పాండవుల వృత్తినిర్ణయం8

‘శివశక్తిసమాయుక్తా’ శివశక్తుల యొక్క ఏకీకరణ రూపమే ‘తాళమిత్యబిధీయతే’ రాగతాళచింతామణిలో తాళానికి ఇచ్చిన నిర్వచనమది. ‘లాసికతనమున నిపుణుండనై అతని మెప్పింతును, మానవపతి నన్నెక్కడి దానవు నీవు అనియెనేని’ ద్రౌపది దగ్గర ఉన్నానని చెప్తాను అన్నాడు. సరే! ఇక నకులుని వైపు చూచాడు.

నకులసహదేవుల వృత్తినిర్ణయం...

‘ఒప్పెడు మేనుఁ బెంపు గల యుల్లము నాగరికంపుఁ జందముం జెప్పక జూపకీతని విశేషము దెల్పెడు’- చాలా కోమలమైన దేహంతో ఉండేవాడు, నాగరికమైన ప్రవర్తన, వీడు అని చూపకపోయినా ఈతని విశేషం తెలిసిపోతుంది. చూపకుండానే ఇతని గుణం చెప్తుంది. ఇతడు ‘కొలుచుట ఎంతయున్ డెప్పరున్’ కనుక్కుంటారని కాదు బాధ. ఇంత కోమలంగా ఉండేవాడు సేవలు ఎలా చేస్తాడు? ఎంతో కష్టం కదా! ‘కడు విచారమగు’ అనుకున్నాడు. అప్పుడు నకులుడు, అన్నగారూ! మీరు నాగురించి ఎంత మాత్రం ఆలోచించవద్దు. ‘అశ్వశిక్షకుండనై మత్స్య భూవిభుఁ కొల్చువాడ’- నేను అశ్వశిక్షకుడనౌతాను. గుర్రాలను పాలించడానికి తగిన విద్య నాకు తెలుసు. -‘గుఱ్ఱములకు వలయు తెఱగు లెల్ల చాలా ఎఱుఁగుదు’- నాకు అశ్వాల శిక్షణలో ఉన్న నైపుణ్యం నీకు తెలీదు. ‘గోడిగ జాతిలోఁ గొదమ పెంటుల నేర్చి మావుల హత్తించు మార్దవంబు’- మావులు అంటే మగ గుఱ్ఱములు, గోడిగ అంటే ఆడ గుఱ్ఱములు, ఈ ఆడు గుఱ్ఱాలకు ‘గోడిగ జాతిలో కొదమ పెంటుల నేర్చి’- యవ్వనంలో ఉండే ఆడుగుఱ్ఱాలను గ్రహించి మావుల హత్తించు మార్దవంబు ఒకదానితో ఒకటి కలపడం. అది అశ్వశిక్షణలో ఒక భాగం. ‘త్రాళ్ళ పట్టింపంగ తఱియైన కొదమల సంచంబు లెఱిగి శిక్షించు నేర్పు’- త్రాళ్ల పట్టింపంగ దరియైన కొదమల దాన్ని తాళ్ళతో పట్టుకుంటాం అంటే మామూలుగా స్వాధీనం కాని పొగరు గుఱ్ఱాలను వాటిని శిక్షించగల విధానంలో నేర్పు. ‘కళ్యాల పదిలంబు గాని’- గుఱ్ఱంబుల నోట్లో కళ్ళెం పెట్టాలంటే గుఱ్ఱాలు అంత సులభంగా పెట్టించుకోవు. కళ్ళాలను బిగించి కట్టి సాధించడానికి వీలులేనట్టి, దీటైన గుఱ్ఱా లైనప్పటికీ ‘క్రొత్త ముట్టున కియ్యకొలువు’- క్రొత్త ముట్టు అంటే సున్నితముగా ఉన్న ముడి, చిన్న సుకుమారమైన దారాలతో అల్లిన ముడితో దాన్ని పట్టుకుంటాను. పెనఁగు -‘శూకలముల బిరుదు తనంబులఁ జలము డింపగ తీర్పఁజాలుటయును’- శూకలము అంటే పొగరుగా ఉండే గుఱ్ఱము. అటువంటి విచారకరమైన ప్రవర్తన కలిగిన అశ్వాన్ని కూడా నేను లొంగదీసుకుంటాను.

‘అలవరించిన వాడ, లాయమున ఉన్నప్పుడు’- లాయము అంటే అశ్వశాల, ఎన్ని పదాలు నేర్పిస్తున్నారు తిక్కనగారు మనకు. లాయము వేరు, గోశాల వేరు, గజశాల వేరు ఒక్కొక్కదానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. లాయము అంటే అశ్వాలు ఉండే ప్రధానస్థానానికి పేరు. ‘ఉన్నయపుడుఁ దొసగించుకయులేని యట్లు గాఁగ మాటిమాటికిఁ బరికించి’ అశ్వశాలలో వానిని కట్టి ఉంచినపుడు ఏమాత్రం ఏమరకుండ ‘మందడీలకెల్ల నూఱట యగుచు వర్తిల్ల నేర్తు’ మందడీలు అంటే ఈయనతో పాటు ఇంకా ఆ ఉద్యోగంలో ఉండేవాళ్ళు. నా మందలో ఉన్నవాళ్ళు. సహోద్యోగులు. మందలో ఉండేవాళ్ళు మందడీలు. వారందరికీ సుఖంగా అనిపించేలా మెలగుతాను.  ‘దామగ్రంథి అనగ ఒక నామం పెట్టుకొనువాఁడ’- దామగ్రంథి, దామము అంటే పలుపుతాడు. దానికి గ్రంథి – ముడి. కాబట్టి అశ్వాలను ముడివేసేవాడిని కాబట్టి దామగ్రంథి అని పేరు పెట్టుకుంటాను. అనిన -‘కడు లెస్స’- నకులా, ఇంతవరకు మాట్లాడకుండా ఏదో పనులు చేసుకుంటూ ఉంటావు అనుకుంటున్నాం. గుఱ్ఱాలగురించి ఇంత తీవ్రంగా ఎలా తెలుసుకున్నావని ధర్మరాజు ఆశ్చర్యపోయాడు.‘కడు లెస్స అని నెమ్మనమున నూఱడి విభుం డమానుషతేజోధనుడఁగు సహదేవుఁ గనుంగొని’- ఆహా! -‘అకుటిలుడు ఆర్యసమ్మతుండు’ ఇతను ఎంతో ప్రేమగా పెరిగినవాడు, చిన్నవాడు. అక్కడ ఎలా గడుపుతాడు? ‘అనుడు నతఁడు తన చిత్తంబున తోచిన విధము’- ఇలా చెప్పాడు. ‘పుట్టిన యుత్తలపాటు గొంత డిందుపడంగన్’- ధర్మరాజులో కలిగిన ఉద్దేశ్యాన్ని తిరస్కరించునట్లు చెప్పాడు. ‘కీలారితనమునకు నే జాలుదును’- అక్కడ అర్జునుని విషయంలో లాసికతనము అంటే ఇక్కడ కీలారితనము. ఈ కీలారి ఎక్కడొచ్చాడు మనకు? అరణ్యపర్వంలో ఎఱ్ఱాప్రగడ ఈ కీలారితనం అనే మాటను ప్రయోగించాడు. 

Player
>>