పాండవుల వృత్తినిర్ణయం3

వలలునిగా భీముడు...

               ‘అనిలతనయుని నిరీక్షించి’- తన పని అయిపోయింది. ఆయన చేయదలచుకున్నది చెప్పిన తరువాత భీముని చూచాడు. భీముణ్ణి చూస్తూనే ధర్మరాజుకు దిగులు కలిగింది. చిన్నప్పటినుంచీ కౌరవులతో, ముఖ్యంగా దుర్యోధనుడితో బాధలు పడినవాడు వీడే. ఊహ తెలిసిననాటినుంచీ వీళ్ళందరినీ బాధల్లోంచి ఉద్ధరించినవాడు కూడా భీముడే. ఒక్కసారిగా అవన్నీ గుర్తుకు వచ్చాయి. ‘నిరీక్షించి తత్కాల జనితంబయిన ఖేదంబునం దొరఁగ, సమకట్టు బాష్పజలంబులు మగుడ నింకించుచు’- నేనైతే గౌరవంగా కంకభట్టనే నామంతో గడుపుతాను. నా మర్యాద నిలుస్తుంది. కానీ భీముడు ఎక్కడకి పోతాడు? భీముడి స్వభావం ఎటువంటిది? ఎటువంటి ఉద్ధతమైన ప్రవర్తన గలిగినవాడు?

               ‘కడిమిమై సౌగంధికమున యక్షుల మదమడఁచి కృష్ణకుఁ బువ్వు లట్లు దెచ్చె’- అలనాడు, ఏదో ద్రౌపది ఒక పూవడిగింది కదా అని యక్షులతో యుద్ధంచేసి మరీ తీసుకుని వచ్చాడు. ‘కిమ్మీర దానవు నమ్మెయి నిర్జించి విగత కంటకముఁ గావించె వనము’- మనము అరణ్యవాసానికి వచ్చినపుడు బకాసురుని సోదరుడైన కిమ్మీరుడిని సంహరించి వనంలోని వారికందరికి దుఃఖంలేకుండా చేశాడు. ‘బకదైత్యుఁ దొడరి యా భంగి రూపఱ జేసి రక్షించె నేకచక్ర పురంబు’- అందరికీ గుర్తు చేస్తున్నాడు. ‘ఆహా, ఆ రోజు బాగా గుర్తుంది. ఆ విప్రదంపతులు రోదిస్తున్నారు. మేం వెళ్తాం అంటే మేం వెళ్తాం అని పిల్లలు దంపతులు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు మన తల్లిగారు వెళ్ళి భీముణ్ణి పంపిస్తాం అన్నది గుర్తుంది’. ‘ఆ భంగి రూపఱ జేసి’- ఆ భంగి అనే మాటలో ఎన్ని అర్ధాలున్నాయో! మనం ఊహించుకోగలగాలి. ‘అప్పాటఁ బ్రబలు జటాసురు నడరి దండితుఁ జేసి మనలఁ బెట్టించుకొనియె’- పాండవులు గంధమాదనపర్వతం దగ్గరకి వెళుతున్నప్పుడు జటాసురుడనే రాక్షసుడు వచ్చాడు. ఆ జటాసురుని సంహరించి మనలనందరినీ కాపాడాడు. ఇతడు ఇవన్నీ చేశాడని ఆయన పరాక్రమాన్ని పొగడడం కాదు. ఆయన తన అసలు భయం ఇప్పుడు చెప్తున్నాడు. ధర్మరాజు ‘ఇతఁడు పుట్టిన కోలెను నెసఁక మెసఁగ దర్పమునన వర్తిల్లు నుదగ్రమూర్తి’- భీమునిలోని ఉగ్రస్వభావం చూస్తే పుట్టినప్పటినుంచి ఎవడైనా ఏమన్నా అంటే, వెంటనే వాడి మీద పడి వాడిని ఏదో ఒకటి చేయడమే కాని అణిగిమణిగి ఉండటం కానీ, లేకపోతే అంగీకరించి తరువాత ఆలోచిస్తాం అనే విధానం కానీ లేదు. అయితే ఆ చేయటం విశృంఖలంగా, సమయ సందర్భాలు గమనించక విచక్షణారహితంగా, బాధ్యతారహితంగా చేయటం కాదు. రాత్రిపూట హిడింబాసురుడు వచ్చినపుడు వీళ్లకి నిద్రాభంగం అవుతుందని వాణ్ణి ఈడ్చుకొనిపోయి, యుద్ధం చేస్తూ కూర్చున్నాడు, కిమ్మీరుడిని కూడా పక్కకు తీసుకుపోయి దంచడం మొదలుపెట్టాడు. ఒక్కొక్కణ్ణీ ఒక్కొక్క విధంగా చంపాడు. ఈ ఉద్ధతమైన స్వభావం కల -‘ఇతడు అకట ఒరు చిత్తమున కెక్కునట్లు గాఁగ మెలగి యేమి విధంబునఁ గొలుచువాఁడు’- ఇదీ ధర్మరాజుకు భీమునిపట్ల ఉన్న భయం. ఇటువంటి వాడు పోయి ఒకరి దగ్గర సేవ ఎలా చేస్తాడు? ఎలా ఉంటాడు? ‘అనిన విని భీమసేనుండు ఇట్లనియె’- అన్నగారి విచారం చూచిన భీమునికి కొద్దిగా జాలి కలిగింది. ‘నీకు తెలీదా నా సామర్థ్యం?’ అంటూ, 

తే.           నేను వంటలవాఁడనై ఆ నరేంద్రుఁ    
               గొలిచి గరగరగాఁ గూడు గూర చిత్త 
               మునకు వచ్చిన చందంబునన యొనర్చి         
               నేర్చి మెలఁగుదుఁ గరము వినీతి మెఱసి                        (విరాట.  1-76)

               ‘నేను వంటలవాఁనై ఆ నరేంద్రుఁ గొలిచి గరగరగాఁ గూడు గూర’- బాగా రుచిగా చేసి పెడతాను. కరకరగా చేసి పెడతాను, కమ్మగా వండి పెడతాను. 

Player
>>