పాండవుల వృత్తినిర్ణయం10

‘పనులేమియు చేయగ నేర దెంతయున్ మృదువు’- ద్రౌపది గురించి ఆయనకున్న ప్రేమ. ఏ పనులనూ చేయలేదు అనిపింపచేస్తున్నది. మృదువు, చాలా కోమలమైనది. ‘ఒక కీడుపాటునకు మేకొనజాలదు’- కొంచెం కీడు జరిగినా ఓర్చుకోలేదు. చాలా సుకుమారహృదయం కలది. ‘ఉదాత్తచిత్త’- చాలా గంభీరంగా ఉంటుంది. ‘ఒంటి దిరుగు దాని కోర్వదు’- ఒంటరిగా ఎక్కడికైనా పోవాలంటే భయం. ఎప్పుడూ వెంట ఎవరో ఒకరు ఉండాలి. ‘ఒకటిం దను దా సవరించుచొ ప్పెఱుంగదు’- ఒక్క పనిని కూడా తనంత తను నిర్వహించుకోలేదు. ‘తగ ఒండులన్ గొలువఁగా వెర వెమ్మెయిఁ గల్గు నక్కటా!’- ద్రౌపదికి ఒక్కసారి కోపం వచ్చింది. నన్ను గురించి ఇదా ఆయన అర్థం చేసుకొన్నది.

ద్రౌపది శీలం – సామర్థ్యం

   ద్రౌపది గురించి మనం కూడా చదువుకున్నాము. సత్యభామ వచ్చి ‘నీవు ఐదు మంది భర్తలను ఎలా సహించి సేవ చేయగలుగుతున్నావు? ఎలా నీ వశవర్తులుగా చేసకో గలిగావు’ అని అడిగితే, ద్రౌపది సమాధానంగా తాను చేసే పనులన్నీ వివరించింది. ‘మా అత్త పృథ్వీ సమాన పృథాదేవి. కుంతిభోజాత్మజ కోమలాంగి సతతంబు భోజన స్నానాదికముల యందు ఇమ్ముగ పరిచర్య నేన చేసి’ అందరూ వింటూ ఉండగా నిర్ధారించి చెప్పింది. అలాంటి ఆమెను పట్టుకుని తన పని కూడా తను చేసుకోలేదు అనుకున్నాడు ధర్మరాజు. ‘సంప్రీతి చేయుదు జనవంద్యుడగు ధర్మతనయుని బంతి నిత్యంబు పసిడి పళ్ళెరంబుల కుడుచు బ్రాహ్మణులు అలతి పుణ్యులు ఎనిమిది వేలు, సమిద్ధమతుల యతులు పదివేలు’- ఎనిమిదివేలమంది బ్రాహ్మణులు, పదివేలమంది యతులు వస్తూ ఉంటారు. ‘వారలకు అనుదినంబు అన్నపానంబులు అర్హసహాయ నగుచు’- తగిన విధంగా ‘ఒడికముగ నేన కావింతు’- వారందరికీ నేనే అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేస్తాను. ‘ఉచిత వస్త్ర భూషణాదుల పరితోషముగ నొనర్తు’- అన్ని అవసరాలను ఆనందంగా అందిస్తాను. అంతేనా! ఇంకా చెప్పిందామె. ‘మరియు ధర్మరాజు నగరియందు కనకమణిమయభూషణాలంకృతులైన పరిచారకులు నూరువేలు రేయును పగలును పాత్రహస్తులై అభ్యాగతభోజనంబులు ఒడగూర్చు వారును అందరు గలరు’- వచ్చేవారికి అందరికి భోజనములు పెట్టాలి కదా! అందుకు తగిన పరిచారకులు నూరువేలమంది ఉన్నారు. ‘వీరెల్లను ఇట్టిట్టి మెలకువ లెరుంగుదురు తత్కృత అకృతంబులు నేన యెరుంగుదును’- వాళ్ళు చేసినవీ చేయనివీ నేను గుర్తు పెట్టుకుంటాను.

                        ‘నిరంతర మదధారాతరంగిత కపోలంబులైన భద్రగత శతధార సహస్రంబులు’- ఏనుగులశాల ఉంది. దానిలో ఏనుగులెన్నో ఉన్నాయి. ‘ప్రభూత జవసత్వంబు సన్నుతంబులైన ఉత్తమాశ్వశతసహస్రంబులు’- అశ్వశాలలో ఉన్న అశ్వములకు, అన్నింటికీ -‘నిత్య ఉచితంబులైన ఖాద్యంబులు ఒనరింపను పాలింపను తగిన వారిని నేన నియమింతును’- అంతా ఆమె ఆధ్వర్యంలో ఉంది. ‘అఖండ భాండాగారపూరితంబులైన అగణ్యమణికనకాది వస్తువులును ప్రతిదిన విహితంబులైన ఆయ వ్యయంబులును నా యెరుంగని యవిలేవు’- డైలీ అకౌంట్ అంతా ఆమెకే తెలుసు. ఏ రూపాయి ఎక్కడినుంచి వస్తుంది, ఎక్కడ ఖర్చు పెట్టింది అనే విషయాలు సమస్తం ఆమెకే తెలుసు. ‘గోపాలజనంబులు తుదిగాగల సకల భృత్యజనంబుల జీవితంబులను నరసి ఏన నడుపుదు’- పరిచారకులలో వాళ్ళ కుటుంబాలకు కావలసిన అవసరాలేవో గమనించి నేనే ఆ అవసరాలను తీరుస్తుంటాను. ‘పరమ యశోధనులగు పాండునందనులు నిజకుటుంబ భారంబు సర్వంబు నాయంద సమర్పించి తారు నిర్భరులై ఇష్టవిహారంబుల నుండుదురు’- యశోధనులైన పాండుకుమారులు తమ కుటుంబభారాన్ని నాపై వదలి నిర్భయంగా తమ తమ వ్యవహారాలు చక్కబెట్టుకుంటారు. 

Player
>>