ధౌమ్యుని ఓదార్పు5

            ‘అదితిగర్భంబున నవతారమై వామనాకారమున హరి యడఁగుటయును’- సకల చరాచర స్థావర జంగమాత్మకమైన విశ్వాన్నంతటినీ ఆక్రమించి ఉన్న మహేశ్వరతత్వమైన విష్ణుమూర్తి ఒక శిశురూపంలో పిండాకృతి దాల్చి జననీగర్భంలో ఉండాల్సి వచ్చింది కదయ్యా, దానికేమంటావు? బలిచక్రవర్తిని అణచాలంటే అట్టి స్థితి ఆ పరతత్త్వానికే తప్పలేదు.

               ‘జనని యూరు ప్రదేశంబున నతి నిగూఢంబుగా నౌర్వుండు డాఁగుటయును’- భృగు వంశస్థులు, వశిష్ఠుడు, శక్తి వారి కథ. తమ ఆస్తులను బ్రాహ్మణులు దోచుకు పోయారని కృతవీర్యుని కుమారులు భృగుమహర్షి సంతతి వాళ్ళందరినీ అమానుషంగా సంహరించడానికి మొదలుపెట్టి, పుట్టిన శిశువులతోపాటు, పుట్టని స్థితిలో ఉన్న శిశువులతో సహా అనగా గర్భిణీస్త్రీలను కూడా సంహరించడం మొదలుపెట్టారు. అప్పుడు ఒకామె తన శిశువును రక్షించుకోవాలి అనే ఉద్దేశంతో ఆ గర్భాన్ని ఊరు ప్రదేశంలో దాచి ఉంచింది. ఆ ఊరువు నుండి ఉద్భవించినవాడు ఔర్వుడు. అలా జనించి ఈ అల్లకల్లోలాన్ని ఆపాడు. మరి అదేమి స్థితి?

               ‘ధేను శరీర విలీనుఁడై యజ్ఞాత చర్య మార్తాండుండు సలుపుటయును’- ఈ కథ ఎక్కడుందనే విషయం మనకు తెలియదు. మార్తాండుడు అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ సూర్యుడు ధేను శరీరంలో ఉండవలసిన అవసరం ఎందుకు కలిగింది? మానవులకు అవసరమైన ఔషధీప్రవర్గానికంతటికీ కారకుడైన సూర్యుడు గోరూపంలో ఉంటాడు అని వేదంలో ఆయనను ఉద్దేశించిన స్తుతుల్లో కనిపిస్తుంది. కాబట్టి గోరూపంలో ఉండే ఆధారభూతమైన మార్తాండుడు, అక్కడ వదిలివేసి ఇక్కడ ఆశ్రయించుకుని ఉన్నాడు కదా! సూర్యుడు ప్రత్యక్షంగా కనిపించే విశ్వానికి, ఈ భూగోళానికి సంబంధించిన విషయానికి అంతటికీ అతనే ఆధారం. ఆ సూర్యుడికి పరిభ్రమణం ఉంది. భూమి పరిభ్రమిస్తుందా, సూర్యుడు తిరుగుతున్నాడా అని ఆస్ట్రానమీలో పెద్ద ప్రశ్నగా ఉండేది. కాని ఇప్పుడు అవన్నీ తేలిపోయి సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్నది. ఇది ఒక గెలాక్సీ (పాలపుంత). మరి ఈ సూర్యుడు తిరిగే గెలాక్సీ (పాలపుంత) ఇంకొకటి ఉన్నది. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటాడు. ఆ చంద్రుడు భూమికి ఉపగ్రహం. ఉపగ్రహాన్ని కలిగిన భూమి తన చుట్టూ తాను తిరుగుతూ చంద్రుణ్ణి కూడా తోడు పెట్టుకుని సూర్యుని చుట్టూ తిరుగుతోంది. సూర్యుడు వీళ్ళందరినీ వెంటబెట్టుకుని, ఆయన కూడా ఇంకొకరి చుట్టూ తిరుగుతూ ఉండాలి కదా మరి. మరి ఈ విశ్వాన్నంతటినీ ఇలా చుట్టి రావలసినవానికి ఎంత గొప్ప శక్తి ఉండాలి? ఎంతటి పుణ్యశక్తి సమన్వితుడై ఉండాలి? అటువంటి శక్తి రావాలంటే ఎవరైనా ఏం చేయాలి? ఏమీ చేయనక్కరలేదు. ఒక్కసారి గో ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణం చేసినంత ఫలితం. ఇక్కడ భూమి అంటే ఈ భూమి అని మాత్రమే కాదు సకలచరాచరవిశ్వం అని. ఆ రీతిలో చూస్తే సూర్యునివంటివాడు గోవు రూపంలో అక్కడ ఉన్నాడు కదా!

               ‘వినమే యిట్లు వడిన వీరలు పదపడి తమకు నగ్గమైన తఱి జయింప రెట్లు ప్రబలి రిపుల నీవును’ - వాళ్ళి ఏవిధంగా చేశారో నువ్వు కూడా అలా ఓపిగ్గా చెయ్యి. ‘అనవుడు నప్పలుకులు విని తన చిత్తము కలఁక దేఱి’- ధర్మరాజు మాటిమాటికి బాధపడుతున్నాడు

         పాపం! ఈ బాధపడటం ఎందుకొచ్చిందీ అంటే మనుమసిద్ధి రాజ్యాన్ని ఈయన విడిపించిన అంశం తిక్కన గారిని వదల్లేదు. ‘నేను ఏదో చేసి సాధించుకుని వస్తాను. నీవు బాధపడవద్దు’ అని మనుమసిద్ధికి చెప్పినట్లుగా, ఆ ధర్మరాజును ఇక్కడ ఆ భావపరంపరలో ఓదారుస్తున్నారు. 

Player
>>