ధౌమ్యుని ఓదార్పు9

             ధర్మరాజు మేల్కొని ‘అమరరాజతనూభవుఁజూచి యిట్లనున్’ భీముడితో అనటంలేదు. మనము ఎన్నిమార్లో చెప్పుకుంటూ వచ్చాం. ఎక్కడైతే ఆలోచనకు అవసరమోఅక్కడ ‘ఉచితానుచిత సమయపద ప్రయోగ ప్రజ్ఞన్’ అర్జునుడు సరియైనవాడు. అతనికున్న సంయమనం, సమయమర్యాద, విషయవిచారకుశలత్వము భీముడికి అంతగా లేవు. భీముడికి ఆవేశం, ఔద్ధత్యం అధికం. అందుకని ధర్మరాజు అర్జునుడినే సలహా అడిగాడు.

         ‘అమరరాజతనూభవుఁజూచి యిట్లనున్’- చెప్పాడు. ‘మనమొక యేవురము’- మనము ఐదుమందిమి. ‘ఈ అంగనయుం దో నరుగుదేరఁగా నెయ్యెడఁబోయిన నెఱుఁగ కుండుదురె?’- మనమందరం కట్ట కట్టుకుని ఒక చోటికే వెళితే, ధార్తరాష్ట్రులచేత జూదంలో ఓడి ప్రతిజ్ఞను పాటించడంకోసం పాండవులు అరణ్యవాసం తరువాత అజ్ఞాతవాసం సలపాలని అందరికీ తెలుసు. మనమయిదుగురమూ ఈ స్త్రీతో కలసి వెళితే పాండవులు, ద్రౌపది అని సులువుగా   ‘ఎఱుగ కుండుదురె? యిద్దినములు గడపంగ నెద్ది తెఱుఁగయ్యెడినో!’- గుర్తుపడతారు కదా! దీనికి పరిహారంగా మనం ఏ వ్యూహం పన్నాలి? అజ్ఞాతవాసం నిర్వర్తించుకోవడానికి చేయవలసిన వ్యూహరచనా విధాన మెటువంటిది? అని అడిగాడు. ‘అనిన నతం డిట్లనియె’ అర్జునుడు మెల్లగా ‘ఎలా మరచిపోయారు అన్నగారూ!’ ‘ఇప్పుడిప్పుడే కదా! ఎంతోకాలం కాలేదు. యక్షుని ప్రశ్నలకు సమాధానం చెప్పిన తరువాత, యమధర్మరాజు ఆ బ్రాహ్మణుడి అరణి తెచ్చి ఇస్తూ ఆయన మీకొక వరమిచ్చాడు కదా!’ అని గుర్తుచేశాడు. ‘ధర్మదేవత నీదు సత్కర్మమునకు మెచ్చి యెంతయుఁ బ్రీతిమై నిచ్చినట్టి వరము గలుగంగ’ మనకెందుకయ్యా భయం, ప్రపంచంలో అందరి జీవితాలను రచించేవాడు ఆయన. ఆ తీర్చిదిద్దేవాడు మనకు అభయమిస్తే, -‘మనమేమి వర్తనమున నెచట నున్నను నొరులకు నెఱుఁగ నగునె’? ‘మనము, మన ప్రయోజనము, తెలివితేటలు, ప్రయత్నం అనవసరం. యమధర్మరాజు ఇచ్చిన వరము అనే ఆతపత్రం, ఒక ఛత్రము - ఒక గొడుగు మన మీద ఉంది. కాబట్టి మనం ఎక్కడ ఎట్లా ఉన్నా కూడా ఎవరు కనుక్కోగలరు? దానిని ఆలంబనగా చేసుకుని కార్యక్రమాన్ని ఏదైనా నిర్దేశించుకుందాము’ అన్నాడు.

