ధౌమ్యుని ఓదార్పు1

కృతినిర్మాణ ప్రసక్తి-సింహావలోకనం

        “పారాశర్యుని కృతియయి భారతమను పేరఁ బరఁగు పంచమ వేదం బారాధ్యము” అనే విషయాన్ని గమనించిన తిక్కన సోమయాజి భారత రచనకు ఉపక్రమముగా తన చిత్తనైర్మల్యానికి, మనోమాలిన్య నిర్మూలనకు, మేధాజనితమైన ఊహకల్పనకు, తాత్విక సంబంధమైన ఉన్నతిని ఉద్దేశించి సోమయాగం చేసి సోమయాజియై “హృదయాహ్లాది చతుర్థ మూర్జిత కథోపేతంబు” అని విరాటపర్వము నుంచి తక్కిన పదిహేను పర్వములు, ‘మూడు పర్వములు విద్యాదయితుండు నన్నయభట్టు ఒనర్చె దక్షతన్’ అని చెప్పి, ఆ మూడు కృతుల తర్వాత ఉన్న మిగిలిన పదిహేను పర్వములు ఏకధాటిగా వ్రాయడానికి సంకల్పించినపుడు హరిహరనాథుడు వచ్చి ఆయనకు సాక్షాత్కరించాడు. మహాభారతాన్ని తిక్కనగారు ఏ విధంగా రాశారు? నన్నయగారు తీసుకున్న ప్రాతిపదిక ఒక విధంగా ఉంటే, తిక్కనగారు  స్వీకరించిన విధానం ఇంకొకటి. నన్నయగారి దగ్గరనుంచి తిక్కనగారి వరకు దాదాపు రెండు వందల సంవత్సరాల కాలపరిమితిలో ఆంధ్రదేశంలో జరిగిన చారిత్రక, సాంస్కృతిక, సామాజిక, సాంఘిక పరిణామాల కారణంగా, మతపరముగ, సాహిత్యపరముగ కళాపరముగ ఎన్నో విధాలైన మార్పులు వచ్చాయి. ఆ మార్పులనన్నిటిని జీర్ణం చేసుకుని, ఆ కాలంలో సాహిత్యంలో వస్తున్న విపరీత ధోరణులకు, మత విధానాలకు సమాధానంగా సాహిత్యపరంగా, సమాజపరంగా తాను నిర్వర్తించవలసిన బాధ్యతను గమనించినవాడై, భారతం తప్ప చెప్పడానికి ప్రత్యామ్నాయం ఏమీ లేదు అనే సంకల్పంతో తిక్కనగారు మహాభారత రచనకు పూనుకొన్నారు. ఆయన అంతకు ముందు నిర్వచనోత్తర రామాయణంలో చెప్పిన ప్రతిజ్ఞ, అప్పుడున్న ప్రయోగాత్మక దృష్టి వేరు. భారత రచనా సమయానికి ఆయనకు కలిగిన వైయక్తికమైన పరిణతి వేరు. నిర్వచనోత్తర రామాయణ సమయంలో వారి దృష్టి ప్రయోగాత్మకమైనది, భారత రచనా సమయంలోని దృష్టి పరిశీలనాత్మకమైనది, ప్రయోజనాత్మకమైనది.

          కనుక దానిని రచిస్తున్నప్పుడు తాను ‘దీనిని తెనుగుం బాస వినిర్మింప దొరగుటయున్’ వినిర్మాణం చేస్తానన్నాడు. వ్యాస భారతానికి ఇది అనువాదం మాత్రమే కాదు. వ్యాసభారతంలోని అవసరమైన కథాంశాలకు, భావపరంపరకు, వ్యాసులవారు ఉద్దేశించిన భారత హృదయానికి భిన్నం కాకుండా ఉండాలి అనే సంకల్పం ఉన్నప్పటికీ, దానిని వినిర్మింపదలచి భారతంలోని పదిహేను పర్వములను ప్రబంధ మండలిగా ఊహించి రచన కావించాడు. ప్రబంధము అంటే ప్రకృష్టముగా ఏర్పాటు చేయబడిన బంధం. వ్యాసులవారు కానీ, వాల్మీకి కానీ ఆ విధంగా భావించలేదు. వాళ్ళు రాగద్వేషాలకు అతీతులై తమలో ఉన్న భావపరంపరలను, తాము చెప్పబోవు రచనలో ప్రతిబింబించకుండా జరిగినది జరిగినట్లుగా చెప్పుకుంటూ వెళ్ళారు. అది ఏ విధమైనదైనా, ఎవరికి సంబంధించినదైనా, ఏ విషయమైనా, గోప్యంగా, రహస్యంగా ఉంచలేదు. దానికి మెరుగులు పెట్టి, తరుగులు చేసి చెప్పలేదు. ఉన్నది ఉన్నట్లు చెప్పినట్టుగా వ్యాసభారతం చూసినా వాల్మీకి రామాయణం చూసినా అనిపిస్తుంది. కాని తిక్కనగారు ప్రబంధమండలి అని భావించినప్పుడు, అందులో వస్తువుకు సంబంధించిన కవిత్వం, సన్నివేశానికి సంబంధించిన కల్పనాత్మకమైన సాహిత్య సృష్టి, పరమ ప్రయోజనకరమైన భారత హృదయాన్ని ఆవిష్కరింప చేయడానికి కావలసిన తాత్వికచింతన, ఆలోచనాసరళి, ఇత్యాదులను వాటికి తగిన సందర్భాలు వచ్చినప్పుడు నిక్షేపించదలచుకుని విరాటపర్వంలో జరుగుతున్న కథను నానారసాభ్యుచితబంధముగా రచించదలుచుకున్నాడు. కనుక మూలము కంటే భిన్నంగా వున్నట్లు కనపడుతుంది. తిక్కనలో ఉన్న కవితావేశం ఎంతటిదంటే, నన్నయలో ఉన్న సార్వత్రిక సంక్షిప్తీకరణ ఆయనలో కనపడదు. నన్నయ గారు 976 శ్లోకాలున్న నలచరిత్రను 226 పద్యగద్యాలలో రచించారు.

          అరణ్యపర్వంలో దాదాపు ఏడువేల వరకు ఉన్న శ్లోకాలను ఆయన దాదాపుగా పన్నెండు వందల శ్లోకాలలో రాశారు. దాదాపు అయిదవ వంతు వరకు సంక్షిప్తీకరించి విషయం చెడకుండా, మహాభారత హృదయం చెడకుండా రచించే విధానం ఆ మహానుభావునికే దక్కింది. అయితే తిక్కనగారు భవ్యకవితావేశంతో చేస్తున్న ప్రబంధసృష్టి కాబట్టి, 'ఆంధ్రావళి మోదమున్ బొరయ' గా రచించాలనే సంకల్పంతో, వర్ణన ప్రధానంగా సకల సాహిత్య శాస్త్ర లక్షణాలకు లక్ష్యంగా విరాటపర్వ రచన సాగించాడు. ఆంధ్రమహాభారతంలోని విరాటపర్వ ప్రథమాశ్వాసంలోని కథా సన్నివేశాలను, మూలంతో పోలిస్తే చాలా 

Player
>>