ధౌమ్యుని ఓదార్పు10

పోతుంటారు. ఎవరికీ అక్కడ అడ్డులేదు. వచ్చేవాళ్ళు ఎవరు? వెళ్ళే వాళ్ళు ఎవరు? ఏ దేశంనుంచి వస్తున్నారు? ఎలా వస్తున్నారు? ఎంత కాలం, ఏ వృత్తిలో ఉంటారు అనే విషయం గమనించడానికి అశక్యమైన పరిస్థితి –‘ఉన్నయవి యని విందుము’- సమాచార సేకరణ చేశాడు. అరణ్యవాస సమయంలో ఎవరెవరు ఏ బ్రాహ్మణులు ఎక్కడ నుంచీ వస్తున్నా కూడా ఆ దేశమెటువంటిది? ఈ దేశమెటువంటిది అని అర్జునుడు పరిశీలించాడన్నమాట. పెద్ద సమాచార భాండాగారం సిద్ధంచేసుకుని దాని కనుగుణంగా చెప్పాడు. ‘వానియందు మీకుఁ జూడం బోలిన యెడఁ దగిన చందంబున నిలుచువారము గాక’- నాకు ఎంపిక చేసుకుంటే ఇవి కనపడ్డాయి. ఈ నగరాల్లో మనం దేన్నో ఒక దాన్ని, మీరు ఏది మంచిదని భావిస్తారో అక్కడికి వెళదాం. ‘అనినం బ్రియంబంది’-ధర్మరాజుకు ఆ సమాచారం వినేసరికి హృదయాంతరాలలో ఎప్పటినుండో ఆలోచిస్తూ సిద్ధంగా ఉండి, అవసరమైనప్పుడు బయట పెట్టాడు అనిపించింది. ‘అవును, నువ్వు చెప్పింది నిజమే!’ ‘అగు నది యట్టిద. దైవము దగనిచ్చిన యవ్వరంబు దప్పునె మనకున్’- నాక్కూడా దృఢమైన విశ్వాసం ఉంది. ఆయన సాక్షాత్తుగా మనకు ప్రత్యక్షమై అడగకుండానే ఇచ్చిన వరం సిధ్దించకపోతుందా? ‘విగత భయ వాస యోగ్యంబుగ’- కానీ పురుషకారం కావాలి కదా! ఇన్ని దేశాలున్నాయి. ‘మత్స్య సాళ్వ విదేహ బాహ్లిక దశార్ణ శూరసేన’- వీటిల్లో -‘విగత భయ వాసయోగ్యంబుగ’- మనము ప్రశాంత చిత్తతతో ఒక్క సంవత్సరం గడుపుకోవడానికి అనుకూలమైన నగరము ‘ఒక్కెడ సెప్పుము’- ఏదో ఒకటి ఉండాలి కదా ఏదో నిర్ణయించండి. ‘ఇపుడ పోవఁగవలయున్’- అది మనం నిర్ణయిస్తే సూర్యుడు ఉదయించ గానే బయలుదేరి వెళ్ళిపోవాలి. లేకపోతే అజ్ఞాతవాస సమయం మొదలయ్యేసరికి మనమక్కడికి చేరుకోలేము కాబట్టి ఈ రాజ్యాలలో మనం ఎక్కడికి వెళదాము. ‘నాకుఁ జూడ’- ఆలోచిస్తే ‘మత్స్యనరపతి సద్ధర్మవర్తి’- మత్స్యదేశాధీశుడైన విరటుడు సద్ధర్మవర్తి, పాండవుల మీద ఆయనకు అభిమానముంది. ఎటువంటి పరిస్థితిలో కూడా ఏ అపకారం చేసేవాడు కాదు. రాజసూయయాగం చేస్తున్నప్పుడు వీళ్ళకు మామగారైన ద్రుపదమహారాజు వేయిగజాలు ఇస్తే, వీళ్ళతో ఏ చుట్టరికమూ లేని విరాటరాజు భావిచుట్టరికం కోరేనేమో ‘రెండువేల గజంబుల’ నొసగినాడు. మరి పాండవుల మీద ఇంత అభిమానముంది. సద్ధర్మవర్తి. సుజనహితుడు మంచివాళ్ళను ఆదరిస్తాడు. ‘అవార్య బాహుబలుఁడు’- ఆయన రాజ్యంలో ఎప్పుడూ అపకారం వస్తుందనే మాట లేదు. -‘అతని పాల నందఱుఁ దగవైన పనుల నిలుచు టభిమతంబు’- మనం కట్టకట్టుకుని పోకున్నప్పటికినీ ఆయన నగరంలోనే ఒకొక్కరము ఒకొక్క వృత్తిని స్వీకరించి గడపటం మంచిది. ‘మనలోన’– మనందరిలో, ‘ఎవ్వఁ డెమ్మెయి పని వెంటను విరటు మనము వడయుదము?’- ఎవరెవరు ఏయే పనులను ఎంపిక చేసుకుని విరాటరాజు దగ్గర చేరగలము? ఆ విచారణ చేస్తున్నారు. తమ్ముళ్ళందరి వైపు చూశాడు. అర్జునుడు చెప్పిన దేశాలలో నాకు విరాటరాజు కొలువు మంచిదని తోచింది. అక్కడికి వెళ్ళి మనమందరం మనకు తగిన పనులలో ఉందాము. ‘మీరెల్లను ఏర్పరించి యందఱుఁ దన తన మదినున్న తెఱఁగు తథ్యమ చెపుఁడా’– ఎంతమాత్రం సంకోచం లేకుండా, నేను చెప్పిన దానినే మీరు అంగీకరించి ఆచరించాలి అనే నిబంధన వద్దు. చక్కగా ఆలోచించి మీ మనసులలో ఉన్న దానిని క్రియాశీలాత్మకంగా పరిశీలించి నిష్కల్మషంగా, నిస్సందేహంగా, నిర్ద్వంద్వంగా మీ అభిప్రాయాలు చెప్పండి.

అర్జున విషాదం

               ‘అనిన విని సవ్యసాచి సవితర్కంబును సవిషాదంబును సగౌరవంబును’- అర్జునునిలో ఒక్కసారిగా మూడు గుణాలు చెప్పాడు. ‘సవితర్కంబును సవిషాదంబును సగౌరవంబును’. ఈ పదాలను వ్యత్యస్తం చేస్తే వచ్చే నష్టమేమి? ఈ అవస్థకు ముందు విషాదం రావాలి కదా! సవిషాదంబు అని చెప్పి మొదలుపెట్టి ఉండవచ్చు కదా, లేకపోతే అన్నగారు అడిగారు కదా! అందుకని సగౌరవంబును సవిషాదంబును సవితర్కంబును అని

                        వ్యత్యస్తం చేయొచ్చు కదా? ఆ క్రమ పరిణామ వాక్యనిర్మాణానికి మహాకవిత్వశక్తి వెనుక ఉన్న శిల్పనైపుణ్యం ఎటువంటిదంటే, సవ్యసాచి, సవితర్కంబును, ఇక్కడ ఆలోచిస్తున్నది, విషాదము, గౌరవము తర్వాత. కావలసింది చేయదగిన కార్యక్రమ విశ్లేషణ. వీనిలో ఏది ముందు, ఏది వెనుక తర్కించాలి. 

Player
>>