అర్జునుని వివేక విచారం

            ‘కురుజనపదంబు చుట్లన్’, అర్జునుడి విచారవివేకం ఎటువంటిదో చూడండి. మొట్టమొదట ధర్మజుని మనసు సందేహాందోళనతో వుంటే ఆత్మవిశ్వాసాన్ని కలిగించాడు. సమయోచితమైన వాక్యాలు చెప్పి, ‘కురుజనపదంబు చుట్లన్’- మనము కౌరవ రాజ్యాన్ని వదిలి దూరంగా పోవడానికి సమయం లేదు, పన్నెండేళ్ళు అయిపోయాయి, తిరుగుతూ తిరుగుతూ ఉంటే ఎక్కడ అజ్ఞాతంగా నివసిస్తారు? కనుక అలా వెళ్ళడం వీలుకాకపోవడానికి ఇంకో కారణం కూడా ఉంది. మనము కురుజనపదానికి దూరంగా ఉండము, ఉండకూడదు. దాని పరిసర ప్రాంతాలలోనే ఉండాలి. ఎందుకంటే, పదమూడో ఏడు అవుతూనే మళ్ళీ సామ్రాజ్యస్థాపన కోసం ప్రయత్నం చేయాలి. ఇక్కడ ప్రతిజ్ఞా పాలనలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ చేయాలంటే ఇక్కడే ఉండాలి. -‘కురుజనపదంబు చుట్లన్ బాంచాల చేది మత్స్య సాళ్వ విదేహ బాహ్లిక దశార్ణ శూరసేన కళింగ మగధ దేశంబులు’- ఎంత తీవ్రంగా ఆలోచించాడండీ ఆ అర్జునుడు. పన్నెండేళ్ళనుండీ ఆలోచిస్తున్నాడు. ఏ ప్రాంతంలో ఎక్కడ ఉండాలని. ఎన్నో దేశాలున్నాయి. అంగవంగ కళింగ అని ఎన్నో దేశాలున్నాయి. కేకయ, కోసల దేశాలు ఉన్నాయి. అవన్నీ చెప్పలేదు. వానిలో నుంచి కొన్ని తీసుకున్నాడు. ఆ దేశాలు ‘మత్స్య సాళ్వ విదేహ పాంచాల బాహ్లిక దశార్ణ శూరసేన కళింగ మగధ దేశంబులు సుభిక్షంబులు’- అవి చాలా సంపన్నదేశాలు. ఎవరు వచ్చినా ఆశ్రయం ఇవ్వగలిగేలా ఉన్నవి. సుభిక్షంబులు కాబట్టి అక్కడకి ప్రజలు చాలామంది వస్తుంటారు. ‘జనాకీర్ణంబులు’- ఒక్కో ప్రదేశంలో కొన్ని వేలమంది ఉంటారు. కాబట్టి ‘బహుజనాకీర్ణంబులు’. చాలామంది నానాదేశాలనుంచీ వచ్చిన ప్రజలంతా ఇక్కడ వారి వారి వృత్తులను ఆశ్రయించుకుని ఈ నగరాలలో ఉన్నారు. ‘అతిస్థిరంబులు’ సుస్థిరంగా ఉన్నాయి. శాంతిభద్రతలకు ఎంత మాత్రం లోపం లేదు. ఒకొక్కటిగా వివరించాడు. ‘నాకు సంబంధించి ఈ పది పన్నెండు నగరాలు కనపడుతున్నాయి. ఈ నగరాల్లో నివాసయోగ్యత కలిగి, అంటే మనవాళ్ళెవరైనా ఏదో వృత్తినాశ్రయించుకుని ఏదో ఒక ఉద్యోగం దొరికి, జీవించవచ్చు’. నివాసయోగ్యమంటే అక్కడ నివసించడానికి తగిన, ధనసంపాదనకు వీలున్న పరిస్థితులు అక్కడ ఉన్నాయి. కాబట్టి రోజూ ఎంతమందో వస్తుంటారు, 

Player
>>