ధౌమ్యుని ఓదార్పు2

     కాకతాళీయంగా వ్యాసులవారి రచనలో 331 శ్లోకాలు, తిక్కనగారి రచనలో 331 గద్యపద్యాలున్నాయి(నాందితో సహా). కానీ చాలా తేడా ఉంటుంది. మూలంలో అనుష్టుప్ శ్లోకాలు ఒకొక్క పాదానికి ఎనిమిది అక్షరాలు, మరి కవిబ్రహ్మ తిక్కనగారి వృత్తాలు, సీస పద్యాలు, గద్యములు,- మరి 331 గద్యపద్యాలు అంటే వ్యాసులవారు ఉపయోగించిన అక్షరాలతో పోలిస్తే ఎంత అధికమో అర్థం అవుతుంది. వ్యాసులవారు 331 శ్లోకాలు వ్రాస్తే, తనూ 331 వ్రాశాడు అనుకుంటాం. కాని తెచ్చుకున్న మూట మాత్రం విస్తారమైనది. ఇది ఎలాగంటే మా స్వాములవారు ఉపవాసం చేసి కేవలం ఒక్క పండు మాత్రం తింటారు, అది ఏం పండు అంటే పనసపండు అన్నట్లుగా. చెప్పుకోవడానికి ఒక విధంగానే కనిపిస్తుంది కానీ తేడా చాలా ఉంది. అయితే అలా విస్తృతమైనా, అద్భుతమైన భావతీవ్రత, విలక్షణమైన పదప్రయోగ కుశలత, తీక్షణమైన స్వభావం, సునిశితమైన పరిశీలనాశక్తి వలన, అలాంటి చిక్కటి రచన సాధ్యమయ్యింది. ఇలాంటి సందర్భాలలో తిక్కనగారి మీది భక్త్యావేశంతో కొంతమంది వ్యాసులవారి రచనకు మెరుగుపెట్టారీయన అని అవిచారిత రమణీయతతో ఆపాతమధురమైన అభిప్రాయాలను ప్రకటిస్తుంటారు. అలా భావించటం కొంతమందికి ఆనందం.

        వ్యాసుని రచనకు పోతన మెరుగులు దిద్దారు, నన్నయ దాన్ని సానబెట్టారు, తిక్కన దానిలోని అనౌచిత్యాన్ని పరిహరించారు. ఇలాంటి మాటలతో సమర్థన కొనసాగిస్తారు. ఎందుకంటే తిక్కన చేసిన కళాసృష్టి నైపుణ్యం అంత గొప్ప సమ్మోహన శక్తి కలది కనుక. ఆ మాయాజాలానికి లోబడి పండితులైన వీళ్ళందరూ ఎన్నో వాద ప్రతివాదాలు జరిపారు. కాని నన్నయగారు కాని, తిక్కనగారు కాని ఇటువంటి ధోరణిని అభినందిస్తారా? హర్షిస్తారా? మూలాన్ని మించి రచించినట్లు వారే చెప్పుకోలేదు. ‘జాత్యము గామి నొప్పయిన సంస్కృతమున్ పచరింప’ - జాత్యం కాదు కాబట్టి సంస్కృతాన్ని నేనెక్కువ వాడనని నిర్వచనోత్తర రామాయణంలో చెప్పుకున్నాడు. అంతే కాదు ‘దౌర్గత్యము బూని ప్రాసయగు ప్రకారము’ క్లిష్టమైన అన్వయాలతో ప్రాసాక్షరాలను నిక్షేపించి పద్యం వ్రాయను, శ్రుత్యనురూపమై ఉంటుంది కనుక దానిని నేను మార్చను అన్నాడు. ‘వాక్యసాంగత్యము చేయుచోనయిన గద్యములన్ లిఖియింపన’ న్నాడు ప్రయోగాత్మక శైలిలో, వచనం లేకుండా కేవలం పద్యములతో రచిస్తానన్నాడు. కాని సంకల్పం అక్కడ సిద్ధించలేదు. పరిణతి సాధించిన తరువాత నన్నయ మార్గమే అనుసరణీయమయ్యింది. ఆ బాటలో నడచి విరాట ఉద్యోగపర్వాలలో విశ్వరూపాన్ని చూపించాడు. ఉద్యోగపర్వం పూర్తయ్యేటప్పటికి తిక్కన రాజనీతిజ్ఞత, సాహిత్యం మీద ఆయనకున్న అనన్యమైన శక్తి - ‘అనితర గమ్య వాఙ్మయ మహార్ణవ వర్తన కర్ణధారుడు’ అని ఆయన శిష్యుడు కేతన అన్నట్టుగా, ఎవరికీ అందనట్టిది. ‘తన కావించిన సృష్టి తక్కొరుల చేతన్ కాదు’ అన్న ఎఱ్ఱన మాటకు తార్కాణంగా విశ్వరూపాన్ని చూపించాడు. అట్టి తిక్కన భీష్మపర్వం రచించేటప్పటికి చాలా చల్లబడిపోయి ‘నాకీ ప్రబంధమండలి ధోరణి అక్కరలేదు, మహర్షి అభిప్రాయాన్ని సూటిగా అందిస్తే చాలనుకున్నట్లు తోస్తుంది. ఆనుశాసనికపర్వ రచనాసమయానికి ఆ దృష్టి మరింత స్పష్టంగా కనపడుతుంది. వ్యాసులవారు చెప్పిన దానిని యథాతథంగా చెప్తే చాలు అన్నంత వరకు వచ్చాడేమో అనే స్థితి కనపడుతుంది. 

               అరణ్యవాసం పన్నెండేళ్ళు అయిపోయింది అంటూ కథలో ప్రవేశిస్తాడు. జనమేజయుడికి కథ చెప్తున్నట్టు నియమించుకున్నాడు కదా! “కథ జగత్ప్రసిద్ధము కావున పూర్వపర్వార్థయుక్తి” ముందు చెప్పిన విషయాలను మళ్ళీ చెప్పవలసి వచ్చినప్పుడు ఎలా చెప్పినా ఫరవాలేదు, ‘వలసినట్లు చెప్పవలసియుండు’ అని, ‘వినిర్మిస్తున్నాను కనుక ఆ కథను అనువదించటం లేదు, దాన్ని అనుసరించి చెప్తున్నాను’ అని ఆవృత్తి రక్షణకవచం ఏర్పరుచుకున్నాడు.  ‘వ్యాసులవారు చెప్పిన కథను నాదైన ధోరణిలో చెప్తున్నాను. నా ఉద్దేశంలో ధర్మరాజొకటి, నేను వర్ణించే భీముడొకటి, నేను చెప్పే సన్నివేశం ఇంకొకటి.’ ఈ రసదృష్టితో తిక్కనగారిలోని నాటకీయ రచనాకౌశల్యం, సన్నివేశ సాక్షాత్కారనైపుణ్యం అనన్యసామాన్యం, అనితరసాధ్యం, అత్యద్భుతం. కొన్ని ఉదాహరణలు చూద్దాం. వైశంపాయనుడు జనమేజయునికి చెప్పిన కథ కాబట్టి, నేను కూడా అదే విధంగానే కథ చెప్తానన్నాడు. జనమేజయుడు వైశంపాయనుడిని పన్నెండేళ్ళ తరువాత పాండవులు పదమూడో సంవత్సరం ఎలా గడిపారని అడిగాడు.

Player
>>