పాండవుల వృత్తినిర్ణయం2

కొంతమందికి చతుర్ముఖపారాయణం ఏ విధంగా వ్యసనమో, అట్లాగే ఇది కూడా ఒక క్రీడా విశేషం. కాబట్టి ఈయనేం చేశాడు? ఈయన రకరకాలైన పాచికలను సమకూర్చిపెట్టుకున్నాడు. కొన్ని ఏనుగుదంతాలతో చేసినవి, కొన్ని కొయ్య ముక్కలతో చేసినవి, కొన్ని అపురూపమైన రాళ్ళతో చేసినవి, కొన్ని మణులు మాణిక్యాలు పొదగబడినవి, కొన్ని రత్నఖచితమైనవి. ఇలా రకరకాల పాచికలు ఆయన దగ్గర ఉన్నాయి.

 క.           ఆతనితో నొక్కొక మరి 
   
            కౌతూహలవృత్తికిం దగం దొడఁగి మృదు
               ద్యూతంబునఁ గ్రీడింతుం 
               జేతోముద మొదవ నక్షశిల్పప్రౌఢిన్                              (విరాట.  1-71)

               నాకున్నటువంటి అక్షశిల్పం, మళ్ళీ ఇక్కడ కూడా శిల్పాన్ని ప్రయోగించాడీయన. ‘శిల్పం కర్మ కళా’ శిల్పము అంటే కర్మ కళ. శిల్పము అనేది పని. ఒక పని ప్రకృష్టంగా చేయడాన్ని శిల్పము అని అంటారు.

తే.           మణి మయమ్ములుఁ గలధౌతమయములును సు
           
               వర్ణ మయములు నాదిగా వలయునట్టి
           
               యడ్డసాళులు గలవు నా కభిమతముగ
          
               వాని గొనిపోయి చూపుదు వరుసతోడ                           (విరాట.  1-72)

               ఎంత గొప్పగా సంస్కృతాంధ్రాలను మిళితం చేస్తాడండీ తిక్కన? ఏ ఏ పదాలు ఏ పద్ధతిలో, ఎంత నిష్పత్తిలో వాడాలో ఆయనకు తెలుసు. ‘మణి మయమ్ములుఁ గల ధౌతమయములును సువర్ణ మయములు నాదిగా వలయునట్టి’ సంస్కృతంలో గంభీరంగా చెప్తూ చెప్తూ తెలుగులోకి వచ్చేస్తాడు. ‘అడ్దసాళులు’ కలవు. అంత వరకు చెప్పాడు. ‘అర్జునా! ఏమీ ఫరవాలేదు. నా దగ్గర ఉన్న చిత్రవిచిత్రములైన పాచికలు అని అనలేదు. ‘అడ్డసాళులు కలవు’, ఒక మెరుపుతీగ, ఆ కళ్ళల్లోకి ఒక కాంతి వచ్చిందన్నమాట. -‘అడ్డసాళులు గలవు నా కభిమతముగ వానిఁగొనిపోయి చూపుదు వరుసతోడ’- నాకు తెలుసు విరాటరాజుకు కూడా కొంచెం ఈ ఆటపై అభిమానం ఉంది. రాజులకి ఏ మాత్రం తీరిక ఉన్నా కాలక్షేపం అదే కనుక, నా దగ్గరున్నవన్నీ చూపిస్తాను. కొంతమంది ఆటపై ఉన్న అభిమానంతో చదరంగంలో ఉపయోగించే పావులను సేకరిస్తూ ఉంటారు. ‘కాబట్టి నా దగ్గరున్న పావులన్నింటినీ చూపిస్తాను’. ‘మఱియు నవసరోచితంబులగు వినోదంబులం బ్రమోదంబు పుట్టించుచు’- వినోదంతో ప్రమోదం పుట్టిస్తాను, ప్రమాదం తీసుకురాను అన్నాడు. ‘వినోదంబులం బ్రమోదంబు పుట్టించుచుఁ బ్రసాదంబునకుం బాత్రుండనై’- వినోదంతో ప్రమోదమైన తరువాత ప్రసాదమునకు ప్రాప్తుడ నవుతాను. ‘కంకుండను నామధేయంబు ధరియించి’- కంకుడు అని పేరు పెట్టుకుంటాను.

               ఈ కంకుడు అనే పదానికి అర్థం ఏమిటి? కం కః- సంస్కృతంలోని పేరు. ‘కం’ - ఎవనిని గురించి, ‘కః’ అంటే 'ఎవడు', - ఎవనికి ఎవరితో సంబంధం ఉంది? అటువంటి సంబంధ బాంధవ్య జనిత మోహభ్రాంతులకు అతీతుడు. కంకుడు అంటే యమధర్మరాజు అని అర్థం. తాను యమధర్మరాజు తనయుడు కాబట్టి ‘ఆత్మా వై పుత్రనామాసి’- కాబట్టి ఆయన పేరే గ్రహించాడు. ‘క’ ధాతువుకు ‘క'కి'- గతౌ’ వెళ్ళుట అని అర్థం. ప్రతివానిని తీసుకునిపోయేదేదో దానికి అధిష్ఠానదేవత అయినవాడు యముడు. తన జన్మకు కారకుడయిన యమధర్మరాజుకు మరొక పేరైన ‘కంకుడ’నే పేరు పెట్టుకుంటానన్నాడు. ‘చరియింతు అయ్యుర్వీశ్వరుండు మత్పూర్వ వర్తనం బడిగె నేనియు ధర్మపుత్రు తోడి మైత్రిన్ తగలి అతని పాల వసింతు ననం గలవాడ’- పూర్వపు వృత్తాంతాన్ని ఆ రాజు అడిగితే ధర్మరాజువద్ద ఉండేవాడనని చెప్తాను. ధర్మరాజు ‘నేను కంకుడను ధర్మరాజుగారి దగ్గర ఉండేవాడను’ అంటే విరటునికి అనుమానం రాదా? దీన్ని రెండు విధాలుగా ఆలోచించవచ్చు. ‘ఆ పాండవుల దగ్గర ఉండేవాళ్ళం, వారు దేశాలు పట్టిపోయారు. మేము నిరాశ్రయులమై పోయాం, అంతటా తిరిగి తిరిగి మీ దగ్గరకి వచ్చాం’ అని అర్థంచేసుకోవచ్చు.

 

Player
>>