పాండవుల వృత్తినిర్ణయం5

కొంచెం కారం చేసే పనిచేస్తుంది. అందుకని లవణాన్ని మానుకోకూడదు. ఆమ్లం-ఆమ్లం అంటే పులుపు. ‘ఆమయతీతి ఆమ్లం’– రోగాన్ని కలిగించేది పులుపు. ఆమయము అంటే రోగం, ఆయుర్వేద వైద్యులు ఎవరూ చింతపండుని తినమని చెప్పరు. నిమ్మపండుని పిండుకోమంటారు. ఆమ్లము అనే శబ్దం ఎక్కడనుంచీ వచ్చింది? కొంతమంది ఇలా నిర్వచించారు. ‘అంబతే ముఖ శబ్ద హేతుః’ పులుపు నోట పెట్టుకుంటూనే ‘స్స్’ అని వచ్చే చప్పుడును ‘అమ్ల’ అంటాం. ‘అంబతే ముఖ శబ్ద హేతుర్భవతి తత్ అమ్లః’. ‘కటువు’-కారం. వ్యాపించేది. ‘కటతి ఆవృణోతి’- తీసుకుంటే గొంతు మండుతుంది. గుండె మండుతుంది. కడుపు మండుతుంది. ఒళ్ళు మండుతుంది. వీటన్నింటికీ కారణం కారమే! అదీ లక్షణం. ఇక వీటిల్లో మిగిలినది కషాయం-కషాయం అంటే ‘కషతి కంఠం కషాయః’ వగరుగా ఉండేది. అది గొంతును పట్టుకుంటుంది. అటువంటి పదార్ధం తిన్నప్పుడు వెంటనే నీళ్ళు తాగి దాన్ని సరిచేసుకోవాలి. ఇవి ఆరు రసాలలో ఉండే ప్రధానమైన అంశాలు.

‘ఆరు రసంబులన్ జవులయందలి క్రొత్తలు పుట్ట’- ‘షడ్రసాల్లోని రుచులలో కొత్తదనం కలిగేటట్లు నేను వండి చూపిస్తాను’. దానిలో ఆ నేర్పు చూడాలి. -‘పుట్ట నిచ్చలున్ వేఱొక భంగి’- అంటే సంప్రదాయబద్ధమైన భోజనమే కాదు. క్రొత్త క్రొత్త రుచులు వండి చూపిస్తాను. ‘వేఱొక భంగి పాకములు విన్నను వొప్పగ జేసి’- అవి చూసేటప్పటికే కన్నుల పండుగగా ఉండాలి. రుచిని ఆస్వాదించి చెప్పక్కర్లేదు. ఆ విధంగా ప్రయోగాలు చేస్తే ఏ పదార్ధాలు వండినా నిన్నటి రోజున తిన్నాం అనిపించదు. ‘వంకాయ వంటి కూరయు, శంకరుని వంటి దైవం, పంకజముఖి సీత వంటి భామామణియున్’ లేరన్నారు కదా. అలా అని ‘పోయిన వారం వంకాయకూర అంత అద్భుతంగా చేశావ్, నీకేం వచ్చింది ఈ రోజు ఇలా తగలేశావు. అంటే ‘అయ్యా! నా తప్పేం లేదు, నేనేం చేయలేదు మీరే మారారు. నేను మళ్ళీ ఎక్కడ చేశాను, అదే కదా పెట్టడం’ అని అన్నాడు, ‘మార్పు మీలో ఉన్నది కాని నేను చేసిన కూర, అదే కూర తెచ్చిపెట్టాను. మీరు బాగాలేదంటే నేనేం చేయాలి?’. ‘చేసినన్ మీఱఁగ బానసీని నొకనిన్ బురిఁ గానని యట్లు గాఁగ’- ఇంతకన్నా మించినవాడు లేనేలేడు. అన్నట్లుగా ‘మేన్ కాఱియ వెట్టి యైన’- నా శరీరాన్ని శ్రమింపజేసి, ‘ఒడికంబుగ వండుదు కూడుకూరలున్’- అన్నీ జేస్తాను. బానసీడు. ‘నస’ అంటే వంట. అది తెలుగులోకి వచ్చేటప్పటికి బానస అయింది. మహానసము అంటే వంటశాల. ఆ నసను ఈ ‘బా’తో జేర్చాడు. ‘బానసీడు’ అంటే వంటల వాడు.

‘పఱియ వాపంగ దునియఁగా విఱువవలయు’- పఱియ కర్రలు అంటాం. ‘నెడలఁ గాళ్ళులఁ జేతుల దొడలఁ బట్టి కడఁగి యనువుగఁ జేసి ప్రొయ్యిడుదు గాని’- వాటిని పొయ్యిలో పెట్టేముందు విరవాల్సి వస్తే నాకు గొడ్డలి అవసరం లేదు. కాళ్ళు చేతుల మధ్య పెట్టుకుని విరిచి వినోదంగా అందరికీ చేసి చూపిస్తాను. ‘అడుగనే కట్టియలకు’- కత్తి, గొడ్డలితో నాకేం పని లేదు. కొంతమంది నిమ్మకాయను రెండు వేళ్ళమధ్య పెట్టి తుంచేవారు. బలంగా రెండు వేళ్ళమధ్య పెట్టి ‘హు’ అని బిగిస్తే నిమ్మపండు రెండు చెక్కలైపోతుంది. అయితే దానిలో రసం ఉండదు. పిప్పి మాత్రమే ఉంటుంది. ఈ ద్వ్యంగుళిమర్దనముచేత రెండు అంగుళాలమర్దనముచేత, ఆ కర్షణంచేత దానిలోని రసం పోతుంది. ‘సూపాధ్యక్షుడు కలిగిన’- సూపాధ్యక్షుడు అంటే వంటల అధికారి ఎవరైనా ఉంటే -‘ఆ పురుషుడితోడ సఖ్యమగునట్లుగా నే నేపాటనైన నడవగనోపుదు’- ఎంత మంచివాడో భీముడు! ‘తత్తత్ విధ ప్రయోగములు’- నా ప్రయోగాలు చేసేటపుడు ఆయనను, ఆ సూపాధ్యక్షుని అనుసరించుకొని చేస్తాను.

               ‘అట్లు గాక’ ‘జెట్టి తండంబుతోడఁ జేపట్టి’- ఎవరైనా మల్లులు వచ్చి కుస్తీ చేయమంటే ‘హొంతకారి రిచిన యట్ల’- హొంతకారి అంటే మల్లుడు. ఈ శబ్దం ఎలా ఏర్పడిందో కొంతమంది వివరించారు. యుద్ధం చేసేటపుడు హుం అని అంటారు. ఆ హుం అనే ‘కారము’ హుంకారము, ఓంకారము అన్నట్లుగా. ఆ హుంకారము చేసేవాడు హొంతకారుడు అయ్యాడు. ‘హొంతకారి విఱిచిన యట్టు లగ్గలిక’- హొంత అంటే ఇంకొక అర్థం పరిశ్రమ. నిరంతర వ్యాయామపరిశ్రమ చేసేవాడు హొంతకారి. ‘అట్టు లగ్గలిక విఱుతు’- ఆ హొంతకారిలా యుద్ధం చేస్తాను.

 

Player
>>