ధౌమ్యుని ఓదార్పు3

చ.    మహితసముజ్జ్వలాకృతులు, మానధనుల్ జనమాన్యు లంగనా         
       సహితము గాఁగ నేమిగతి సమ్యగుపాయనిగూఢవృత్తిమై    
       నహితుల కప్ర భేద్య మగు నా పదమూఁ డగునేఁడు మత్పితా
       మహులుచరించిరంతయుఁగ్రమంబుననాకెఱుఁగంగఁజెప్పుమా        (విరాట.1-44)

      ‘మహితసముజ్జ్వలాకృతులు’- చూడగానే గుర్తుపట్టగలిగిన శరీర ఆకృతులు కలవారు, మానధనులు’- మాటపడనివారు, ‘జనమాన్యులు’- సకలజనులలో మన్ననకి ఎక్కినవారు, ‘అంగనా సహితముగాఁగ’- వాళ్ళ వెంట ద్రౌపది కూడా ఉంది. ఆమెను కూడా వెంటనుంచుకొని, శత్రువులైన దుర్యోధనాదులకు, ధార్తరాష్త్రులకు ‘అప్రభేద్యముగా’- గుర్తించడానికి వీలులేకుండా ‘సమ్యగుపాయము’- చక్కటి ఉపాయాన్ని, సమయోచితమైన ఉపాయపరంపరలను స్వీకరిస్తూ, ఏ విధంగా వారి ‘నిగూఢవృత్తిమై’- అజ్ఞాత వాసం చేశారని వివరంగా అడిగాడు. మరి మూలంలో వ్యాసులవారి దగ్గరకొచ్చేసరికి ఆ విధంగా లేదు. చిన్నగా ‘మా తాతగారు వాళ్ళు అజ్ఞాతవాసం ఎలా చేశారు?’

శ్లో.           కథం విరాట నగరే మమ పూర్వ పితామహాః
    
               అజ్ఞాతవాసముషితా దుర్యోధన భయార్దితాః.                        (వ్యాసభారతం)

విరాటనగరంలో పాండవులు అజ్ఞాతవాసం చేశారనే కథ జగత్ప్రసిద్ధము కనుక, జనమేజయుడికి ముందే తెలుసు. దుర్యోధనుడు తమను ఎక్కడ కనుక్కుంటాడో అనే సంశయపరంపరలతో కూడిన వారు ఏ విధంగా గడిపారు?

శ్లో.          ‘పతివ్రతా మహాభాగా సతతం బ్రహ్మవాదినీ,
    
               ద్రౌపదీ చ కథం బ్రహ్మన్ అజ్ఞాతా దుఃఖితా వసత్’                      (వ్యాసభారతం)

      ద్రౌపది అజ్ఞాతంగా ఎలా గడిపింది? మూల భారతంలో వ్యాసులవారు ఇంతవరకే అడిగిస్తే తిక్కన ‘మహితసముజ్జ్వలాకృతులు మానధనుల్ జనమాన్యు లంగనా సహితము గాఁగ’- అని రససృష్టి కావిస్తున్నాడు. వారు ఎటువంటివారో ప్రత్యక్షం చేస్తున్నాడు. అందరినీ పిలిచాడు. అరణ్యవాసం అయిపోయిన తరువాత వారితో ఉన్న బ్రాహ్మణులు మిగిలిన వారందరూ వచ్చారు. వాళ్ళందరూ గుమిగూడగా వాళ్ళకందరికీ చెప్పాడు, ‘అయ్యా మా అరణ్యవాసం పన్నెండేండ్లు అయిపోయింది’.

సీ.           తెల్లంబు గాదె మీకెల్ల సుయోధను, చేసినకుటిల చేష్టితంబు
           
               లకట మాతో మీరు నడవుల నిడుమలఁ, బొందితి రొకభంగిఁ బోయెఁ గాల
   
               మిది పదమూఁ డగునేడు మా కజ్ఞాత, వాసంబు సలుపంగ వలయు నిందు
   
               ధార్తరాష్ట్రులు సూతతనయ సౌబలులును, జెఱుపన వేతురు చిన్న సన్న
ఆ.           యెఱిఁగిరేనిఁ జాల నెగ్గు వాటిల్లు న
               ట్లగుట మమ్ము నింక నతిరహస్య
      
               వృత్తిమై నిరస్తవిఘ్నులరై చరి
               యింపుఁ డని యనుగ్రహింపవలయు                              (విరాట.  1-47)

               ‘తెల్లంబు గాదె మీకెల్ల సుయోధను చేసిన కుటిల చేష్టితంబు లకట మాతో మీరు నడవుల నిడుమలఁ బొందితిరి’- మాతో పాటు మీరు కూడా ఇబ్బంది పడ్డారు. మీరును -‘అడవుల ఇడుమలఁబొందితిరి ఒక భంగిఁపోయెకాలము’- ఏదో విధంగా జరిగిపోయింది. 

Player
>>