పాండవుల వృత్తినిర్ణయం1

పాండవుల అజ్ఞాతవాస వృత్తి నిర్ణయము 

కంకుభట్టుగా ధర్మరాజుః

అట్టి ధర్మరాజును చూసి, అర్జునుడు ఆ విధంగా అంటే ‘అనినం దమ్ముని నెమ్మనమునఁ బుట్టిన వగపు భావమున నెఱిఁగియు’- వగపు భావం, దుఃఖంతో కూడిన భావాన్ని ‘ఎఱిఁగియు గీటునఁ బుచ్చుచు’- నిర్లక్ష్యం పట్టించుకోనట్లుగా త్రోసివేస్తూ ‘గీటునఁబుచ్చి’- తెలుగులో ఒక విధమైన వాక్య ప్రయోగం. తెలుగుకు సంస్కృతానికి తేడా ఏమిటంటే, సంస్కృతంలో అన్వయం చేసుకోవడం సులభం. ఎందుకంటే ధాతునిష్పన్నమై సుసంస్కృతమైన భాష. ఒక్కొక్క పదానికి దాని మూలార్థాన్ని విచారించి విశ్లేషించి తెలుసుకోవడానికి వీలవుతుంది. తెలుగులో పదాలకు మూలధాతువులు కలవి కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. సందర్భోచితంగా లేకపోతే దాన్ని ప్రక్రియాభేదంగా చూడాలి. ‘ఇలా ఇలా’ అన్నాడు అంటాం. అంటే ఎలా అన్నాడు? అది సందర్భానికి తగిన విధంగా అన్వయించుకోవాలి అంతే కాని శబ్దరూపానికి తగిన అర్థాన్ని ఉత్పన్నం చేసుకోనవసరం లేదు. ‘గీటునఁబుచ్చి’- గీటున అంటే కన్నుతో చేసిన గీటా? కనుగీటు చేశాడంటాం. ఇక్కడ చేసిన గీటును మనమెలా అర్థం చేసుకుంటాం? అర్జునుని చూస్తుంటే మరుక్షణంలో అతడి నయనాలనుంచి బాష్పకణాలు జారి ఎక్కడ విషాద స్థితిలోకి వెళ్ళిపోతాడో అని ధర్మరాజు వెంటనే ‘బాధపడవద్దు’  అన్నట్లుగా -‘గీటునఁబుచ్చుచుఁ బ్రస్తుత కార్య నిరూపణ దశయ మెఱయ’ - ఇప్పుడు మనం చేయవలసిన కర్తవ్యం ఏమిటో ఆలోచించండి. ఇట్టి భావోద్వేగాలకులోనై ‘నీవు ఎప్పుడూ ఇలాంటి దుస్థితికి లోను కాలేదే!’ అనుకుంటే తీరదు. పని జరుపుకోవాలి అంతే!

                        సాహిత్యంలో శయ్య, వృత్తి, రీతి, శిల్పము అనేవి వాడుతుంటాం. ఒక్కొక్కచోట, మనం ఒక్కో పదబంధం చూసినప్పుడు ఓజోగుణం కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ సందర్భంలో తిక్కన ఆ సన్నివేశాన్ని మనకు సాక్షాత్కారింపచేసే వచనరచనావిధానాన్ని అనుసరించాడు. ‘ప్రస్తుత కార్య నిరూపణ దశయ మెఱయ నతఁడిట్లనియెన్’- ‘సన్యాసి వేషమున రాజన్యునిఁగని యెపుడుఁ గొలిచి’- సన్యాసివేషంలో ఆ రాజన్యుని కొలుస్తాను. సన్యాసికి సన్నాసికి తేడా ఏమిటి? మనం సాధారణంగా ‘పోరా సన్నాసి’ అని అంటాం. లోకాన్ని వదిలిపెట్టినవాడు సన్యాసి, లోకం వదిలిపెట్టినవాడు సన్నాసి.  ‘రాజన్యునిఁగని యెపుడుఁ గొలిచి సభ్యత్వమునన్ మాన్యుఁడనై పుణ్యకథా విన్యాస మొనర్తు నతని వేడుకకుఁ దగన్’- సభ్యత్వము, సభ్యుడు అంటే ఎవరు? సభలో ఉండేవాడు సభ్యుడు, ‘సభాయాం సాధుః సభ్యః’. సభలో మంచి ప్రవర్తన కలిగినవాడే సభ్యుడు. అటువంటి వాడికి తగిన లక్షణం సభ్యత్వము. పశుత్వము–పశువులకు ఉండే లక్షణం. మానవత్వము–మానవులకు ఉండే లక్షణం. గోత్వము–గోవులకు ఉండే లక్షణం. శిశుత్వము–శిశువులకు ఉండే లక్షణం. సభ్యత్వము-సభ్యులకు ఉండే లక్షణం. కాబట్టి ఆ సభలో అందరి మనసులను ఆకట్టుకునే విధానమేదో అది సంపూర్ణంగా అవగాహన చేసుకుని, మాన్యుడనై, అందరి చేత గౌరవింపబడి, ‘పుణ్యకథా విన్యాస మొనర్తు అతని వేడుకకు తగన్’- విరాటరాజును ఆనందింపజేసే విధంగా పుణ్యకథలు చెప్తాను. ‘శ్రౌత స్మార్త నిమిత్త జ్యోతిర్విద్యలు వహించి యోగ్య సమయసంజ్ఞాత ప్రాగల్భ్యుఁడనై’- మహర్షుల సంగంచేత సంపాదించుకున్న విద్య అది. సమయానుకూలంగా అవసరమైనప్పుడు నా పాండిత్య ప్రాగల్భ్యం చూపించి -‘చాతుర్యము మెఱసి మానసం బలరింతున్’- చతురత్వాన్ని చూపించి మనస్సును ఆకట్టుకుంటాను. ‘ఆతనితో నొక్కొక మరి కౌతూహలవృత్తికిం దగం దొడఁగి మృదు ద్యూతంబునఁగ్రీడింతు’- మృదుద్యూతము అంటే కాలక్షేపానికి ఆడే ఆట. ఈ ద్యూతమెక్కడ నేర్చుకున్నాడు? అరణ్యావాసంలో నలచరిత్ర వింటున్నప్పుడు బృహదశ్వమహర్షి దగ్గర ఈ అక్షవిద్య నేర్చుకున్నాడు. ఈ విద్యవల్ల అతనికి అక్షక్రీడపై ఇంతకుముందున్న బలహీనత పోయింది. కాకపోతే వినోదమాత్ర పరిమితమైన క్రీడ. ఈయనకు సంబంధించిన వ్యసనమది. కొంతమందికి చదరంగ ఖేలనం ఏ విధంగా వ్యసనమో, 

Player
>>