ధౌమ్యుని ఓదార్పు6

భీముని ప్రతివాక్యం - తిక్కన పద్య శిల్పం

             ‘అనుజన్ముల దెసఁ జూచిన’- ఒక్కసారి ఆయన తేరుకుని చూశాడు. అందరూ కూర్చున్నారు, వచ్చిన బ్రాహ్మణులందరూ వెళ్ళిపోయారు. పురోహితుడైన ధౌమ్యాచార్యుడు ఉన్నాడు. ‘ఇంక మాకు అనుమతి ఇవ్వండి’ అని ధర్మరాజు అడగగానే, ఆ బ్రాహ్మణులందరూ మూటాముల్లె సర్దుకుంటూ ఎవరి కార్యక్రమాలలో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ధర్మరాజు, ఆ పక్కనే భీముడు, ఆ పక్కనే అర్జునుడు ఉన్నారు. నకులుడు సహదేవుడు ఆ వెనుకవైపుగా ఉన్నారు. ద్రౌపది ఇంకాస్త వెనుకగా ఉండి చూస్తోంది. తరువాతి కార్యక్రమం గురించి వీళ్ళందరూ చర్చిస్తున్నారు. భీముడు కూర్చుని ఉన్నాడు. ఆ భీముడు కూర్చున్న దృశ్యాన్ని మనం ఊహించుకుంటే ఏ విధంగా ప్రత్యక్షమవుతాడు? ఆ పక్కనే ఆయనకు దగ్గరగా ఆయన భుజాన్ని అలంకరించుకుని ఉండే గదాదండం భూమి మీద పెట్టి ఉన్నది. ఆ గదాదండం ఎటువంటిది ‘మదించిన మత్త వేదండ తుండా దండ మండిత భండనోద్దండ చండ ప్రచండ’ మైన గదాదండం. ‘అనిలసుతుం డిట్టు లనియె నాతనితోడన్’- కూర్చున్నవాడు ఆ గదను ఊతం చేసుకుని లేచాడు. ‘భవదాజ్ఞా దృఢబంధ సంయమిత శుంభ ద్వేగమై కాక’- గద సారిస్తూ లేస్తున్న భీముడు కళ్ళ ముందు ప్రత్యక్షమౌతాడు ‘నీ ఆజ్ఞ, అయ్యా! మమ్మల్ని, మా ప్రతాపాన్ని కాని, శౌర్యాన్ని కాని, ప్రతిజ్ఞను కాని, శక్తిని కాని, మా ఉద్దేశాన్ని కాని నివారించటానికి సకల చరాచర భూమండలంలో ఉన్న రాజులెవ్వరూ సమర్థులు కారు. కట్టిపడేసేది కేవలం ‘భవదాజ్ఞా దృఢబంధం’. ‘శుంభ ద్వేగమై’- మహా వేగంతో ఉంది. ఏమిటది? ఒక ద్విపము. మదించిన మత్తగజం ఒకటి ఉంది. దానికున్న వేగము ఎటువంటిది? ఏనుగు మదించినప్పుడు పరిగెడితే దాన్ని పట్టుకోడానికి ఎవరికీ శక్యం కాదు. అటువంటి వేగంతో ఉన్న ఆ మదించిన ఏనుగు మత్త గజము కూడా. నీ ఆజ్ఞ అనే తాడుచేత 'సంయమిత' కట్టబడలేదు. నియమించబడింది. నీ ఆజ్ఞకి తల ఒగ్గింది. ఎవరా ఏనుగు?  ‘భవదాజ్ఞా దృఢబంధ సంయమిత శుంభ ద్వేగమై కాక నా డవలీలన్ మన యర్జున ద్విపము’- ఆ పక్కన గాండీవం పట్టుకుని నిలబడ్డ అర్జునుని చూపించాడు. మన అర్జున ద్విపము ‘గ్రోధావేశదుర్దాంత దర్ప విలాసోద్భట భంగి’- ఏమిటి నువ్వు అంటున్నది ధర్మరాజా! ఇంత డీలా పడవలసిన పరిస్థితి ఏమున్నది? ‘క్రోధావేశ దర్ప విలాసోద్భట భంగి నేపడరి’- ప్రతాపాన్నంతా ఒక్కసారి చూపించి, ‘కౌరవ్యాంబుజ శ్రేణిఁ జిక్కువడం జేయదె’- ఒక మత్తగజము తామరలు నిండిన కొలనులోకి వెళితే అది ఆ క్రీడా విశేషం చేత తొండంతో కమలముల తూళ్ళను పట్టుకుని ఆ పద్మాలని విసరి చెల్లాచెదరుచేసి, నలిపి పడవేసినట్లు, ఈ మదించిన అర్జునద్విపము కౌరవులు అనే శతపత్రకమలాలను చిందరవందర చేసి పడేసి ఉండేదే కదా! తిరుపతి వేంకట కవులు ఇక్కడి నుండే గ్రహించి ఉంటారు.

ఉ.           ఆరని లోతునీటికొలనక్కడఁ బూచిన తమ్మికిన్ విధి
               ప్రేరణ రాలిపోయినవి రేకులు తొంబదితొమ్మి దిప్పుడా
               నీరజమందు దా మిగులునే యొకరే కటు లయ్యెనే నలం
               కారము లౌనె యా కొలను గాని సరోజము గాని భూమికిన్  
                                                   (తిరుపతి వెంకటకవులు - పాండవ విజయము)

      “ఆరని లోతు నీటి కొలనక్కడ” తొంబది తొమ్మిది రేకులు ఊడిపోయాయి, ఒక్క రేకు మిగిలింది - లోపల దాక్కుని ఉన్నాడు దుర్యోధనుడు. 

      ‘ఒక్క వేల్మిడిన్ నీకున్ వేడ్క సంధిల్లఁగన్’- అలా కౌరవులను చెల్లాచెదరుచేసి నీకు కూడా సంతోషాన్ని కలిగించి ఉండేవాడు కదా! ఇంత దుఃఖపడుతున్నావు. ‘నీకున్ వేడ్క సంధిల్లఁగన్’- నీకు సంతోషం కలిగేలా చేసి ఉండేవాడు కదా! ఆ ‘భవదాజ్ఞా దృఢ బంధం’ తో నియమించబడకుంటే! 

Player
>>