ధౌమ్యుని ఓదార్పు7

               ‘అనిన విని ధర్మనందనుండు తెలివొందిన మొగంబు తోడ’- తెలివి పొందింది ఆయన ముఖానికి, ‘తెలివొందిన మొగంబు తోడ’- ఎక్కడో విషాదచ్ఛాయలో ఉన్నవాడు భీముని గర్జన విని ఇతనేదో చేయబోతున్నాడని లేచాడు. అతనిని సముదాయించాలి.  ‘భవదాజ్ఞా దృఢబంధ సంయమిత శుంభ ద్వేగమై కాక’ అని ఆవేశంతో లేచిన భీమసేనుడు, అన్నగారు అతని వైపు చూస్తే, ‘హూం! మన అర్జున ద్విపము’ నేను కాదు. నావరకూ అక్కరలేదు అంటూ మళ్లీ కూర్చున్నట్టున్నాడు. తెలుగు భాషలో ఈ మాధుర్యం ఎలా ఉంటుందో చెప్పడానికి అద్భుతమైన సందర్భాలు ఉన్నాయి. ఆ పదనిర్మాణ సౌలభ్యం, సమాసకల్పనా వైవిధ్యం, వాక్యవిన్యాస సౌకుమార్యం, నాన్యతోదర్శనీయమైన శబ్దరామణీయకత మన తెలుగుభాషకు మాత్రమే పరిమితమైనదిగా అనిపిస్తుంది. అందుకే మన భాషకు సంబంధించని వాళ్ళు కూడా కేవలం శ్రవణమాత్రంచేత దీని వైపు ఆకర్షితులౌతున్నారు. మనకు సాహిత్యంలో చాలా అనువాదాలు ఉన్నాయి. మన కావ్యసాహిత్యంలో సామాన్యంగా అందరూ సంస్కృతకావ్య నాటకాలను తెలుగుభాషలోకి అనువాదం చేస్తే, ఆంధ్రభాషలోని ప్రబంధాన్ని ఇతర భాషలలోకి, సంస్కృతంలోకి అనువదించిన వాళ్ళు ఉన్నారు. భట్టుమూర్తి వ్రాసిన వసుచరిత్రం అలా అనువదించబడ్డది. అల్లసాని పెద్దన వ్రాసినది కాదు, పోతనగారు వ్రాసిన భాగవతం కాదు. శ్రీనాథుడి కావ్యాలు కాదు. మహామహులైన వాళ్ళ కావ్యాలన్నిటినీ వదిలేశారు. వసుచరిత్రాన్ని సంస్కృతంలోకి అనువదించారు. ఎందుకంటే ఆ కావ్యంలోని లయబద్ధమైన పదాలకూర్పు, వర్ణనా వైశద్యం, శబ్దమాధుర్యం సాహితీరసికజన సమ్మోహనంగా ఉంటుంది.

 

సాహిత్య వివేచన - వసుచరిత్ర వైశిష్ట్యం

               ‘లలనాజనాపాంగ వలనా వసదనంగ తులనాభికాభంగ దోఃప్రసంగ’- ఇది వసంత ఋతువర్ణన. భట్టుమూర్తి హనుమంతుడి భక్తుడు. సకలకళావిద్యాపరమస్థానమైన ఆ హనుమంతుడి వరప్రసాదం వల్లనే తను ‘సంజని దినకైక ప్రబంధ ఘటనా సద్యశ్శతగ్రంథ కల్పను’డని, ‘సంగీతకళారహస్యనిధి’ అని తనగురించి చెప్పుకున్నాడు. ఒక్కొక్క రోజులో ఒక్కొక్క ప్రబంధాన్ని నిర్మించే సామర్ధ్యం ఉంది. ఆయన రాసిన పద్యాల్లో ఉండే ఆ సంగీతస్వరమాధుర్యాన్ని నిరూపించడానికి తాను ప్రత్యేకంగా రూపొందించుకున్న వీణ మీద సంగీతస్వరబద్ధంగా ప్రతి పద్యాన్ని పలికించి ముగ్ధుల్ని చేసేవాడని ఐతిహ్యం. ఆ కావ్యాన్ని కాళహస్తికవి సంస్కృతంలోకి అనువాదం చేశాడు. సరే! వసుచరిత్రను సంస్కృతంలోకి అనువాదం చేయడం బాగానే ఉంది. కాని ఒక తమిళకవి(అంబలత్తాడుమయ్యన్) కూడా దీని సౌందర్యానికి ముగ్ధుడై తమిళంలోకి అనువదించాడు.

శా.    ఆ జాబిల్లి వెలుంగు వెల్లికల డాయన్ లేక రాకానిశా       
        రాజశ్రీ సఖమైన మోమున బటాగ్రంబొత్తి యెల్గెత్తి యా     
        రాజీవానన యేడ్చె కిన్నరవధూ రాజత్కరాంభోజ కాం     
        భోజీమేళ విపంచికారవ సుధాపూరంబు తోరంబుగన్       (భట్టుమూర్తి-వసుచరిత్ర)

 

               గిరికాదేవి కాంభోజిరాగంలో మధురంగా ఏడ్చిందట. “కిన్నర వధూరాజత్కరాంభోజ” - కిన్నరస్త్రీలు కోమలసుకుమార హస్తాలతో కాంభోజీరాగంలో మేళవించి మీటుతున్న మధుర వీణానిస్వనంతో తన స్వరాన్ని కలిపి రాగయుక్తంగా 'ఆ రాజీవానన' గిరికాదేవి ఏడ్చిందట. ఆ పద్యాన్నే తమిళంలోనికి అనువాదం చేశారు.

Player
>>