పాండవుల వృత్తినిర్ణయం7

      ‘దైవంబు కతంబున నాకు ఒక్క చందంబు అనువై యున్నయది’ - దైవానుగ్రహంచేత నాకు ఒక్క అనుకూలముంది. దీనికి ‘ఔఁగాదనుడా’- నేను చెప్పేదాన్ని విని ఔనో కాదో చెప్పగలరు. ‘ఔ కాదనుట’ అందరూ ముచ్చటించుకుంటున్నారు కదా! ఇప్పటివరకూ ధర్మరాజు, భీముడు చెప్పిన విషయాలను ఎవరూ కాదనలేదు. కానీ అర్జునుడు చెప్పే విషయానికి కాదనే అవకాశం ఉంది. అందుకని దీన్ని ‘ఔ కాదనుఁడా’ అంటున్నాడు. 

      ‘అమరనగరంబునకరిగిన యెడ నూర్వశి నన్ను నపుంసకుంగా శపియించిన’- స్వర్గానికి వెళ్ళిన సమయంలో ఆ ఊర్వశి శపిస్తే ‘నాకేశుండు’- ఇంద్రుడు కరుణించి ఈ‘శాపఫలంబు నీవు అజ్ఞాత వాస వత్సరమున అనుభవించి తదనంతరంబ శాపమోక్షంబు వడయుమని దీవించె’- నాకిప్పుడు చాలా అనుకూలమైనది. ‘దైవ వశంబున వచ్చిన చందము, కావున పేడి తనంబు దాల్చి’– నా పౌరుషాన్నంతా వదలివేసి, పేడితనముతో ఉండి ‘బాహువుల దీర్ఘత్వంబునకు’- ఇంతపెద్ద ఆకారం ఉంది కదా! ‘బాహువుల దీర్ఘత్వంబునకు గుణకిణంబులకు’- వింటినారిని మోగిస్తున్నందువల్ల వచ్చే కిణము ఆ గుణకిణసముదాయము ఎక్కడుంటుంది? భుజములపై ఉండే వానిని ఒక విధముగా ఆచ్ఛాదన చేసుకోవచ్చు. కానీ ఆ నారిని పట్టుకుని సారించేటప్పుడు, ఆ బాణాన్ని ఇట్లా పట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి నాలుగు, నాలుగు బాణాలు, అయిదు వైపులనుంచి ఐదు బాణాలు పట్టుకుని ఉండాలి, అలాంటప్పుడు పెట్టి లాగి, ఆ బాణాలు విడిచినప్పుడు చేతి వేళ్ళమధ్య కూడా కణుపులు కట్టి కాయలు కాస్తే దండముల మీద కూడా కాయలు కాస్తాయి. గుణకిణములు. నన్నయ్యగారు చెప్పారు, ‘కులిశవ్రణ కిణలాంకితుడు’ గరుత్మంతుడు మాతృదాస్య విమోచనం కోసం అమృతాన్ని తెస్తూ ఇంద్రునితో జరిగిన యుద్ధ సందర్భంలో వజ్రాయుధాఘాతంతో కణుపులు కట్టిన శరీరం కలిగినవాడు. వింటినారిని సంధించినందువల్ల కాయలు గట్టిన ఈ చేతివేళ్లని ఎలా దాచుకుంటావు, దీర్ఘబాహువులకు కంచుకము, రవిక వేసుకుంటానన్నాడు. కంచుకము చేతుల చివరివరకు ఆవరించి ఉంటుంది, కాబట్టి అవి కనపడవు, కనపడే ప్రసక్తి లేదు. గుణకిణంబులకు శంఖవలయంబులను మాటు చేసుకుని వేళ్లమీది కిణములు కనిపించకుండా శంఖవలయాలు అనే ఆభరణం ధరిస్తాను. శంఖవలయములు అంటే అయిదు ఉంగరాలను అయిదువేళ్ళకు పెట్టుకుని గొలుసులు ఉండి మణికట్టు దగ్గర గాజులాగా అమరి ఉంటుంది, దాని ఆకారము శంఖంవలె ఉంటుంది కనుక శంఖవలయము అని పేరు. దానిని ధరించి హస్తవిన్యాసము చేస్తుంటే అదొక శోభ. అట్టివానిని మాటు చేసుకుని ‘విరాటు కడకుఁ జని ఉత్తమ కన్యాజనులకు నృత్తము గఱపంగ నాకు నేర్పు గలదు’- ఉత్తమలైన కన్యలకు, అందరినీ నేను చేర్చుకోను. నృత్యంలో ఆరితేరిన వారికి మరింత విద్య నేర్పగలను. ‘తద్వృత్తమునకు నన్నేలుము అని కొలిచి యే బృహన్నల యను నామము తోడ’- బృహన్నల అనే పేరు పెట్టుకుంటాను. బృహన్నల పదానికి అర్థం బృహత్ అంటే వృద్ధి గొప్పది. ‘నల లరయో రభేదః రడయో రభేదః’ అని వ్యాకరణం చెప్తుంది. ‘ల’ ‘న’ కు అభేదం. నరుడు అర్జునుడికి మరో పేరు. అయితే ‘బృహన్నరః’ అని పెట్టుకోవాలి. నరః అనే పేరు అర్జునుడికి సార్ధకం అంటే ‘నయంత ఇతిః నరః’ అని వ్యుత్పత్తి. దేనిని నడిపించుకుంటాడు? ప్రపంచంలోని ఏ వస్తుసామగ్రి అయినా కావాలనుకుంటే దాన్ని సాధించుకునే నైపుణ్యం కలిగినవాడు నరుడు అర్జునుడు. నలుపుకు సంబంధించి తెలుగులో చమత్కారంగా ఇంకో అర్థం చెప్తారు, నల అంటే నలుపు, బృహన్నల కారునలుపు. -‘కన్యకాంతఃపురమున వర్తనమొనరించుచు లాసికతనమున’ ఈ తనము అనే పదాన్ని తిక్కనగారు ఎన్నోరకాలుగా వాడతారు. దయాతనము అంటాడు. అలాంటిదే లాసికతనము. లాసికతనము నాట్యంలో లాస్యంతో చేసేది. నాట్యంలో ఉండే సుకుమారమైన అంగ విక్షేప ప్రధానమైన భంగిమలు కలిగి ఉండేది లాస్యం. ఉద్ధతమైన శరీరతాండవం ఉండేది తాండవము. తాండవము లాస్యము వీటికి మధ్యలో ఉండేది తాళమైనది ‘తకారః శంకరప్రోక్తం’. తకారము అనేది శంకరునికి నిర్దేశమైతే ‘లకారః శక్తి రుచ్యతే’ లకారం అనేది అమ్మవారికి పార్వతీదేవికి నిర్దేశించారు. ఆయన చేసేది తాండవమైతే ఈమె చేసేది లాస్యమైంది.

Player
>>