ నడవడికయే మీకు శోభ తెస్తుంద’ని ఆశీర్వదించాడు.

          మార్కండేయ మహర్షితో పాటుగా శ్రీకృష్ణుడు సత్యాసహితంగా వచ్చాడు. మార్కండేయ మహర్షిని పాండవులకు బోధ చేయమని ఆదేశించగా, ధర్మరాజు బ్రాహ్మణ, క్షత్రియ ప్రభావాలు చెప్పమని అడిగాడు. బ్రాహ్మణ ప్రభావానికి సంబంధించిన కథలు విన్నాడు. తార్ష్యుడు అనే వ్యక్తి కుమారుని హైహయవంశీయుడైన ధుంధుమారుడు అపహరిస్తే వారు అన్వేషిస్తూ వెళ్ళారు. ఆ కుమారుడు అక్కడ ఆడుకుంటున్నాడు. వారికి అద్భుతంగా తోచింది. వారి ఆశ్చర్యాన్ని తీరుస్తూ మనిషి సక్రమమైన పద్ధతిలో జీవించాలి అంటే జీవననిర్మాణసూత్ర మొకటి చెప్పాడు. ‘ఆలస్యం బొక యింత లేదు, శుచి ఆహారంబు నిత్యక్రియాజాలంబు’ ఏమరము, అర్చనీయు లతిథుల్, సత్యంబ పల్కంబడున్ మేలౌ శాంతియు బ్రహ్మచర్యమును నెమ్మిం దాల్తుము. ఇట్లౌటచే ఎక్కాలంబున్ పటు మృత్యు రోగభయశంకం బొందము’. ఆ తర్వాత మార్కండేయుడు తత్త్వబోధ చేశాడు. ప్రళయకాలం ఎలా వస్తుందని అడిగాడు ధర్మరాజు. కలియుగధర్మాలతో పాటుగా ఎన్నో చెప్పాడు. ధర్మరాజుకు ఇవన్నీ గుర్తుకు స్తున్నాయి. ఒక్కసారి మనసు బలహీనం అయిన సమయంలో ధౌమ్యుడు ఓదార్చేసరికి ఇవన్నీ కళ్ళముందు తిరిగాయి. మార్కండేయుడి కథల్లో అంగీరసుడు అగ్నిదేవుడైన కథ విన్నాడు, కుమారస్వామి కథ విన్నాడు. సత్యభామ ద్రౌపదిని నీవెలా ఇంతమందితో ఎలా సంసారం నిర్వహించుకుంటున్నావని అడిగింది. ద్రౌపది ఆమెకు స్త్రీధర్మాలను చెప్పింది.

             పాండవులు ఇలా ద్వైతవనంలో ఉన్న సమయంలో, వనవాసం పూర్తయ్యేకాలం దగ్గరికి వచ్చింది కదా అని ధృతరాష్ట్రుడు దుఃఖపడ్డాడు. దుర్యోధనుడు మాయోపాయంతో వీళ్ళను పరాభవించాలని అనుకున్నాడు. కర్ణుడు పరాభవించబోయి పరాభవింపబడినాడు. చిత్రసేనుడు కౌరవులను బంధించి తీసుకుని పోతుంటే ధర్మరాజు సమచిత్తత చూపి ఒక సిద్ధాంతం చేశాడు. ‘ఏకాన్వయ జాతులైన వారికి అర్థ నిమిత్తంబైన భేదంబు ఒక్కొక్కమాటు వర్తిల్లు’- ఒకే వంశస్థులైన వాళ్ళకు ధనం కారణంగా విరోధం కలుగుతుంది. -‘అంతన చేసి సహజస్నేహంబు తప్పనేరదు’- సహజస్నేహంబు-మనతో పుట్టినవాళ్ల మీద ప్రేమ మానుకోకూడదు. కాబట్టి ‘జ్ఞాతిజనంబులు తమలో ఎట్టి వారైననూ ఒప్పును గాని అన్యుల వలన పరిభవంబు తొడరినప్పుడు తారు ఒండురుల చేకొనకునికి లోకనింద్యంబు’- ‘మనలో మనం కలహించుకుంటే మనం అయిదుమంది, వాళ్ళు నూరుమంది. కానీ ఎదుటివాడు వస్తే మనం నూటఅయిదు మందిమి నాయనా!’ అని భీముడిని అర్జునుని శాంతింపజేసి దుర్యోధనాదులను విడిపించాడు. దుర్యోధనుడు అవమానభారంతో కుమిలిపోయి ప్రాయోపవేశానికి సిద్ధపడితే కర్ణుడు పాండవ నిర్మూలనకై ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞ విని ధర్మరాజు చింతాక్రాంతుడైతే ఇంద్రుడు వచ్చి కర్ణుడి కవచకుండలాలను తీసుకునిపోయాడు. అవి తీసుకుపోయిన తరువాత కొంచెం శాంతి లభించింది. ఇలా ఉండగా వ్యాసులవారు వచ్చి ధర్మబోధ చేశారు. ‘కాల విపర్యయంబున సుఖంబును దుఃఖము వచ్చుచుండు. ఎక్కాలము ఏరికిన్ ధ్రువము కాదు సుఖంబును దుఃఖంబును’- ఎవ్వరికీ ఎప్పుడూ ఒక్కలాగానే ఉండదు. ‘మహీపాలా! బుధుండు తద్వివివిధ భంగు లెఱింగి ప్రమోద భేద సంశీలుడు కాడు రెంటను ప్రసిద్ధ పథంబున’- ఒక్కసారి రెండింటినీ అనుభవించవలసి వస్తుంది. సమచిత్తుడై ఉండి ఒక్కసారి ధైర్యం తెచ్చుకున్నాడు. ఇంక వనవాసకాలం అయిపోవచ్చింది కదా అనుకున్నాడు. బంధువైన సైంధవుడు పాండవులు లేని సమయంలో ద్రౌపదిని అపహరించాలనుకున్నాడు. భీమార్జునులు విడిపించారు. తరువాత ధర్మరాజు మార్కండేయుని అడిగాడు. ‘ఎక్కడైనా ఇటువంటి అన్యాయం ఉందా? ద్రౌపదిలాగా బాధపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా?’ అని అడగగా, ‘మీకన్నా బాధపడినవారు ఎందుకు లేరు?’ అంటూ రామాయణం అంతా చెప్పాడు. రామాయణం అంతా విని, సీతలాంటి పతివ్రతలు ఇంకెవరైనా ఉన్నారా? అని ప్రశ్నించగా, సావిత్రి ఉపాఖ్యానం చెప్పి, ఒక స్త్రీ తన సంసారాన్ని ఏ విధంగా రక్షించుకుంటుందో, రక్షించుకోగలదో చెప్పాడు. తరువాత యక్షుని దగ్గరకు వచ్చాడు. ధర్మ దేవత ఆశ్వాసించింది. 

Player
>>