ధౌమ్యుని ఓదార్పు11

       ధర్మరాజు  మీరు చక్కగా ఆలోచించి ఏం చేస్తారో చెప్పమన్నాడు. విరాటరాజు మత్స్యదేశం మనం పోయి ఉండటానికి అనువైన ప్రదేశమేనా? అక్కడ నివసించటంలోని సాధకబాధకాలెటువంటివి? వీటినన్నిటినీ వితర్కించాడన్నమాట. ముందు ఆలోచించాడు. విరాటరాజు కొలువు వరకు బాగానే ఉంది. అక్కడ తమకు ఇబ్బంది కలిగే ప్రసక్తే లేదు. ఎందుకంటే ధర్మరాజు కూడా విరటుడు సద్ధర్మవర్తి, సుజనహితుడు అని తర్కించి ఆమోదించాడు. కొంతసేపు చాలా దీర్ఘంగా ఆలోచించాడు. ఆలోచించిన తర్వత విషాదం కమ్ముకొనింది. అన్నగారు ఏం చెప్పారు? మన మందరమూ ఉచితమైన సేవకులుగా జీవిద్దాము అన్నాడు. విరాటరాజు కొలువులో అజ్ఞాతవాసం వరకు అంగీకారం బాగానే ఉంది. అంతటి ధర్మరాజు సేవకునిగా ఉండటమా? విషాదరేఖ ఒక్కసారిగా వచ్చింది. అయినా తప్పదు కదా కాబట్టి చెప్పాల్సిందేదో చెప్పాలి కనుక ఆ పెద్దరికాన్ని మన్నన చేస్తూ అప్పుడు చెప్పాడు -‘సగౌరవంబుగా నతని నుపలక్షించుచు’- పలుకుతున్నాడు.

సీ.           మహనీయమూర్తియు, మానవైభవమును సౌకుమార్యంబును, సరళతయును 
               మార్దవంబుఁ బ్రభుత్వ మహిమయు నపగత, కల్మషత్వంబును గౌరవంబు     
               శాంతియు దాంతియుఁ జాగంబు భోగంబుఁ, గారుణ్యమును సత్యసారతయును
               ధర్మమయ క్రియాతత్పరత్వంబును, గీర్తిధనార్జన క్రీడనంబుఁ
ఆ.           గలిగి జనుల నేలఁ గాని యెన్నండును           
               నొరులఁ గొల్చి తిరుగ వెరవు లేని     
               యట్టి నీవు విరటు నెట్టి చందంబు
   
               ననుచరించువాఁడ వధిప చెపుమ.                               (విరాట. 1-67)

               ఈ పద్యంలో ధర్మరాజు వ్యక్తిత్వమునంతా కట్టకట్టి ఒకచోట మనకు దర్శింప చేశాడు. ఆయన వ్యక్తిత్వం ఎటువంటిది? మహనీయమూర్తి, అభిమానవైభవము, సౌకుమార్యము, సరళత, మార్దవము, ప్రభుత్వమహిమ అంటే కార్యనిర్వహణదక్షుడు ధర్మరాజు. అరణ్యవాస సమయంలో చూశాము. కలిగిన ఆపదల నన్నింటినీ నెగ్గుకుని తీసు కొచ్చాడు కదా! ‘అపగత కల్మషత్వంబును’- ఆయనకు కల్మషత్వం అంటదా అంటే కాదు, వచ్చినదానిని వెంటనే పోగొట్టుకోవడానికి కావలసిన ఉపాయంతో వెంటనే బయటపడేవాడు. ఎవరికైనా కల్మషాలు రాకుండా ఉండవు. వచ్చిన దానిని పోగొట్టుకునే సాధన మెండుగా కలవాడు. గౌరవము, శాంతి, దాంతి, జాగము. ఈ జాగంబు అనేది సంధితో వచ్చింది కాని తెలుగులో వచ్చేసరికి చాగము, త్యాగము అనే ప్రకృతి పదానికి చాగము అనే పదం వికృతి. ఇంకొక పదం ఉంది. ‘ఛాగము’- అది వేరు. మేక అని ఆ పదానికి అర్థం. ఈ చాగము అనే పదం మనకు తెలుగులో కావ్యాలలో అంతగా కనపడదు శ్రీకృష్ణదేవరాయలు ఆముక్త మాల్యదలో యామునాచార్యుని రాజనీతిధర్మపద్ధతిని వివరిస్తూ, ‘ఉరవౌ చాగంబు భోగం బుభయము నొకపాలుగ్ర సేనావనార్థంబు’(శ్రీకృష్ణ దేవరాయలు-ఆముక్తమాల్యద) అంటాడు. కొన్ని చాటువులలో కనపడుతుంది. దానగుణం అని. ఒక కవి, ఎవరిదో దానగుణాన్ని వర్ణించినాడు. ‘ఇచ్చేదెన్నడు లేద’, ఆయన దగ్గరకు పోతే ఇస్తాము అని చెప్పే మాట రాదు, ‘ఇత్తుననెనా’ ఇస్తానన్నాడనుకోండి పొరపాటున, ‘ఈ పొద్దురా, రేపు రా, ధరలు హెచ్చేటప్పుడు రా, మరొకప్పుడు రా, అమాసపై రా, ఆపైన రా, వడ్లమ్మగా రా’ ఏమేమో, ‘ఈ లోన నేచచ్చేనన్నను దిక్కు లేదు కదరా చాగంబు లోభిప్రభూ!’(చాటుపద్య రత్నాకరము) ఈ మధ్యలో ఎవరం ఏం అవుతామో తెలియదు. కాని ఇక్కడున్న త్యాగం అలాంటిది కాదు.

               తనకున్న దురవస్థలో కూడా సూర్యభగవానుని ఆరాధించి అక్షయపాత్రను పొంది బ్రాహ్మణులను  పోషించినాడు కనుక చాగము-త్యాగము. భోగము–అనుభవంలోనూ కొఱతలేదు. ‘కారుణ్యము, సత్యసారత’- ఎప్పుడు సత్యానికి దూరంగా లేని వాడు. -‘ధర్మమయక్రియా తత్పరత్వంబును’- ధర్మబద్ధమైన కార్యములను చేయుటయందే నిమగ్నమైనవాడు, ‘కీర్తి, ధన ఆర్జన క్రీడనము’- కీర్తిని సంపాదించే విధంగా ధనార్జన చేసినవాడు.  రఘువంశంలో రఘువంశస్థులను గురించి చెపుతూ కాళిదాసు ఇలా అంటాడు. 

Player
>>