ధౌమ్యుని ఓదార్పు4

        ‘ఇది పదమూఁడగునేడు మాకజ్ఞాత వాసంబు సలుపంగ వలయు నిందు ధార్తరాష్ట్రులు సూతతనయ సౌబలులును జెఱుపన వేతురు చిన్న సన్న యెఱిఁగిరేనిఁ జాల నెగ్గు వాటిల్లు న ట్లగుట మమ్ము నింక నతిరహస్య వృత్తిమై నిరస్తవిఘ్నులరై చరియింపుఁడని యనుగ్రహింపవలయు’- ఇది ధర్మరాజు యొక్క చమత్కృతి. వాళ్ళను వెళ్ళిపొమ్మని చెప్పడం లేదు. ‘అయ్యా మమ్మల్ని వెళ్ళిపొమ్మని మీరు ఆశీర్వదించండి’ అంటున్నాడు. ‘మీరు పోతే మా పని మేము చూసుకుంటాం’ అని చెప్పడం ఒక పని, అలా కాకుండా ‘మా పని మాకు చక్కగా జరిగేలాగ ఆశీర్వదించి సాగనంపండి’ అన్నాడు. వాళ్ళు వెంటనే మూటా ముల్లె అన్నీ సర్దుకున్నారు. 'అని చెప్పి విషణ్ణ హృదయుడై' తిక్కనగారు భావించిన ధర్మరాజు మరి. కాని అక్కడ వ్యాసులవారు అలా భావించలేదు. ఎందుకంటే యక్ష ప్రశ్నలకు సమాధానాలు చెప్పి సాక్షాత్తు యమధర్మరాజు అనుగ్రహం పొంది ‘అజ్ఞాతవాసంలో మీకు కావలసిన వృత్తులలో ఏమీ ఇబ్బంది కలుగకుండా గడపగలరు’ అనే ఆశ్వాసనాన్ని సమవర్తి అయిన యమధర్మరాజు దగ్గర వరాన్ని పొందిన ధర్మరాజు విషణ్ణహృదయుడు కావడం మనం అంగీకరించలేని విషయం. కార్యాన్ని గురించి ఆలోచించే సామర్థ్యం అప్పుడు వచ్చింది. అయినా తిక్కనగారి రచనలో ధర్మరాజుకు అరణ్య పర్వంలో క్రమ పరిణామ దశలో ఎంతగా ఆయన చిత్తవృత్తి వికసించినా, అజ్ఞాతవాస సందర్భానికి వచ్చేసరికి ఆ మనోధైర్యం కొంత సన్నగిల్లింది. మానవసహజమైన బలహీనత మనసును కారుమేఘంలా కమ్ముకుంది. ఆ అధైర్యంతో ఆయన ఇలా అన్నాడు, -‘ఒకనాఁడేమును నాపదలకు’- అయ్యా మాకున్న ఆపదలు ఏ రోజైనా పోయి సుఖించే దినమొస్తుందా ‘అని డగ్గుత్తిక వెట్టి’- ధౌమ్యులవారిని ఆడిగి, ‘దుఖఃపరవశుండగుటయు నమ్మహీసుర వరులుం దమ్ములు నతని నాశ్వాసించుచుండఁ దత్పార్శ్వంబున నున్న ధౌమ్యుండు తదీయ విషాదాపనోపదంబు సేయం దలంచి యిట్లనియె’- ధౌమ్యుడు ధర్మరాజును ఓదార్చదలచి ఇలా చెప్పాడు.

ధౌమ్యుని ఓదార్పు

ఉ.           ధర్మనిరూప కత్వమున ధైర్యమునన్, మహనీయవృత్తి, స 
               త్కర్మ విధిజ్ఞతన్ జతురతా మహిమన్ దృఢబుద్ధి నెవ్వరున్
               ధర్మజు పాటిగారనగ ధాత్రి ప్రసిద్ధుఁడ వైనయట్టి నీ        
               పేర్మికి నీడె దుర్దశల పెల్లునకున్ దురపిల్లు టారయన్             (విరాట.   1-51)

               ధర్మరాజా! ఇన్ని సార్లు ఇంతమంది చెప్పిన కథలను విని ‘కాల విపర్యయంబున సుఖంబును దుఃఖము వచ్చుచుండు ఎక్కాలము ఏరికిన్ ధ్రువము గాదు సుఖంబును దుఃఖమున్ మహీపాల’(అరణ్య. 6-106) అని వ్యాసులవారే చెప్పారు కదా. అంతేగాక మార్కండేయుని బోధలు విన్నావు, బృహదశ్వుడు చెప్పిన కథలు విన్నావు, ధర్మనిరూపకత్వమున, ధైర్యంలో నీవంటివాడు లేడని సాక్షాత్తుగా ధర్మస్వరూపుడే మెచ్చు కున్నాడు కదా. ఆ మాటలు కల్ల చేస్తావా? ‘నీ పేర్మికి నీడె దుర్దశల పెల్లునకున్ దురపిల్లు టారయన్’- నీ సహనానికి ఇలా దుఃఖించటం తగునా?

               ‘దేవతలకైన నొక్కొకచో వలయున కాదె శత్రుసూదనవిధి కాలావాప్తికి’- దేవతల వంటివారు కూడా సమయం తమది కానప్పుడు అవమానాన్ని భరించి సహనంతో అణిగిమణిగి ఉన్నారు. తగిన సమయం వచ్చినప్పుడు విజృంభించి నివారించుకున్నారు. నీవు కూడా అంతే. నీ సమయం కాదు. కాలాన్నిబట్టి అనుభవించవలసి వస్తుంది. కనుక నువ్వు కూడా మనసును చిక్కబట్టుకుని సమయం కోసం నిరీక్షించు.

               ‘నిషధాద్రియందనిమిషపతి ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయును’ వృత్రాసుర వధానంతరం బ్రహ్మహత్యాదోషంచే దేవేంద్రుడు నిషధ పర్వతంమీద రహస్య వర్తనంతో వున్నాడు కదా! 

Player
>>