పాండవుల వృత్తినిర్ణయం12

అలంకరించటం, కావలసిన అలంకార సామగ్రి ఏర్పాటు చేయటం ఇలాంటివి. అంతే గానీ నీచమైన పనులను నేను చేయను. పుష్పమాలికలు, కలపంబులు, శృంగారానికి కావలసిన వస్తువులన్నీ నేను సమకూరుస్తాను.

               ‘అనవుడు ధర్మనందనుడు ద్రుపదనందన కిట్లనియె’- ధర్మరాజు కదా! -‘బహుప్రకార ప్రవచనరచనా విశారదుడు’ కదా! సూక్ష్మాతిసూక్ష్మంగా చెప్పినట్లు తిక్కనగారు చెప్పారు. ‘మన వంశంబును, వృత్తంబును, పెంపును గానఁ జాలు పుణ్యవతివి’- ఎట్టి వృత్తిలో నీవు చరించదలచుకున్నావో, మన వంశంబును వృత్తంబును, పెంపును వీటన్నిటినీ రక్షించడానికి చాలా పుణ్యవతివి. ఎంత ధ్వని ఉంది ఆ మాటల వెనుక. నీవు స్వీకరించే వృత్తిలో నీకు అవరోధాలు కలుగుతాయి. ‘దుర్జనులగు తులువల తలఁపును గనుఁగొని యేమఱక మెలఁగఁగా వలయుఁ జుమీ’- ఒకసారేమో పనులు చేతకావన్నాడు. ఆమె తాను చేసినవీ, చేయగలిగినవీ అన్నీ ఏకరువు పెట్టి నేను ఆ విధంగా ఉంటానంటే ‘మెలఁగఁగా వలయుఁ జుమీ’- జాగ్రత్తగా మెలగాలని సున్నితంగా హెచ్చరించాడు. ఊరికే ఉంటుందా! ఆవిడ. వెంటనే‘అనిన విని యాజ్ఞసేని’- ద్రౌపది కాదు, యజ్ఞసంభవ, యాజ్ఞసేని. ‘అనిన విని యాజ్ఞసేని యనాదర మందస్మిత సుందరవదనారవింద’- నువ్వెప్పుడూ ఇంతే నిన్ను బాగుపరచడం ఇక కాదు. అనాదరంతో సన్నగా నవ్వినా సుందరంగా ఉంది. ‘మందస్మిత సుందర వదనారవింద యయి యతని కిట్లనియె’- ఏమనుకుంటున్నావయ్యా! నువ్వు సైరంధ్రి అంటే అర్థం తెలుసా?!

క.            అరయ నెందును గౌరవ    
               భారం బెడలంగ నీక పాతివ్రత్యా      
               చారము మై వర్తింతురు     
               సైరంధ్రీ జాతి వారు సౌజన్యమునన్                             (విరాట.1-112) 

               ఎవరు సైరంధ్రి? ఆ నలచక్రవర్తి చరిత్రలో దమయంతీదేవిని ఆమె అక్కడి నుంచి చూసింది. ఆ రాణి వచ్చి పిలిపించి ఎవరమ్మా! నీవు? అని అంటే, నేను ‘సైరంధ్రీవృత్తము చేసి కొని నిరాశ్రయుడైన భర్తను వెతుకుతున్నాను’ అని చెప్పుకున్నది. అప్పుడు ఆ రాణి ‘నీవుండుము నాకడ ఇందీవరదళనేత్ర!’- ఇంత చక్కగా ఉన్నావు. నీవు ఎక్కడికీ వెళ్ళవద్దమ్మా! ఇక్కడే ఉండు. నీ పతిని ‘రోయగ భూదేవోత్తములను పంచెద’ నీ భర్తను వెదకడానికి బ్రాహ్మణులను పంపుతాను, నీ కష్టాలు తీరుస్తాను. అంటే ఆమె ఏమన్నది? ‘నేను సైరంధ్రినై ఉండియూ’ నేను సైరంధ్రి వృత్తిలో ఉన్నప్పటికీ ‘ఉచ్చిష్టంబు ముట్టను’ ఉచ్చిష్టము అంటే ఎంగిలి అనికాదు. అంటే మిగిల్చిన పదార్థాలు నేను తినను. నా గౌరవం నాకు ఉండాలి. ‘పదధావనంబు సేయను’ ఎవరికైనా పాదాలు కడగాలి, ఆ నీళ్ళు పోయాలి అంటే ఆ పనులు చేయను. ‘పరపురుషులతో పలుకనోపను’ దమయంతీదేవి చెప్పిన విషయం ఇది. ‘పతిని అన్వేషించ నడిగెడు బ్రాహ్మణులతో పలుకుదును’. భర్తను వెదకబోయే బ్రాహ్మణులతో పలుకుతాను. కారణం ఉన్నది కాబట్టి. ‘అట్లయిన నీవద్ద నుండెదను ఒండు విధంబులైన ఉండనేరను’ అని అనేక పరిస్థితులను హెచ్చరికగా చెప్పింది. ‘అనిన నీకిష్టంబైన నాయొద్దను ఉండుము’ అని ఆ రాణి అంగీకరించింది.

                 ఏమయ్యా! ధర్మరాజా! నువ్వు మావలే కష్టాలు పడినవారున్నారా అని అడిగితే బృహదశ్వ మహారాజుగారి కథ చెపుతూ దమయంతి విషయం చెప్పాడు. మరిచిపోయావా? ‘సైరంధ్రి’ అంటే ‘సైరంధ్రీ పరవేశ్మస్థా స్వవశా శిల్పకారికా’ అంటే ఇతరుల యొక్క గృహములో ఉన్న స్త్రీ సైరంధ్రి. ఎలా? ‘స్వవశా’ ఇతరుల గృహములో ఉన్నప్పటికీ కూడా ఆమె సర్వస్వతంత్రురాలు. స్వవశాత్ ‘సర్వం పర వశం దుఃఖమ్’, దుఃఖం అంటే ఏమిటి? ‘సర్వం పరవశం దుఃఖమ్’ ఇతరుల వశంలో ఉండేదంతా దుఃఖమ్. ‘సర్వమాత్మ వశంసుఖం’. సుఖం తన వశంలో ఉన్నదంతా సుఖమే. కాబట్టి ఈమె స్వవశ తన స్వాతంత్ర్యాన్ని నిలబెట్టుకునేది, ‘శిల్పకారికా’ ‘శిల్పకర్త్రీ’ శిల్పం అంటే మళ్ళీ పనులన్నింటినీ నెరవేర్చి చేయించగలిగిన సామర్థ్యము ఉన్నది. ‘పరగృహస్థా స్వతంత్రా ప్రసాధన దర్పణాది శిల్పకర్త్రీ సైరంధ్రీ ఇతి ఉచ్యతే’ ఇంకొక అర్థం ‘స్వైరం స్వచ్చందం వర్తనం దధాతి ఇతి సైరంధ్రీ’ తనకున్న స్వాతంత్ర్యాన్ని సమర్ధంగా నిల బెట్టుకుని వీడ్కొలుపనిది సైరంధ్రీ వృత్తి. 

Player
>>